జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని డీగ్ ప్రాంతానికి చెందిన  భరత్‌పూర్ రాజవంశానికి చెందిన రాజామాన్ సింగ్ అతని ఇద్దరు అనుచరులను హత మార్చిన ఘటనలో 11 మంది మాజీ పోలీసు అధికారులకు మధుర జిల్లా జడ్జి  యావజ్థీవ కారాగార శిక్షను విధించారు. 

35 ఏళ్ల క్రితం రాజామాన్ సింగ్ తో పాటు అతని ఇధ్దరు అనుచరులకు పోలీసులు మార్చారు. ఈ కేసును సీబీఐ విచారించింది. 18 మంది పోలీసులపై సీబీఐ చార్జీషీటు దాఖలు చేసింది. ఈ కేసు ట్రయల్ సమయంలోనే నలుగురు పోలీసులు మరణించారు. 

కోర్టు శిక్ష విధించిన వారిలో భరత్‌పూర్ ప్రాంతానికి చెందిన  మాజీ డిప్యూటీ ఎస్పీ కాన్ సింగ్ కూడ ఉన్నారు.

35 ఏళ్ల క్రితం రాజా మాన్ సింగ్ అతని ఇద్దరి అనుచరులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. రాజా మాన్ సింగ్ భరత్ పూర్ ను పాలించిన చివరి రాజు మహారాజా సవాయి విరిజేంద్ర సింగ్ సోదరుడు. అంతేకాదు  మహారాజా కిషన్ సింగ్ తనయుడు. 

మాన్ సింగ్ 1921 డిసెంబర్ 5వ తేదీన జన్మించాడు. ఇంగ్లాండ్ లో ఆయన ఇంజనీరింగ్ చదివాడు. డీగ్ నుండి ఆయన ఏడుసార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. 1952 నుండి 1984 వరకు ఈ స్థానం నుండి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.

రాజామాన్ సింగ్ కూతురు క్రిషేంద్ర కౌర్ దీప గత బీజేపీ ప్రభుత్వంలో టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు.క్రిషేంద్ర కౌర్ వినతి మేరకు రాజస్థాన్ నుండి ఈ కేసును మధుర కోర్టుకు సీబీఐ మార్చింది.

అప్పటి ముఖ్యమంత్రి శివ్ చరణ్ మాధుర్ హెలికాప్టర్ దెబ్బతిన హింసాత్మక ఘటనల తర్వాత 1985 ఫిబ్రవరిలో రాజా మాన్ సింగ్ అతని ఇద్దరు పోలీసుల కాల్పుల్లో మరణించారు.డీగ్ నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐఎఎస్ అధికారి విజేంద్ర సింగ్ తరపున ప్రచారం కోసం వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. 

ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగానికి ముందుగా రాజామాన్ సింగ్ కు చెందిన జెండాలను, బ్యానర్లను కాంగ్రెస్ కార్యకర్తలు తొలగించారు. దీంతో ఆగ్రహించిన రాజా మాన్ సింగ్ తన అనుచరులతో అక్కడికి చేరుకొన్నాడు. ఈ సమయంలో మాన్ సింగ్ అక్కడ గొడవ సృష్టించాడు. సీఎం వచ్చిన హెలికాప్టర్ ను తన జీపుతో ఢీకొట్టాడు. ఈ సమయంలో సీఎంను భద్రతా సిబ్బంది రక్షించారు. 

1985 ఫిబ్రవరి 21వ తేదీన కర్ఫ్యూ విధించిన తర్వాత భారీగా పోలీసులను మోహరించారు. పోలీసులకు లొంగిపోయేందుకు జీపులో వెళ్తున్న సమయంలో అప్పటి డీఎస్పీ కాన్ సింగ్ భట్టి భారీ పోలీసులతో వచ్చిన అనాజ్ మండి వద్ద తన తండ్రిపై కాల్పులకు దిగారని క్రిషేంద్ర కౌర్ ఆరోపించారు. 

రాజా మాన్ సింగ్ సహా అతని ఇద్దరు అనుచరులు సుమీర్ సింగ్, ఠాకూర్ సింగ్ పోలీసుల కాల్పుల్లో మరణించినట్టుగా చెప్పారు. ఈ తీర్పు నేపథ్యంలో కోర్టు వెలుపల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.