న్యాయం ఎంతో శక్తి వంతమైనదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. నిర్భయ దోషులు ఉరి నుంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమైన సంగతి తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున నలుగురు దోషులను న్యాయస్థానం ఉరితీసింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘న్యాయం చాలా శక్తివంతమైనది. మహిళల గౌరవం మరియు భద్రతను  కాపాడటం చాలా ముఖ్యం  మన నారి శక్తి ప్రతి రంగంలోనూ రాణించింది. మహిళా సాధికారత కోసం మనమందరం కృషి యేయాలి. ఎక్కడైతే మహిళలకు సమానత్వం, అవకాశాలకు ప్రాధాన్యత కల్పిస్తారే ఆ దేశమే అభివృద్ధిలో ముందుంటుంది.’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.

Also Read చివరి కోరికగా... అవయవదానం చేసిన నిర్భయ దోషి...

 

కాగా... దోషులకు ఉరిశిక్ష వేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఇక ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న నిర్భయ తల్లి అయితే... ఆనందం వ్యక్తం చేశారు. తన కూతురి ఆత్మకు శాంతి కలిగిందని చెప్పారు. తన కూతురి ఫోటోని గుండెకు హత్తుకొని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

కాగా, 2012 డిసెంబర్‌ 16 అర్థరాత్రి ఆరుగురు వ్యక్తులు నిర్భయపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఈ దారుణానికి పాల్పడ్డారు. నిర్భయను అత్యంత క్రూరంగా హింసించారు. ఆమెతో ఉన్న స్నేహితుడిపైనా దాడిచేశారు. తీవ్రగాయాలైన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నిర్భయ మృతి చెందింది. 

రామ్‌సింగ్‌, అక్షయ్‌, వినయ్‌ శర్మ, పవన్‌, ముఖేశ్, మైనర్ అయిన మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం రామ్ సింగ్ 2013 మార్చిలో తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్ కావడంతో మూడేళ్ల శిక్ష తర్వాత అతడు విడుదలయ్యాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాలకు  మిగిలిన నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలైంది.