దాదాపు ఆరు నెలల పాటు ఇంటికి తాళం వేసి ఉన్న ఇంట్లో.. కుళ్లిపోయిన స్థితిలో ఒక శవం బయటపడింది. ఆ శవాన్ని దుప్పట్లో పూర్తిగా చుట్టేసి... ఒక చెక్కపెట్టలో పడేయడం గమనార్హం. ఈ సంఘటన భోపాల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... భోపాల్ లోని విద్యానగర్ కాలనీలోని ఓ ఇంట్లో విమల శ్రీవాత్సవ(60) అనే మహిళ, ఆమె కుమారుడు అమిత్(30) ఉండేవారు. విమల ఎంపీ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేసేవారు. కాగా.. దాదాపు ఆరు, ఏడు నెలల క్రితం వారు తమ ఇంటిని అమ్మేసారు. అప్పటి నుంచి ఆ ఇంటికి తాళం వేసి ఉంటోంది.

ఆ ఇంటిని కొనుగోలు చేసిన కొత్త యజమాని.. ఇంటిని శుభ్రం చేయించేందుకు ఆదివారం అక్కడికి వచ్చాడు. ఇంటిని శుభ్రం చేస్తున్న క్రమంలో ఒక గదిలో చెక్కపెట్ట కనిపించింది. అది తెరచి చూడగా.. అందులో  ఒక మృత దేహం కనిపించింది. అది కుళ్లిపోయిన స్థితిలో ఉంది. అంతేకాకుండా.. శవాన్ని దుప్పట్లోతో ఇతర క్లాతులతో గట్టిగా చుట్టేసి ఉంచారు. 

మృతదేహంపై ఎలాంటి గాయాలు కూడా లేవని పోలీసులు గుర్తించారు. ఆ శవం ఎవరిది? ఆ ఇంట్లోని తల్లీ, కొడుకులు ఎక్కడికి వెళ్లారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని  దర్యా ప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.