కాంగ్రెస్ పార్టీలో గూండాలు ఉన్నారంటూ.. సొంత పార్టీ పైనే ప్రియాంక చుతర్వేది సంచలన కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా  సొంత పార్టీ నేతలపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల ప్రియాంక చతుర్వేది..  ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె పట్ల కొందరు కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై ఆమె వెంటనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో ప్రియాంకతో తప్పుగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేశారు.

అయితే.. అలా సస్పెండ్ చేసిన వారిని జ్యోతిరాదిత్య సింథియా జోక్యంతో తిరిగి మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. ఈ విషయం ఆమెను కలచివేసింది.తన పట్ల తప్పుగా ప్రవర్తించిన వారిని మళ్లీ పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆమె మండిపడింది. ఈ క్రమంలో తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

‘ఎంతోమంది త్యాగాలతో రూపుదిద్దుకున్న పార్టీలో కొంత మంది గూండాలకు ఇంకా ప్రాధాన్యం దక్కుతోంది. అభ్యంతరకరంగా మాట్లాడి, నన్ను బెదిరించిన వాళ్లకు కనీస శిక్ష పడకపోవడం చాలా బాధిస్తోంది. నిజంగా ఇది విచారకరం’ అని ట్వీట్‌ చేశారు. అదే విధంగా ప్రియాంక చతుర్వేదితో అసభ్యంగా ప్రవర్తించిన నాయకులను పార్టీలో పునరుద్ధరిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ విడుదల చేసిన లేఖ అంటూ ఓ జర్నలిస్టు షేర్‌ చేసిన ఫొటోను తన ట్వీట్‌కు జతచేశారు.