తీవ్రమైన కడుపులో నొప్పితో బాధపడుతున్న ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది.  ఆమెను పరిశీలించిన వైద్యులు... ఆపరేషన్ చేయగా.... కడుపులో నగల దుకాణమే ఉందని గుర్తించారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్ లోని బీర్ భూమ్ జిల్లా రామ్ పుర హాట్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రామ్ పురహాట్ కి చెందిన ఓ మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఇటీవల ఆ నొప్పి మరింత తీవ్రం కావడంతో తట్టుకోలేక ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరిశీలించిన వైద్యులు కడుపులో ఏదో లోహం ఉందని గుర్తించారు. దానిని బయటకు తీయడానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు.

తాజాగా ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో బంగారం చూసి షాకయ్యారు. ఆ మహిళ కడుపులో నుంచి 1.6కేజీల లోహ వస్తువులు బయటపడ్డాయి. వాటిలో కొన్ని బంగారం, ఇత్తడి, ఇనుము వంటి లోహాలతో చేసిన గొలుసులు, చెవి దిద్దులు, గడియారం, నాణేలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. బాధిత మహిళకు ఆకలి ఎక్కవ అని.. దీంతో కనిపించినవన్నీ తినేసేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.