Asianet News TeluguAsianet News Telugu

coronavirus : హాస్పిట‌ల్ నుంచి పారిపోయిన 13 మంది కోవిడ్ పేషెంట్లు. పంజాబ్ లో ఘ‌ట‌న‌..

ఇటలీ నుంచి పంజాబ్ కు వచ్చిన ప్రయాణికుల్లో 125 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారిని హాస్పిటల్స్ తీసుకెళ్లి చికిత్స అందిస్తుండానే అందులోని 13 మంది ప్రయాణికులు తప్పించుకొని పారిపోయారు. వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

13 covid patients who escaped from the hospital. Incident in Punjab ..
Author
Punjab, First Published Jan 7, 2022, 12:58 PM IST

కోవిడ్ -19 (covid-19) క‌ల‌వ‌ర‌పెడుతోంది. రోజు రోజుకు దేశంలో కేసులు పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఏకంగా ల‌క్ష కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోద‌వ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ (omicron veriant)కేసులు కూడా అధికంగానే న‌మోద‌వుతున్నాయి. గ‌త నెల డిసెంబ‌ర్ రెండో తేదీన వెలుగులోకి వ‌చ్చిన కొత్త వేరియంట్ కేసులు ఇప్ప‌టి వ‌ర‌కు 1500 దాటాయి. అయితే కొత్త వేరియంట్ కు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు, స్వ‌ల్ప తీవ్రత క‌లిగి ఉండ‌టం కొంత ఊర‌ట‌నిచ్చే అంశం.

క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం క‌ఠిన నిబంధ‌న‌లు అమలు చేస్తోంది. అందులో భాగంగా విదేశాల నుంచి వ‌చ్చే వారికి త‌ప్పనిస‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. పాజిటివ్ గా తేలిన వారిని హాస్పిట‌ల్స్ కు త‌ర‌లించి చికిత్స అందిస్తోంది. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉన్న ప్ర‌తీ రాష్ట్రం ఈ విధమైన చ‌ర్య‌లే తీసుకుంటున్నాయి. అయితే పంజాబ్‌లో ఇలా విదేశాల నుంచి వ‌చ్చిన ప‌లువురికి కోవిడ్ నిర్ధార‌ణ అయ్యింది. వారిని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తుండ‌గానే వారి అక్క‌డి నుంచి త‌ప్పించుకొని పారిపోయారు. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. 

ఇటలీ లోని  మిలన్ నుంచి పంజాబ్‌లోని అమృత్ స‌ర్ కు వ‌చ్చిన చార్టర్ విమానంలో 125 మందికి కోవిడ్ నిర్ధార‌ణ అయ్యింది. వారినంద‌రినీ అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో 13 మంది రోగులు డాక్ట‌ర్లు, ఆరోగ్య సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకొని పారిపోయారు. ఈ ఘ‌ట‌న గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ గురుప్రీత్ సింగ్ ఖెహ్రా మీడియాతో మాట్లాడారు. 13 మంది కోవిడ్ రోగులు ఆరోగ్య అధికారుల‌ను మోస‌గించిన పారిపోయార‌ని తెలిపారు. శుక్ర‌వారం ఉదయం వరకు తిరిగి రాని వారి ఫొటోల‌ను వార్తాపత్రికలో ప్రచురిస్తామని చెప్పారు. వారిపై అంటువ్యాధి చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాస్‌పోర్ట్‌లను రద్దు చేయడానికి చర్యలు ప్రారంభిస్తామని అన్నారు. 

179 మంది ప్ర‌యాణికుల‌తో వ‌చ్చిన చార్ట‌ర్డ్ విమానం..
పోర్చుగల్‌కు చెందిన యూరో అట్లాంటిక్ ఎయిర్‌వేస్ కు చెందిన యూవీ - 661 (YU-661) చార్టర్ విమానం గురువారం ఉద‌యం 11.30 నిమిషాల‌కు అమృత్‌సర్ కు వ‌చ్చింది. ఇందులో179 మంది ప్ర‌యాణికులు ఉండ‌గా.. 125 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయ్యింద‌ని  ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వీకే సేథ్ తెలిపారు. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇటలీ ‘‘రిస్క్ జోన్’’ లో (risk zone) ఉన్న దేశంగా న‌మోదై ఉంది. అందుకే చిన్న పిల్ల‌ల‌ను మిన‌హాయించి విమానంలో వ‌చ్చిన 160 మంది ప్ర‌యాణికుల‌కు కరోనా ఆర్టీపీసీఆర్ (RT-PCR) ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇందులో 125 మందికి పాజిటివ్ గా తేలింది. నెగిటివ్ గా తేలిన 35 మందిని సెల్ప్ క్వారంటైన్ లో ఉండాల‌ని అధికారుల‌ను సూచించారు. పాజిటివ్ గా తేలిన వారంద‌రినీ హాస్పిట‌ల్స్ త‌ర‌లించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios