లక్నో: ప్రియాంక గాంధీ వెనక సీట్లో కూర్చుని ప్రయాణించిన స్కూటర్ పై పోలీసులు ఫైన్ వేశారు. ఆ ఫైన్ ను తానే కడుతానని స్కూటర్ యజమాని రాజ్ దీప్ సింగ్ అంటున్నారు. డిసెంబర్ 28వ తేదీన లక్నోలో కాంగ్రెసు నేత ధీరజ్ గుర్జార్ నడుపుతుండగా స్కూటర్ వెనక ప్రియాంక గాంధీ కూర్చుని ప్రయాణించారు. 

ఆ స్కూటర్ పై పోలీసులు 6,300 రూపాయల జరిమానా వేశారు.  మాజీ ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురి నివాసానికి వెళ్లడానికి ధీరజ్ గుర్జార్ స్కూటర్ ను నడుపుతుండగా వెనక ప్రియాంక గాంధీ కూర్చున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినందుకు ధీరజ్ గుర్జార్ ను పోలీసులు అరెస్టు చేశారు. స్కూటర్ పై ప్రయాణిస్తూ ధీరజ్ గుర్జార్, ప్రియాంక గాంధీ హెల్మెట్లు ధరించనందుకు పోలీసులు జరిమానా వేశారు. 

పాలిటెక్నిక్ క్రాసింగ్ వైపు వెళ్తుండగా తాను ధీరజ్ గుర్జార్, ప్రియాంక గాంధీలను చూశానని, ప్రియాంక గాంధీ పెద్ద కుటుంబానికి చెందినవారు కాబట్టి ధీరజ్ తన స్కూటర్ ను అడిగాడని, ఆమెకు తన వాహనం ఇవ్వడానికి నిరాకరించలేకపోయానని రాజ్ దీప్ సింగ్ చెప్పారు. 

తన స్కూటర్ పై జరిమానా విధించినట్లు తాను 29వ తేదీ వార్తల్లో చూసినట్లు ఆయన తెలిపారు. ఆ జరిమానాను తానే చెల్లిస్తానని, దాన్ని ప్రియాంక గాంధీ నుంచి గానీ కాంగ్రెస్ నుంచి గానీ తీసుకోబోనని చెప్పారు. 

పోలీసులు అడ్డగించడానికి ప్రయత్నించడంతో ప్రియాంక గాంధీ స్కూటర్ సీటుపై కూర్చున్నారు. స్కూటర్ పై వెళ్లి ఆమె మాజీ ఐపిఎస్ అధికారి కుటుంబ సభ్యులను కలిశారు.