ప్రధాని నరేంద్రమోదీ వచ్చే ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేయనున్నారు. కాగా.. ఆయనకు పోటీగా 111మంది ఎన్నికల బరిలో నిలవనున్నారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో 111 మంది తమిళ రైతులను బరిలో నిలపనున్నట్లు దక్షిణాది నదుల అనుసంధాన పథక రైతు సంఘాల అధ్యక్షుడు అయ్యాకన్ను వెల్లడించారు. 

తమ న్యాయమైన  కోరికలను తీర్చాలంటూ గతంలో అయ్యాకన్ను నేతృత్వంలో వేల సంఖ్యలోరైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. దాదాపు 15రోజుల పాటు ఆందోళన చేసి.. రోజుకో వేషధారణతో వినూత్నంగా నిరసన తెలిపారు.  కావేరి వ్యవహారం, పంట రుణాల సమస్య, ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు వినూత్నంగా ఉద్యమించారు.

 ఈ నేపథ్యంలో తమిళ రైతుల సమస్యలను జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు సార్వత్రిక ఎన్నికలను ఆయుధంగా మలచుకోవాలని రైతులు నిర్ణయిం చారు. ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ పోటీచేయనున్న వారణాసిలో లేదా ఆయన ఎక్కడ పోటీచేసినా 111 మంది రైతులను బరిలోకి దింపి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నట్లు అయ్యాకన్ను మీడియాకు తెలిపారు.