రెండు రోజుల క్రితం దేశ వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యవత్మాల్ పరిధిలోని ఒక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపధ్యంలో అక్కడి ఆరోగ్య కార్యకర్తలు 12 మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించారు. దీంతో వారు కొద్దిసేపటి తరువాత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు.

ప్రస్తుతం ఆ చిన్నారులంతా చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరు బాధిత చిన్నారుల తండ్రి కిషన్ శ్యామ్‌రావు మీడియాతో మాట్లాడుతూ తమ పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసిన కొద్దిసేపటి తరువాత వారు వాంతులు చేసుకున్నారన్నారు. ఈ విషయాన్ని తాము ఆరోగ్య కార్యకర్తలకు తెలియజేయడంతో వారు పోలియో డ్రాప్స్‌కు బదులు హ్యాండ్ శానిటైజర్ తాగించామని తెలిపారన్నారు. తరువాత వారు తిరిగి తమ చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారన్నారు. కాగా ఈ ఉదంతం ఉన్నతాధికారుల వరకూ చేరడంతో వారు ఒక ఆశా కార్యకర్తను సస్పెండ్ చేసి, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.