పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తారు. రోడ్డుపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి మరీ.. హెల్మెట్ ఏది అంటూ ప్రశ్నించారు.  ఇంతకీ మ్యాటరేంటంటే...

సోమవారం నుంచి పుదుచ్చేరిలో హెల్మెట్‌ తప్పనిసరి చేశారు. అలాగే, సీట్‌ బెల్ట్‌ ధరించాల్సిందేనన్న హుకుం జారీ అయింది. ఉదయం నుంచే హెల్మెట్, సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి అన్నది అమల్లోకి  రావడంతో కిరణ్ బేడీ నేరుగా రంగంలోకి దిగారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులను అడ్డుకొని వారిని నిలదీశారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆమె తన వంతు ప్రయత్నం చేశారు. 

ద్విచక్రవాహనంపై ఓ యువకుడు ఇద్దరు మహిళలను ఎక్కించుకొని వెళ్తుండగా.. వారి వాహనాన్ని ఆమె అడ్డుకున్నారు. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. అంతేకాదు.. బైక్ పై కూర్చున్న ఇద్దరు మహిళల్లో ఒకరిని బైక్ దింపి.. బస్సులో వెళ్లాల్సిందిగా సూచించారు. ఆ బైక్ నడిపిన యువకుడికి కూడా సీరియస్ గా క్లాస్ పీకారు. కారులో సీటు బెల్టు పెట్టుకోకుండా వెళ్తున్న వారిని సైతం ఆమె వదల్లేదు. కాగా.. ఆమె ట్రాఫిక్ పోలీసు అవతారం ఎత్తిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.