ఉబర్ కారు డ్రైవర్లు మహిళా డ్రైవర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఇప్పటికే పలు మార్లు వార్తలో చదివాం. తాజాగా ఇలాంటి సంఘటనే మరోకటి చోటుచేసుంది. తన కారు ఎక్కిన మహిళా ప్రయాణికురాలితో సదరు క్యాబ్ డ్రైవర్ అసహ్యంగా మాట్లాడటంతోపాటు.. ఆమె ఒంటిపై డ్రెస్ చింపేస్తానని బెదిరించడం గమనార్హం. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నగరానికి చెందిన ఓ యువతి తన సహచరులతో కలిసి డిన్నర్ పూర్తిచేశాక ఇంటికి వెళ్లేందుకు ఉబెర్ క్యాబ్ బుక్ చేశారు. కారు ఎక్కిన తర్వాత డ్రైవర్ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చదువుకున్న అమ్మాయిలు సాయంత్రం ఏడు గంటలలోపు ఇంటికి వెళ్లకుండా ఈ తిరుగుళ్లేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు, అమ్మాయిలు మందు తాగడం ఏమిటని ప్రశ్నించాడు.

డ్రైవర్ ప్రవర్తనతో షాక్‌కు గురైన ఆమె.. తాను మందు తాగలేదని స్పష్టం చేసింది. అయినా.. డ్రైవర్ తన పని తాను చేసుకుంటే మంచిదని సూచించింది.  దీంతో మరింత రెచ్చిపోయిన డ్రైవర్ తన నోటికి పనిచెప్పాడు. ‘‘నువ్వో వ్యభిచారివి. నా బూట్లు తుడిచేందుకు కూడా నువ్వు పనికిరావు’’ అంటూ దుర్భాషలాడాడు. 

దీంతో భయపడిపోయిన ఆమె.. వెంటనే ఉబెర్ పానిక్ బటన్ ప్రెస్ చేసింది. అయితే, ఉబెర్ కంపెనీ యువతికి ఫోన్ చేయాల్సింది  బదులు డ్రైవర్‌కే ఫోన్ చేసింది. కష్టమర్ కేర్ తో క్యాబ్ డ్రైవర్ యువతి మద్యం సేవించి ఉందంటూ చెప్పడం విశేషం. తనకు ఏదో ముప్పు ఉందని గ్రహించిన ఆమె వెంటనే గట్టిగా అరుస్తూ.. ఉబర్ కష్టమర్ కేర్ కి ఫిర్యాదు  చేసింది. దీంతో..వారు ఆమెను కారు దిగిపోవాలని.. వేరే కారు పంపుతామని సూచించారు.

ఇది విన్న డ్రైవర్ ఆమెపై మరోమారు విరుచుకుపడ్డాడు. వెంటనే తన కారు దిగకుంటే తాను ఆమె దుస్తులు చింపేస్తానంటూ హెచ్చరించాడు. అతడి మాటలతో భయపడిన అపర్ణ రాత్రి 11.15 గంటల సమయంలో వారు పంపే కారు కోసం ఎదరుచూస్తూ నిలబడ్డారు. అయితే, ఎంతసేపు నిలబడినా కారు రాకపోవడంతో ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఇంటికి చేరారు. ఇంత జరిగినా ఉబెర్ సంస్థ డ్రైవర్‌పై చర్యలు తీసుకోకుండా తన డబ్బులను వెనక్కి ఇచ్చి చేతులు దులుపుకుందని వాపోయారు. 

ఉబర్ సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజేస్తూ... ఆమె తనకు జరిగిన దాన్నంతా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. మరి ఈ ఘటనపై ఉబర్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.