మన దేశంలో రోడ్డు ప్రమాదాలు, ఆ ప్రమాదాలు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో 1.54 లక్షల మంది మరణించారు. ఇందులో ఓవర్‌స్పీడ్‌తో 1.07 లక్షల మంది మరణించారు. మొత్తం మరణాలో 67 శాతం మంది మృతుల వయస్సు 18 నుంచి 45 ఏళ్ల వయస్సు వారే ఉండటం గమనార్హం. 

న్యూఢిల్లీ: దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఏడాది క్రితంతో పోల్చితే రోడ్డు ప్రమాదాలు 12.6 శాతం పెరిగాయి. మరణాలు 16.9 శాతం, క్షతగాత్రుల సంఖ్య 10.39 శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో 1,53,972 మంది మరణించినట్టు వివరించింది. ప్రపంచం మొత్తం మీద రోడ్డు ప్రమాదాల్లో మరణించే ప్రతి 10 మందిలో ఒకరు భారతీయుడే అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతున్నది.

ఓవర్ స్పీడింగ్ వల్ల 1,07,236 మంది మరణించారని, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం మూలంగా 3,314 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. లేన్ ఇండిసిప్లీన్‌ కారణంగా 8,122 మరణాలు, ట్రాఫిక్ లైట్ ఉల్లంఘనల మూలంగా 679 మరణాలు చోటుచేసుకున్నాయని వివరించింది. డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడటం మూలంగా 2,982 మరణాలు, ఇతర కారణాలతో 31,639 మరణాలు సంభవించాయని పేర్కొంది.

ఇక హెల్మెట్లు, సీట్ బెల్ట్ విషయాలకు వస్తే.. టూ వీలర్ పై వెళ్లుతుండగా హెల్మెట్ ధరించక 32,877 మంది డ్రైవర్లు, 13,716 ప్రయాణికులు మరణించారు. కాగా, 8,438 మంది డ్రైవర్లు, 7,959 మంది ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించక పోవడం మూలంగా మరణించినట్టు వివరించింది. 

రాష్ట్ర, యూటీల పోలీసు శాఖల నుంచి క్యాలెండర్ ఇయర్ ఆధారంగా సేకరించిన సమాచారంతో మంత్రిత్వ శాఖ ఈ వివరాలను కూర్చింది.

Also Read: దేశంలో రోజుకు 86 అత్యాచారాలు.. ఆ రాష్ట్రాల్లో మహిళలపై నేరాలు అధికం.. ఎన్‌సీఆర్‌బీ నివేదిక

జాతీయ రహదారుల (ఎక్స్‌ప్రెస్ వే సహా)పై 1,28,825 యాక్సిడెంట్లు జరగ్గా.. అందులో 56,007 మంది మరణించారు. 96,382 యాక్సిడెంట్లు రాష్ట్ర రహదారులపై జరగ్గా అందులో 37,963 మంది చనిపోయారు. కాగా, ఇతర రోడ్లపై 1,87,225 ప్రమాదాలు జరగ్గా అందులో 60,002 మంది మరణించారు.

యాక్సిడెంట్‌లలో ఎక్కువ మరణిస్తున్న ఏజ్ గ్రూప్ 18 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే అధికంగా ఉన్నారు. మొత్తం మరణాల్లో 67 శాతం మంది ఈ ఏజ్ గ్రూపు వారే మరణించారు.

ఓవర్ స్పీడింగ్, రాంగ్ రూట్ వంటి వాటిని కేవలం మానవ తప్పిదంగానే చూడలేమని, రోడ్డు క్వాలిటీ అంశం కూడా అందులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ మరణాలు ఆయా కుటుంబాలకే కాదు.. కార్మిక శక్తిని కోల్పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ కూడా నష్టపోతుందని వివరిస్తున్నారు. ఈ మరణాలను కొవిడ్ మహమ్మారి మరణాలతో పోల్చుతున్నవారూ ఉండటం గమనార్హం.