ఆఫీసుకి ఎందుకు లేటు అయ్యింది.. అని పై అధికారి అడిగిన ప్రశ్నకు.. తన భాదలన్నీ ఎకరువు పెట్టుకున్నాడు ఓ అధికారి. ఇంతకీ ఆయన పడుతున్న కష్టాలు ఎంటో తెలుసా..?  ఇంటి పనంతా ఆయనే చేయాలట. ఆఫీసుకి వచ్చే ముందు పిల్లలను రెడీ చేసి స్కూల్ కి పంపించి.. భార్యకి స్నానం చేయించి.. కాళ్లు పట్టి ఆ తర్వాత వంట చేయాలి. అందుకే లేటు అవుతోంది అని ఉన్నతాధికారికి లేఖ కూడా రాశాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో పనిచేసే స్టెనోగ్రాఫర్ అశోక్ కుమార్ తరుచుగా కార్యాలయానికి లేటుగా వస్తుండటంతో ఇటీవల అసిస్టెంట్ కమిషనర్ ఎంఎస్‌ వర్మ దీనిపై తక్షణం వివరణ కోరారు. దీంతో అశోక్ కుమార్ తాను ఆఫీసుకు లేటుగా రావడానికి గల కారణాలను సవివరంగా అసిస్టెంట్ కమిషనర్‌కు ఒక లేఖలో విన్నవించుకున్నారు.

 ఈ లేఖలో అశోక్ కుమార్... ‘నా భార్య అనారోగ్యంతో ఉంది. మాకు ముగ్గురు పిల్లలు. వారికి స్నానాలు చేయించి, టిఫిన్ సిద్ధం చేసి స్కూలకు పంపించాల్సి వస్తోంది. అనారోగ్యంతో ఉన్న నా భార్యకు కూడా స్నానం చేయించి, కాళ్లుపట్టి, తరువాత వంట వండాల్సి వస్తోంది. పైగా రొట్టెలు సరిగా చేయలేకపోతున్నాను. అస్తవ్యస్తమైన రొట్టెలతోనే కడుపునింపుకోవాల్సి వస్తోంది. ఈ పనులన్నీ అయ్యాక నేను ఆఫీసుకు బయలుదేరుతుంటాను. పైగా రోడ్లన్నీ పాడయిపోయివున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ఉంటోంది. వీటన్నింటి కారణంగానే లేటవుతోంది. ఇక ముందు ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను’ అని పేర్కొన్నారు. 

కాగా ఈ లేఖను చూసిన అసిస్టెంట్ కమిషర్ విస్తుపోయినట్లు సమాచారం. ఇకముందు ఇలా జరగకుండా చూసుకోమని మందలించినట్లు తెలుస్తోంది.