రాజస్థాన్‌లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో పురుగు మందుల వాసన వస్తుండటంంతో విషవాయువులు విడుదలవ్వడంతో వారు మరణించి వుంటారని భావిస్తున్నారు.

వీరంతా పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూ శరణార్థుల కుటుంబం. జోథ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలోని దియోదు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే వీరు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా మూకుమ్మడిగా ఆత్మహత్యలకు పాల్పడి వుంటారని స్థానికులు భావిస్తున్నారు.

భారత పౌరసత్వం పొందేందుకు బాధిత కుటుంబం 2012లో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతం నుంచి రాజస్థాన్‌కు తరలివచ్చింది. అప్పటి నుంచి వీరు శరణార్ధి శిబిరంలో తలదాచుకుంటున్నారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఘటన జరిగిన సమయంలో ఇంటిలో లేకపోవడంతో ఓ కుటుంబ సభ్యుడు ప్రాణాలతో బయటపడ్డాడని స్థానికులు చెబుతున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో యూపీలోని శాంతినగర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇదే తరహాలో మరణించారు. గతేడాది డిసెంబర్ 14న ఆర్ధిక ఇబ్బందులతో తమిళనాడులోని మధురైలోని రైల్వే ట్రాక్‌పై ఒకే కుటుంబానికి చెందిన నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డాడు.