కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భీష్మించుకు కూర్చున్నారు. బాధిత కుటుంబాలను కలవకుండా తనను అడ్డుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు చూస్తున్నారని ఆమె అన్నారు. బాధితులను కలవకుండా తాను అక్కడి నుంచి వెళ్లనని ఆమె తేల్చి చెప్పారు.

యూపీలో ఇటీవల ఓ భూ వివాదంలో ఆదివాసీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా... మృతుల కుటుంబీకులను కలిసేందుకు శుక్రవారం ప్రియాంక గాంధీ అక్కడికి వచ్చారు. కాగా... ఆమెను బాధిత కుటుంబసభ్యులను కలవకుండా అక్కడి పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులను దారిలోనే ఆమెను అడ్డుకొని గెస్ట్ హౌస్ కి తరలించారు. కాగా... ఆమె మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. గెస్ట్ హౌస్ లో తన మద్దతుదారులతో కలిసి కూర్చొని ఆందోళన చేపట్టారు. ఇప్పటికీ ఆమె తన నిరసనను కొనసాగిస్తున్నారు.

అక్కడి నుంచి వ్యక్తిగత పూచీకత్తుతో వెళ్లాలని రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కోరినప్పటికీ ఆమె ససేమిరా అన్నారు.ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించిన అధికారులు అర్థరాత్రి దాటిన తరువాత ఎలాంటి ఫలితం లేకుండానే వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఈ ఘటనపై ప్రియాంక గాంధీ మాట్లాడారు. బాధిత కుటుంబాలను కలవకుండా ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తరపున వచ్చిన దూతలకు కూడా తాను అదే చెప్పానని ఆమె అన్నారు.  బాధితులకు అండగా ఉండడం కోసం జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.