లక్నో: తనను లైంగికంగా వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను సంప్రదించిన  బాలికకు చేదు అనుభవం ఎదురైంది. బాలిక ఫిర్యాదును స్వీకరించకపోకుండా అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగి వేధింపులకు గురి చేశాడు పోలీసు అధికారి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూరులో చోటు చేసుకొంది. 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  కాన్పూర్ కు చెందిన దినసరి కూలీ కుమార్తెను కొంత కాలంగా కొందరు దుండగులు లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. అయితే ఈ విషయమై బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీస్‌స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ థార్‌బాబు బాలిక పట్ల అసభ్యంగా మాట్లాడారు. చేతికి ఉంగరం ఎందుకు ధరించావు, ఒంటి నిండా ఎందుకు బంగారం వేసుకొన్నావు, నువ్వు ఎలాంటి దానివో తెలుసుకొనేందుకు ఇవి చాలు అంటూ హెడ్‌ కానిస్టేబుల్ అభ్యంతరకరంగా మాట్లాడారు.

 

 బాలిక తల్లిదండ్రులు కానిస్టేబుల్‌కు  ఏదో చెప్పబోతుండగా   వారిపై కానిస్టేబుల్ సీరియస్ అయ్యాడు.  ఈ దృశ్యాలను బాలిక సోదరుడు తన మొబైల్‌లో రికార్డు చేశాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వేధింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ థార్ బాబు నిర్వాకాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు.