దాడి చేశారు: డీఎంకె ఎమ్మెల్యే కొడుకుపై ఇంట్లో పనిచేసే బాలిక ఆరోపణ
డీఎంకె ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో పనిచేస్తున్న ఓ బాలికపై ఆయనపై ఆరోపణలు చేసింది. తనపై ఎమ్మెల్యే కొడుకు, కోడలు దాడి చేసిందని ఆరోపించింది.
చెన్నై: ద్రావిడ మున్నెట్ర కజగం (డీఎంకె ) ఎమ్మెల్యే కరుణానిధి కొడుకుపై కేసు నమోదైంది. 18 ఏళ్ల బాలికపై దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. డీఎంకె నాయకుడి కొడుకు, కోడలు ఆంటో మతివానన్, మార్లినాలు 18 ఏళ్ల బాలికను చిత్రహింసలకు గురి చేసినట్టుగా పోలీసులు చెప్పారు. బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించినట్టుగా పోలీసులు తెలిపారు.
ఇండియా టుడే కథనం మేరకు తన కొడుకు, కోడలిపై వచ్చిన ఆరోపణలను కరుణానిధి తోసిపుచ్చారు. బాధితురాలిని తన కొడుకు కోడలు బాగా చూసుకుంటున్నారన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆరోపణలను తన కొడుకు, కోడలిపై బాధితురాలు చేసి ఉంటుందన్నారు.షెడ్యూల్ కులానికి చెందిన మైనర్ బాలిక 12వ తరగతి విద్యార్ధిని. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ ప్రవేశ పరీక్ష కోసం కోచింగ్ లో చేరేందుకు గాను ఆ బాలిక మతివానన్ ఇంట్లో పనిచేస్తుంది.
ఈ విషయమై బాధితురాలు ఓ వీడియోను విడుదల చేసింది. ఓ ఏజంట్ ద్వారా తనకు మతివానన్ నివాసంలో పనికి కుదిరినట్టుగా పేర్కొంది.ఏడు నెలలుగా మతివానన్ ఇంట్లో ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలిపింది. వేతనం కూడ సరిగా చెల్లించలేదని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు తనపై దాడి కూడ చేసినట్టుగా ఆమె తెలిపింది. చిన్న పని చేయకపోయినా తనను కొట్టేవారన్నారు.
ఒక రోజు ఉదయం ఆరు గంటలకే భోజనం సిద్దం చేయాలని వారు ఆదేశించినట్టుగా చెప్పారు. అయితే అంతకు ముందు రాత్రి రెండు గంటల వరకు తాను నిద్రపోలేదన్నారు. అందుకే మరునాడు ఏడు గంటలకు నిద్ర లేచినట్టుగా బాధితురాలు చెప్పారు. సమయానికి భోజనం సిద్దం చేయని కారణంగా తన చేతులను కాల్చారని ఆమె ఆరోపించారు.
ఆమె ఎంత తీవ్రంగా గాయపడిన కూడ వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లలేదన్నారు. రాజకీయంగా తమ కుటుంబానికి పలుకుబడి ఉన్నందున సహాయం చేయడానికి ఎవరూ రారని మతివానన్, మార్లినా బాలికను బెదిరించినట్టుగా ఆ కథనం తెలిపింది.
పొంగల్ ను పురస్కరించుకొని బాలిక ఇంటికి వెళ్లిన సమయంలో గాయాలను గుర్తించారు. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు బాధితురాలిని పరీక్షించారు.
అయితే బాలిక కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ఫిర్యాదు ఇవ్వలేదు.
యువతిని చికిత్స నిమిత్తం ఉలుందూరుపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. అయితే బాధితులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. బాధిత కుటుంబం అందుబాటులో లేదని ఎన్‌డీటీవీ కథనం తెలిపింది. యువతిపై గాయాలు పాతవేనని వైద్యులు చెప్పారు. అయితే విచారణ తర్వాత వాస్తవాలు తేలుతాయని వైద్యులు తెలిపారు.
బాధితురాలు చదువుకునేందుకు తన కొడుకు, కోడలు సహకరించారని ఎమ్మెల్యే కరుణానిధి చెప్పారు. అంతేకాదు బాధితురాలికి ఆభరణాలు కూడ కొనిచ్చారన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
తాను సాధరణంగా మతివానన్ ఇంటికి వెళ్లననని ఎమ్మెల్యే కరుణానిధి చెప్పారు. తమను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు బాధితురాలు ఆరోపణలు చేస్తుందని కరుణానిధి చెప్పారు. చదువుకోవడానికి కూడ ఆమెకు సహాయం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.