న్యూఢిల్లీ: కుంభమేళా సందర్భంగా ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో  వందలాది మంది గంగానదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ స్నానాలు కరోనాకు కేంద్రంగా మారాయి. మంగళవారం నాడు హరిద్వార్ లో  కొత్తగా 594 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో హరిద్వార్ పట్టణంలో 2,812కి కరోనా కేసుల చేరుకొన్నాయి. మహాకుంభమేళా 13వ రోజున పుణ్యస్నానాలు ఆచరించిన 408 మందికి సోమవారం నాడు కరోనా సోకింది.

గత 24 గంటల్లో 1925 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనాతో 13 మంది మరణించారు. దేశంలో కరోనా సేకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో గంగానదిలో పుణ్యస్నానాల కోసం వందలాది మంది భక్తులు కుంభమేళాకు వస్తున్నారు.నెల రోజుల పాటు సాగే మహాకుంభమేళాలో సుమారు ఒక్క మిలియన్ మంది పుణ్యస్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేశారు.

పోమవారం నాడు ఒక్క రోజునే సుమారు ఒక్క లక్షమంది పుణ్యస్నానాలు చేశారు. మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన భక్తుల్లో ఎక్కువమందికి మాస్కులు లేవు. అంతేకాదు భౌతిక దూరం కూడా పాటించడం లేదు.ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,12,071 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 1780 మంది మరణించారు.