రాయ్‌బరేలి: ప్రధాని నరేంద్ర మోడీని ఓడించి ఇంటికి పంపించడం అనేది అసాధ్యమైన పనేం కాదని కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంకలతో కలిసి రాయ్‌బరేలిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

‘2004ను మర్చిపోవద్దు’ అంటూ బీజేపీకి సోనియా గాంధీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. 2004లో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అంచనాలున్నప్పటికీ తామే అధికారంలోకి వచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగా అంచనాలున్నాయని, మరోసారి 2004 రిపీట్ కావచ్చని అన్నారు. 

ప్రధాని మోడీని ఓడించడం అసాధ్యమని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సోనియా గాంధీ ఈ మేరకు స్పందించారు. మోడీని ఓడించడం అసాధ్యమైన పనేం కాదని అన్నారు.

2004లో అటల్ బిహారీ వాజపేయిని ఓడించడం కూడా అసాధ్యమనే అనుకున్నారంతా.. కానీ తాము ఆ ఎన్నికల్లో గెలిచామని సోనియా గాంధీ తెలిపారు. దేశ చరిత్రలో చాలా మంది అహంకారపూరితంగా వ్యవహరించారని, దేశ ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ప్రజల కంటే ఎవరూ ఎక్కువ కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల పూర్తయ్యాకే నరేంద్ర మోడీ సామర్థ్యం ఏంటో తెలుస్తుందని రాహుల్ చెప్పారు. కాగా, 2004లో గెలిచిన కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. 2004-2014 వరకు యూపీఏ ప్రభుత్వం కొనసాగగా.. 2014లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.