జమ్మూ-కశ్మీర్‌ అంశంపై భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో  రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపనంత వరకు ఆ దేశంతో చర్చలు జరపడం అసాధ్యమన్నారు. ఒకవేళ పాక్ తో చర్చలు జరపాల్సిన అవసరమే వస్తే... అది కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గురించి మాత్రమే ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు.

ఆదివారం రాజ్ నాథ్ సింగ్ హర్యానాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... కశ్మీర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. పీఓకే గురించి తప్ప మరే విషయం పాక్ తో తాము చర్చించమని తేల్చి చెప్పారు. ఉగ్రవాదంతో భారత్ ని నాశనం చేయాలని పాక్ ప్రయత్నాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రధాని నరేంద్రమోదీ  ఆచరణలో చూపారని చెప్పారు. పుల్వామాలో ఉగ్రవాద దాడి తర్వాత మన వైమానిక దళం పాకిస్థాన్‌లో బాలాకోట్‌పై దాడి చేసిందన్నారు. 

తమపై అసలు దాడే జరగలేదని మొదట పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుకాయించాడని... ఇప్పుడు ఆయనే..  బాలాకోట్‌ కన్నా పెద్ద దాడికి భారత్‌ సిద్ధపడుతోందంటున్నారు. అంటే బాలాకోట్‌లో ఉగ్రవాద స్థావరంపై మన యుద్ధవిమానాలు బాంబులు వేసినట్లు ఆయన అంగీకరించినట్లే కదా అని రాజ్ నాథ్ పేర్కొన్నారు.