దేశంలోని వ్యక్తిగత కంప్యూటర్లలోని ప్రైవేట్ సమాచారాన్ని చూసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుమతినిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. భారతీయులు పరస్పరం పంపుకునే ప్రైవేట్ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ ఎలాంటి అనుమతి లేకుండానే ఆ సమాచారాన్ని పరిశీలించేందుకు, అవసరమైతే అడ్డుకునేందుకు దేశంలోని 10 దర్యాప్తు సంస్థలకు కట్టబెడుతూ... కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబాబా ఆదేశాలు జారీ చేశారు.

‘‘ కంప్యూటర్‌లలో ఉన్న సమాచారంతో పాటు సెండ్ చేసిన, రిసీవ్ చేసుకున్న సమాచారంపై నిఘా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అవసరమైతే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు అడ్డుకుంటాయని కూడా హోంశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఐటీ చట్టం 2000 సెక్షన్ 69 కింద ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.  

ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైర‌క్ట్ ట్యాక్సెస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, సీబీఐ‌, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, క్యాబినెట్ సెక్రటేరియేట్‌, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్, డైర‌క్ట‌రేట్ ఆఫ్ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌( జమ్ము అండ్‌ కశ్మీర్‌, నార్త్ ఈస్ట్, అసోం) , ఢిల్లీ పోలీస్ కమీషనర్‌కు ఈ అధికారాలు ఉంటాయి.

విచారణ ఎదుర్కొంటున్న వారు దర్యాప్తు సంస్థలకు సహకరించని పక్షంలో 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ చర్యను కాంగ్రెస్, సీపీఎం సహా ప్రధాన ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమైన, అప్రజాస్వామికమైన ప్రాథమిక హక్కులపై దాడి అని దుయ్యబట్టాయి.