దేశ రాజధాని న్యూఢిల్లీలో   కంఝవాలా కేసులో  11 మంది పోలీసులను సస్పెండ్  చేసింది  పోలీస్ శాఖ.  కేంద్ర హోంశాఖ సిఫారసు మేరకు  11 మంది పోలీసులను సస్పెండ్  చేశారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కంఝవాలా కేసులో 11 మంది పోలీసులపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకుంది. 11 మంది పోలీసులను సస్పెండ్ చేసింది. కారుతో అంజలిని అనే యువతిని ఢీకొట్టి కిలోమీటర్ల దూరం తీసుకెళ్లిన కేసును కేంద్ర హోం శాఖ సీరీయస్ గా తీసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళను కారుతో ఢీకొట్టి కొన్ని కిలోమీటర్ల దూరం మహిళను ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సమగ్రమైన నివేదికను అందుకుంది. ఈ నివేదిక ఆధారంగా ఘటన జరిగిన రోజున విధుల్లో ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుండి ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ ఆరోరాకు సిఫారసు చేసింది.ఈ సిఫారసు మేరకు 11 మందిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది..ఈ కేసు దర్యాప్తు సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పర్యవేక్షక అధికారులకు కూడా నోటీసులు జారీ చేయాలని హోంశాఖ ఢిల్లీ కమిషనర్ కు సూచించింది. ఈ కేసులో నిందితులపై త్వరగా చార్జీషీట్ దాఖలు చేయాలని కూడా హోంశాఖ ఆదేశించింది. ప్రస్తుతం దేశ రాజధానిలో అమల్లో ఉన్న పీసీఆర్ సిస్టమ్ ను పూర్తిగా మార్చాలని కూడా హోంశాఖ ఢిల్లీ పోలీసులను కోరింది.

ఈ ఘటనపై నివేదికను ఇవ్వాలని స్పెషల్ కమిషన్ర ఆఫ్ పోలీస్ షాలిని సింగ్ కు హోంశాఖ బాధ్యతలు అప్పగించింది. రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపర్చడానికి చర్యలు తీసుకోవాలని కూడా హోంశాఖ కోరింది. ప్రజలు ముఖ్యంగా మహిళలు, పిల్లలు భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవించాల్సిన అవసరాన్ని హోంశాఖ నొక్కి చెప్పింది. 

ఈ నెల 1వ తేదీన అంజలిసంగ్ అనే యువతి స్కూటీపై వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి సుమారు 12 కిలోమీటర్లు ఆమెను కారుతో ఈడ్చుకెళ్లారు. సుల్తాన్ పూర్ నుండి కంఝవాలా వరకు ఆమెను ఈడ్చుకెళ్లారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న అంజలి స్నేహితులు నిధికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ కేసులో ఈనెల 2వ తేదీన దీపక్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో నిందితులను జ్యూడిషీయల్ కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఈ విషయమై పోలీసులు ఎందుకు ఆలస్యంగా స్పందించారో కూడా నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది.