చెన్నై: వాస్తవం అనిపించే విధంగా అబద్ధాలను రాయకూడదని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ జర్నలిస్టులకు సలహా ఇచ్చారు. జర్నలిజంలో తటస్థ వైఖరి ఉండాలని, వాస్తవాలను మాత్రమే రాయాలని ఆయన సూచించారు. 

తమిళ పత్రిక తుగ్లక్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. స్వర్గీయ చో రామస్వామి వంటి జర్నలిస్టు దేశానికి అవసరమని ఆయన అన్నారు. 

కాలం, రాజకీయాలు, సమాజం సజావుగా లేవని, ఈ స్థితిలో ప్రజల పట్ల మీడియాకు పెద్ద బాధ్యత ఉందని ఆయన అన్నారు. వార్తల్లోని వాస్తవాన్ని పాలతోనూ, తప్పుడు వార్తలను నీళ్లతోనూ పోలుస్తూ వార్తలు ఎలా ఉండాలో ఆయన చెప్పారు. 

పాలను, నీళ్లను కలిపినప్పుడు వాటి మధ్య తేడాను ప్రజలు గుర్తించలేరని, ఏది పాలు ఏది నీళ్లు అనేది చెప్పాల్సింది జర్నలిస్టులేనని రజినీకాంత్ అన్నారు. వాస్తవాలు మాత్రమే రాయాలని, నిజం లాగా అనిపించే అబద్ధాలు రాయకూడదని ఆయన చెప్పారు.