ఆస్పత్రిలోని ఐసీయూలో మంటలు చెలరేగి దాదాపు పది మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదం మహారాష్ట్రలోని భండారా జిల్లా జనరల్ హాస్పిటల్ లో చోటుచేసుకుంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

భండారా జిల్లా జనరల్ హాస్పిటల్ లోని సిక్ న్యూ బోర్న్ కేర్ యూనిట్ లో శుక్రవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది మరణించగా.. మరో ఏడుగురు చిన్నారులను రక్షించినట్లు హాస్పిటల్‌ సివిల్‌ సర్జన్‌ ప్రమోద్‌ ఖండతే పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 17 మంది చిన్నారులు ఐసీయూలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

సుమారు రాత్రి 2గంటల సమయంలో డ్యూటీలో ఉన్న ఓ నర్స్‌ గదిలో నుంచి పొగలు రావడాన్ని గుర్తించింది. ఆ తర్వాత ఆమె వెంటనే అధికారులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యను ప్రారంభించింది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.