Asianet News TeluguAsianet News Telugu

కన్నీరొలికించిన అభ్యుదయ కవి కలం

పఠాన్ ఖాదర్ వలి గారి " *నా కలం కన్నీరొలికింది"* కవితా సంపుటి చదివితే  సమాజం పట్ల బాధ్యత గల కవి అక్షరాల వెలుగులు మనకు తారసపడుతాయి,ఒక మంచి ఆదర్శవంతమైన పుస్తకం చదివిన భావన మనకు కలుగుతుంది.

Vinayakam Prakash reviews Pathan Khadar Vali poetry
Author
Hyderabad, First Published Nov 28, 2019, 4:40 PM IST

కవులు నిత్య పరిశోధకులుగా,సమాజాన్ని చదువుతూ సమస్యలను వెలుగులోకి తెస్తూ సమాజంలో విలువల అక్షర విత్తులు నాటి ఆదర్శంగా నిలచి మార్పు కోసం ప్రయత్నం చేయాలి, నిజ జీవితాన్ని పాఠకులకు అద్భుతముగా చూపి ప్రజల ఆలోచనల్ని ఆరోగ్యకరంగా మార్చాలి, అప్పుడే కవి తన బాధ్యతను పూర్తి చేసినట్టు. శ్రీ పఠాన్ ఖాదర్ వలి గారి " *నా కలం కన్నీరొలికింది"* కవితా సంపుటి చదివితే  సమాజం పట్ల బాధ్యత గల కవి అక్షరాల వెలుగులు మనకు తారసపడుతాయి,ఒక మంచి ఆదర్శవంతమైన పుస్తకం చదివిన భావన మనకు కలుగుతుంది.

 *"నా కలం కన్నీరొలికింది* " ఒక అద్భుతమైన  కవితల సమాహారం కుటుంబ సభ్యుల అనుబంధాల నుంచి అడవుల్లో కార్చిచ్చు వరకు,గురువు నుంచి   గగన ప్రయోగాల వరకు ,సొంతూరు నుంచి సునామీ విపత్తు దాకా, ప్రతీ విషయాన్ని స్పృశిస్తూ చక్కగా భావవ్యక్తీకరణ చేస్తూ కవితకు కాదేదీ అనర్హమంటూ తన వైవిధ్యమైన కవితలతో చక్కని సందేశం సమాజానికి ఇచ్చారు కవి శ్రీ పఠాన్ ఖాదర్ వలి.

Also Read: కవి యాకూబ్ తీగల చింత: లుప్త విలువల చింతన.

అబ్దుల్ కలాం గారి గుర్తుగా  తన  ప్రతిభతో  కన్నీరొలికించిన తీరు అద్భుతం
 
" *భ్రష్ట రాజకీయ దుష్ట చదరంగంలో పావులై మిగిలిన ప్రజల కడగండ్లు తీరలేదనే నీ తపనకు నా కలం కన్నీరొలికింది "* అనడం కవి ప్రతిభను ప్రతిబింభిస్తుంది ,తన కవిత ద్వారా కలాం గారికి ఘనమైన నివాళులు సమర్పించారు.

తల్లితండ్రి, గురువు కు సమర్పించిన అక్షర నీరాజనాలు, భార్యను "ప్రేమామృతవర్షిణీ "అని వర్ణించడం మొదలైన విషయాలు కవికి గల కుటుంబ బాధ్యత ప్రేమను వివరించాయి.

"బాపూ! నీ బోసినవ్వులు !! " కవిత ద్వారా గాంధీజీ గొప్ప తనాన్ని వివరిస్తూ  నేటి నాయకుల పోకడను ఎండగట్టారు.

" *నాటి నైతిక విలువలు నేడు పూర్తిగా నాస్తి* 
 *అధికార పీఠమే నేడు సరియైన ఆస్తి* 
 *ఏం చేయగలవు నేడు నీవు బాపూ!                     
నాల్గురోడ్ల కూడలిలో నవ్వుతూ   నిల్చోవడం తప్ప!!* 
అంటూ నేటి స్థితిని చక్కని కవితగా వివరించారు.

"భరతమాత" కవితలో  " నాకు సంస్కృత శ్లోకాలు ,అరబిక్ మంత్రాలు , గుడిలో సుప్రభాతం, మసీదులో అజాన్ ఒకేలా అనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి " అని సర్వమత సారం ఒక్కటే అంటూ సోదరభావం చాటి  పఠాన్ ఖాదర్ వలి నిజమైన భారతీయుడు అని ఋజువుచేశారు .

Also Read: తలెత్తిన బ్రతుకు మధురఫలం - సీతాఫలం

భారత జవానుకు  "జీతేరహో జీత్ తే రహో" అంటూ ఇచ్చిన అక్షర అభినందన బాగుంది. కవి సొంతూరు  బురుజుపల్లె ను కవితాత్మకంగా వర్ణించి రాయలసీమ పల్లెల సంప్రదాయాల్ని, జీవనశైలి ని  ప్రపంచానికి పరిచయం చేసిన తీరు అమోఘం.

 గర్భ నివేదన అనే కవితలో .. *నన్ను పుట్టనీయవే అమ్మా !* అంటూ  ఆడపిల్ల  తల్లి గర్భం నుంచే భ్రూణ హత్యలు వద్దని ఆడపిల్ల అయిన తనకు జన్మనివ్వమని తన తల్లిని ప్రాధేయపడిన విధానాన్ని వర్ణించిన తీరు పాఠకుల హృదయాలను ద్రవిస్తుంది మరియు కవికి గల సామాజిక దృక్పదానికి అద్ధం పడుతుంది.

కులము మతము ద్వారా కులం నేటి సమాజంలోని అరాచకాన్ని కవిత్వీకరించి చూపారు, నిర్భయ వేదన ద్వారా నేటి సమాజ నీచ పోకడను ప్రశ్నించారు.తన కలంతో పాఠకుని మనస్సు కన్నీరోలికేలా కవిత్వం రాశారు ఖాదర్ వలి గారు.

"సుజలాం -సుఫలాం" అనే గేయంలో ఇంకుడు గుంతలు త్రవ్వడం ద్వారా భూగర్భజల మట్టం పెంచాలనే సందేశం ఇస్తూ, భారత పౌరులకు పర్యావరణ పట్ల నైతిక  బాధ్యతను గుర్తుచేశారు.

"బస్సు చక్రం ప్రగతికి చిహ్నం" అనే నినాదముతో ప్రజలకు సేవ చేస్తున్న ఆర్టీసీ సంస్థ డ్రైవర్ పై కూడా అద్భుతమైన కవిత రాశారు
"నిద్రాహారాలు మాని  ప్రయాణికుల క్షేమం 
అనునిత్యం తపిస్తు  అతని బాధలూ బాధ్యతలు సమన్వయం చేసి " పాఠకులకు వివరించిన కవి అభినందనీయులు.
కవితకు కాదేదీ అనర్హమంటూ కుక్కపిల్ల , సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల పై కూడా కవిత రాసి అభినవ శ్రీ శ్రీ గా నిలిచారు ఖాదర్ వలి.

రాయలసీమ లోని కరువును కళ్లకు కడుతూ. 
 *భూమాత గుండె లోలోతులకు చీల్చి* 
 *గృక్కెడు గంగ కోసం వెతుకులాట* 
 *మేఘపు తునకలను నమ్ముకొని నీటి తుంపర్ల కోసం ఆకాశంకేసి ఆశలాట"*  -  అంటూ సీమ రైతుల దీన స్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించి  కన్నీరొలికించగల ప్రతిభ గల కవి పఠాన్ ఖాదర్ వలి.

Also Read: సమీక్ష: "అచ్చంగా నేనే "- రాపాక శ్రీనివాస్ కవిత్వం

ఒక బాధ్యత గల ఆంధ్ర కవిగా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో  రాసిన కవితలు  "షష్ఠి పూర్తి అయ్యాక విడాకులా..!" కవితలో ఆంధ్రప్రజల  మానసిక వేదనను వివరించారు, "సౌభాగ్య నగరం" కవిత ద్వారా ఆంధ్రుల కలల రాజధాని నిర్మాణం పై ఆశాభావం వ్యక్తం చేసి ప్రజల్లో ఉత్తేజం నింపిన తీరు బాగుంది.
 **మనుషులుగా విడిపోయినా* 
 *ఒకే జాతిగా కలసి ఉంటాము** అంటూ రాష్ట్ర విభజన పై చక్కని సందేశం ఇచ్చారు.

తన కవితా సంపుటిలో చాలా కవితలు బాగున్నాయి ఎత్తుగడ , శిల్పం, భావవ్యక్తీకరణ , ముగింపు , కవితా వస్తువు, శీర్షికల్లో వైవిధ్యం చాలా ఆదర్శంగా ఉంది.ఈ కవితా సంపుటిలోని ప్రతి కవితలో అంత్యానుప్రాసలు,అర్థాలంకారాలు,శబ్దాలంకారాలు చోటు చేసుకున్నాయి ఇవి కవి యొక్క కవిత్వానికి కొత్త సొగబులద్దాయి,అంతేకాక కవి తన కవితా సంపుటి లో  కుటుంబ సభ్యులకు, కవులకు , సామాజిక సమస్యలకు, గురువులకు ,బాధ్యతాయుతస్థానం కల్పించడం అభినందనీయం.  కొన్ని కవితలు ఏదో ఒక రూపంలో సమాజానికి ఉపయోగ పడేలా చక్కగా కవిత్వం రాసి ఆదర్శంగా నిలిచారు కవి.ఈ పుస్తకం నిజంగా ఒక "ఆదర్శసమాజం "దీనిని చదవటంవల్ల ఖచ్చితంగా అందరిలో ఆరోగ్యకర మార్పు   తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు అని నా అభిప్రాయం,ఇంత చక్కని కవితా సంపుటి రాసిన" శ్రీ పఠాన్ ఖాదర్ వలి" గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ,ఇంకెన్నో పుస్తకాలు రాసి  ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ మరోమారు హృదయపూర్వక అభినందనలు .

Vinayakam Prakash reviews Pathan Khadar Vali poetry

- వినాయకం ప్రకాష్

తెలుగు సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Follow Us:
Download App:
  • android
  • ios