రిటైర్ అవ్వబోతున్న ఓ కేరళ ప్రొఫెసర్ కు తన సహోద్యోగినులు అరుదైన కానుక ఇచ్చారు. జీవితకాలంలో మరిచిపోలేని అనుభూతిని అందించారు. వారి అభిమానానికి ఆమె ఆనందభాష్పాల్లో తడిసి ముద్దయ్యారు. 

కేరళ : ఓ కేరళ ప్రొఫెసర్‌కు సహోద్యోగినులు ప్రత్యేకమైన వీడ్కోలు ఇచ్చారు. ఆమెకు ఫేర్ వెల్ ఇచ్చే సందర్భంగా 12 మంది ప్రొఫెసర్లు 12 రవివర్మ పాత్రలుగా తయారై క్యాట్‌వాక్ చేశారు. ఇది ఎర్నాకులంలోని సెయింట్ థెరిస్సా కాలేజీకి చెందిన పన్నెండు మంది అధ్యాపకుల ఆలోచన, కాలేజీ ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పదవీ విరమణ చేస్తున్న డాక్టర్ ఆర్ లతా నాయర్‌కు సర్ ఫ్రైజ్ గా ఇలా ప్లాన్ చేశారు. రవివర్మ పెయింటింగ్స్‌లో క్యారెక్టర్లుగా ముస్తాబై.. అలాగే హావభావాలు పలికిస్తూ... క్యాట్‌వాక్ చేశారు. 

అయితే ఇలా చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. రిటైర్ అవుతున్న ప్రొఫెసర్ లత రవివర్మ చిత్రాలకు వీరాభిమాని. అందుకే ఆమె అభిరుచికి తగ్గట్టుగా అద్వితీయ వీడ్కోలును ప్లాన్ చేశారు. ఇందులో టీచర్లు లక్ష్మీప్రియ సైరంధ్రిగా, నివేదిత శకుంతలగా, డాక్టర్ బీనా ఆన్ జోసెఫ్ కాదంబరిగా కనిపించారు. ఈ వీడ్కోలును ఇంత గొంత సర్ ఫ్రైజ్ ను అస్సలు ఊహించని ప్రొఫెసర్ లత తన సహోద్యోగుల అభిమానానికి మంత్రముగ్ధురాలైంది. దీంతో వేదికపై సంతోషంతో కన్నీరుమున్నీరైంది. బికామ్ విద్యార్థిని శ్రీలక్ష్మి పాత్రలకు కొరియోగ్రఫీ చేశారు. 33 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత రిటైర్ అవుతున్న లతకి ఇంతకంటే గొప్ప బహుమతి, అరుదైన జ్ఞాపకం ఇంకోటి ఉండదు.