మహారాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరిగాయి. ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే ఫడ్నవీస్ సీఎం పీఠం ఎక్కారు. ఆ ముచ్చట మూడు రోజులు కూడా నిలవలేదు. అజిత్ పవార్ డిప్యుటీ సీఎం పదవికి రాజీనామా  చేయడంతో.... ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయక తప్పలేదు. అధికారం బీజేపీకి చిక్కినట్లే చిక్కి చేజారింది. దీంతో.... ఆ అవకాశాన్ని శివసేన దక్కించుకుంది.

ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో శివసేన సీఎం పీఠాన్ని అలంకరించింది. ఈ  రాజకీయా పరిణామాలన్నింటి నడుమ... మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ భార్య  అమృతా ఫడ్నవీస్ ట్విట్టర్ లో స్పందించారు. కవిత రూపంలో ఆమె ట్వీట్ చేశారు.

‘‘మళ్లీ తిరిగి వస్తాం.. అదే సుహాసనను అందిస్తాం. ఇది శరదృతువు కాలం. వాతావరణంలో మార్పు కోసం వేచి ఉండండి.’’ అంటూ కవిత రూపంలో ఆమె హిందీలో ట్వీట్ చేశారు.
‘‘ మహారాష్ట్రకు ధన్యవాదాలు. మీ వాహిని( వదిన)గా ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఎంతగానో ఆదరించారు.  మీరు నా పై చూపించిన ప్రేమ చిరస్మరణీయమైనది. ఇప్పటి వరకు నా కర్తవ్యాన్ని నేను పూర్తి చేశాను. తన శక్తి సామర్థ్యాలకు మించి అన్ని పనులు ఉత్తమంగానే చేశాను.’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా... మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే డిసెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని శివాజీ పార్క్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మంగళవారం సాయంత్రం ముంబై ట్రైడెంట్ హోటల్‌లో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల నేతృత్వంలో ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

కూటమి నేతగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు కలిసి ఉద్ధవ్ థాక్రేను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. భారీ సంఖ్యలో విచ్చేసిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు నినాదాలతో హోటల్ ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. అనంతరం మూడు పార్టీల కీలక నేతలు రాత్రి 8.30కి గవర్నర్‌ను కలవనున్నారు. 

కాగా డిప్యూటీ సీఎం పదవిని ఎన్సీపీ, కాంగ్రెస్‌లు చెరో రెండున్నరేళ్లు పంచుకోనున్నాయి. ఎన్సీపీ నుంచి జయంత్ పాటిల్, కాంగ్రెస్ తరపున బాలాసాహెబ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశాలు జారీ చేశారు. బీజేపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కాళిదాస్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించనున్నారు.

సాయంత్రం 5 గంటలకు ప్రొటెం స్పీకర్ బలపరీక్షను నిర్వహిస్తారు. ఇదే సమయంలో సాయంత్రం 5 గంటల్లోపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ‌ని కలిసిన ఫడ్నవీస్ రాజీనామా లేఖను సమర్పించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయడం గమనార్హం.