న్యూఢిల్లీ:  ఫణి తుఫాన్  విషయంలో బెంగాల్ సీఎం మమత బెనర్జీ రాజకీయాలు చేస్తోందని  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విమర్శించారు.

సోమవారం నాడు ప్రధానమంత్రి మోడీ ఒడిశాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో  ఏరియల్ సర్వే నిర్వహించారు. వారం రోజుల క్రితం మోడీ ఫోన్‌కు మమత బెనర్జీ స్పందించలేదని పీఎంఓ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఫణి తుఫాన్ విషయమై మోడీ బెంగాల్ లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తారని పీఎంఓ వర్గాలు బెంగాల్  సీఎంఓతో సంప్రదింపులు జరిపాయి.

అయితే ఈ విషయమై  సీఎంఓ వర్గాలు సరిగా స్పందించలేదు. ఎన్నికల ప్రచారంలో తాము బిజీగా ఉన్నట్టుగా వారు చెప్పారని పీఎంఓ వర్గాలు ప్రకటించాయి.
మరోవైపు మమత తీరుపై మోడీ తీవ్రంగానే స్పందించారు. 

ఫణి తుఫాన్ బెంగాల్ రాష్ట్రాన్ని తాకే .సమయంలో  తాను మమతతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆమె మాట్లాడేందుకు నిరాకరించారని మోడీ చెప్పారు. మమత అహంకారానికి ఇది నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. 

బెంగాల్ రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.మరో వైపు ఇదే విషయమై  హిందీలో మోడీ ట్వీట్ చేశారు. మమత నుండి ఫోన్ కోసం తాను ఎదురుచూస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

ఫణి తుఫాన్ విషయంలో బెంగాల్ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసిందని టీఎంసీ చేస్తున్న విమర్శలకు సమాధానంగా పీఎంఓ వర్గాలు వివరణ ఇచ్చాయి. మోడీ కూడ ఈ విషయాన్ని బెంగాల్ సభలో ప్రకటించారు.