కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమికి తనను తాను భాద్యుడ్ని చేసుకుంటూ... రాహుల్ ఆ పదవికి వీడ్కోలు పలికారు. కాగా... సరైన అధ్యక్షుడిని ఎన్నుకోవడం కోసం పార్టీ నేతలు తిప్పలు పడుతున్నారు.

 రాహుల్ తన బాధ్యతల నుంచి తప్పుకొని చాలా రోజులు అవుతున్నా... ఆ పదవి చేపట్టేందుకు ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే... ఇంజినీర్ మాత్రం ఆ బాధ్యతలు తనకివ్వమని కోరాడు.  గజానంద్ హోసలే అనే యువ ఇంజినీర్.. తనకు ఒక్క అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ దశ, దిశలను మార్చి తన సత్తా ఏంటో చూపిస్తానంటున్నారు. ఈయన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

పూణేకి చెందిన గజానంద్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను తాజాగా కాంగ్రెస్ పార్టీకి ఓ దరఖాస్తు పంపించాడు. అది చూసి పార్టీ నేతలంతా షాకయ్యారు.

"కాంగ్రెస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారనేది ఇంకా తేలలేదు. అయితే..కాంగ్రెస్‌కు యువ నాయకత్వం అవసరమని స్వయంగా రాహుల్ చెప్పడంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను." అని గజానంద్ చెప్పుకొచ్చారు. అయితే తనకు ఎటువంటి రాజకీయ అనుభవం లేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. 

"నేను గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. రాజకీయాలతో నాకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు. ఒక సామాన్యుడిగానే మా గ్రామంలోని సమస్యలపై ఇప్పటివరకూ పోరాడాను. అధికారుల సహాయంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాను. ఇలాగే ప్రస్తుతం కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపగలననే నమ్మకం నాకుంది." అని కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. ఇందుకోసం తాను ఒక బ్లూప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నానని చెబుతున్నాడు.

విచిత్రమేమిటంటే.. అతనికి కనీసం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేదు.  ఈ విషయం కూడా అతనే స్వయంగా వెల్లడించాడు. తనకు కార్యకర్తగా కూడా సభ్యత్వం లేదని ... అలా రాజకీయ కెరేర్ మొదలుపెడితే ఎప్పటికీ కార్యకర్తగానే మిగిలిపోతానని అందుకే సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు.