"వొక సెలయేరు
పరుగెత్తుకుంటూ వెళ్తూ
కాసిన్ని నీటి బిందువుల్ని
పై మీద చిలకరించి వెళ్ళింది
తీరా చూస్తే
ఆ నీటిబిందువు నేనే
అచ్చంగా."
      ----అఫ్సర్ (అనుక్షణికాలు-ఊరిచివర కవితా సంపుటి)

కవిత్వం రాయడమంటే మాటలు కాదు.బతుకును చిదిమి దీపం పెట్టుకోవడమని అనుకుంట.కవిత్వమొక ప్రవాహం.ఆ ప్రవాహపు నీటిబిందువులు అక్షింతలై  సీనన్నపై పడ్డట్టున్నయి.అందుకేనేమో  "అచ్చంగా నేనే" అని పలవరించిండు.కవులు కవిత్వమెట్ల రాత్తరు ?ఎప్పుడు రాత్తరు? అని అనుకునేటోన్ని. జవాబును సీనన్నకు నచ్చిన కవి మిత్రుని కవితా పాదాల చెంత దేవులాడుదం.

"మెదడుకు నిప్పంటుకున్న ప్రతీసారి
సిరా నీళ్ళో
కాగితపు దుప్పటో కావాలి
ఐనా అది ఆరదు
కవిత్వపు ఆకలి దానిది"

---చింతం ప్రవీణ్ (గ్లోబలి కవితా సంపుటి)

Also Read: పుస్తక సమీక్ష: ఇంద్రధనుస్సు రంగులు అద్దితే..

"అచ్చంగా నేనే" రాపాక శ్రీనివాస్  అలియాస్ సీనన్న తొలి కవితా సంపుటి ఇది.అచ్చంగ మనకందరికీ  పండుగే.కవులకేమన్న కిరీటాలుంటయా?కవులు ప్రత్యేకమైనోళ్లా? బాగా సదువుకున్న పండితులే కవిత్వం రాత్తరా ? కొన్ని అనుమానాలైతే ఉండేటియి.అకడమిక్ సదువులు పెద్దగ సదువుకోకున్నా సీనన్న జీవితాన్ని కాచి వడబోసిండు.అచ్చంగ సీనన్న చేసుకుని తీసుకొచ్చే ఉడుకుడుకు కాఫీ లెక్క కమ్మగ పంచే అనుభవాలు. పాయిరంగ కొసిరి కొసిరి వడ్డించే  అతని మనిషితనం .పనిలోనే ఆనందం వెతుక్కునే కష్టజీవి తత్వం. కలిసిన ఒక్కొక్కలను ప్రేమగ  పలకరించే అతని వ్యక్తిత్వం.సముద్రమంత దుక్కంలో గుండె తడుస్తున్నా..కనురెప్పల కొస్సన సుత తడి కనిపించనీయని అతని గాంభీర్యం.అచ్చంగా మనిషికి నిలువెత్తు రూపం మా సీనన్న. 

వరంగల్ లోని నెక్కొండ ప్రాంతవాసి.నాయిన ఇచ్చిన ఆస్తి చిన్న హోటల్ . హైదరాబాద్ కవులకు "ద్వారకా" ఎసోంటి అడ్డానో...మా సీనన్న హోటల్ "మట్టి మనుషుల పలకరింతల కర్మాగారం".

కవిత్వానికి అతని గ్రామీణ నేపథ్యమే ముడిసరుకు.Think globally,Act locally సీనన్నకు అచ్చంగా సరిపోతది.పల్లెటూరు అనంగనే ఎవుసం,రైతన్న కండ్లముంగట కనవడుతరు.సీనన్న కవిత్వంలోనూ  రైతన్న పక్షాన నిలబడి ,కొట్లాడే  నిబద్ధత గల మనిషి తారసపడుతడు.రైతు బాగుంటనే  దేశం బాగుపడుతది.ఇది జగమెరిగిన సత్యం. నందిని సిధారెడ్డి గారు రాసిన కవితా పాదాల్ని యాజ్జేసుకుందం.

"నిలబెడితే నిచ్చెన
పండబెడితే పాడె"
(సిధారెడ్డి)

ఎవుసాన్ని పట్టిచ్చుకుంటే,పట్టిపర్వ లేకుంటే దేశ భవిష్యత్ చిత్రపటం ఎలా వుంటదో పై రెండు పాదాల్నించి అన్వయించుకోవచ్చు.సీనన్న కవిత్వాన్ని పరిశీలిత్తె అన్నధాతపై అవ్యాజమైన పాయిరం అగుపడుతది.

Also Read: పుస్తక సమీక్ష: వెలుగు కలల పాట...

"బురదల చెయ్యెట్టి
బువ్వ దొరకపట్టేటోల్లం
భూమిని ఇడిచిపెడితే
పాణాలే వదిలిపోతాయేమో"
        (పేజీనం.55;అన్న వస్ర్తాలకు పోతే)

"రెక్కల కట్టానికి
లెక్కలు కట్టకపోతే పోతిరి కానీ
పెట్టుబడి పుట్టి మునగకుండా చూస్తే అదే పదివేలు
పురుగు మందులకు రైతులు గాక
పురుగులు చచ్చేటట్లు చేస్తే
చచ్చి మీ కడుపున పుడుతాం
చచ్చినంక వచ్చే లచ్చలు వద్దు
కాంటాలో తూగిన చెమటచుక్కలు
మార్కెట్ మాయలకు ఆవిరి కాకపోతే
అన్నదాత అన్నదాత లెక్కనే వుంటడు
అడుక్కునేటోని లెక్క మారడు
(పేజీ నం:58; చెమట చుక్కల ఆవిరి)

"నాగటి యాగాన్ని పుడమి
పుట్టుక నుండి చేస్తు
జగతికంతటికి ఆ యాగ ఫలాన్ని
పంచే యాతనలో
యాదిమరచిన ఎగసాయదారుడు
గింజగింజపై తన పేరు
రాయలేకపోయాడు

గంజితోనే గడపలోపల గడిపేస్తూ
గానుగెద్దులా పలుగు పారతో చేలోకెలితే
కల్లోనైనా ఎరగని కాటకం
కంటనీరు తెచ్చింది"
(పేజీ నం:61; చావు బతుకుల రైతన్న)

"అదునా పిన్నీసు ఆటానంట
అదును చూసి పదునువేసి
పండించిన టమాటకు ఆటానేనని
అన్నదాత అలుగుతున్నాడు
ముంగిట నుండి అంగడి చేరిన టమాట
ఆఠ్ నుండి అఠారా దాకా పలికిందని
అన్నదాత అలుగుతున్నాడు

పాపాయి పాప్ కార్న్ కి పదికిపైగా వెచ్చిస్తే
పాలకంకిని పసిపాపలా సాకి
మొక్కజొన్న రూపేణ మార్కెట్ కూ మోసుకెళ్లితే
పదివందలైనా పలుకలేదని
అలుక పూనుతున్నాడు"
(పేజీ నం:63; కొత్తగా ఆలోచించండి)

"కల్లంల గింజలు
కంచంలోకి రానపుడు
ఎత్తిన పిడికిల్లల్ల అగుపడుతయి
ఎర్రబడ్డ కండ్లల్ల అగుపిస్తాయి
ఎలుగెత్తిన గొంతుకల్ల వినిపిస్తయి"
(పేజీ నం:35; తాలుకు పట్టం కడితే)

బురదల చెయ్యెట్టి బువ్వ దొర్కబట్టుడు,మార్కెట్ మాయలకు చెమటచుక్కలు ఆవిరవడం,నాగటి యాగం,ఎత్తిన పిడికిళ్లు,ఎర్రబడ్డ కండ్లు,ఎలుగెత్తిన గొంతుకలు   ఇవన్నీ అన్నదాత కష్టాన్ని  , అన్నదాత పక్షాన నిలబడి మాట్లాడటానికి తీసుకున్న పదబంధాలు. రైతే దేశానికి వెన్నెముక అని ఊదరగొట్టుడు ఉత్తమాటలేనని తెలిసినోడు గనుకనే  ఎదురుతిరగందే దేన్నీ సాధించలేమని ,ప్రశ్నించందే జవాబు దొరకదని  తేటతెల్లంజేసి చెప్తాండు.

Also Read: ఆప్యాయతల పాశబువ్వ ఈ "బంతిబువ్వ"

సీనన్న వాళ్ల నాయిన లెక్కనే పని పట్ల గౌరవం వున్న వ్యక్తి.బువ్వ పెట్టె పనిని నలుగుట్ల చెప్పుకుంటానికి నారాజు కాడు.నామోషి లేకుంట తన పని తాను చేసుకపోతాంటడు.ఇక్కడ సీనన్న వాళ్ల బాపు "రాపాక వీరమల్లు"గురించి కొంత మాట్లాడుకుందం.హైద్రాబాద్ లో "నెల్లూరి రెడ్డి  హోటల్లో వంట మాష్టార్ గా 1972లో ₹500ల నెల జీతంతో పనిజేసేటోడు.నాన్ -వెజ్ వండటంలో సిద్ధహస్తుడు.సిటీలో వున్న చాలామంది బిగ్ షాట్స్ తనతో వండించుకునేవారు.అక్కినేని నాగేశ్వర్ రావ్ గారికి తన వంటలంటే చాలా ఇష్టం.ఇంటికి పిలిపించుకుని మరీ వండించుకునేవారు.ఎన్టీయార్ ,కాసు బ్రహ్మనందరెడ్డి,జైపాల్ రెడ్డి తదితరులు ఆయన చేతివంట రుచి సైజూశినోల్లే.తిలక్ రోడ్ లో అప్పట్లో శ్రీదేవి బార్ &రెస్టారెంట్ లో క్యాబరే డ్యాన్స్ లు సుత నడిచేవి.అందులో సుత 60—70మంది పనివాళ్లతో  వంటలు చేసేవారు.ఊరిమీది మమకారంతో రాపాక నర్సింహ గారి సలహాతో సొంతంగా హోటల్ వ్యాపారం చేసుకుందామని సొంత ఊరికి రావడం,చిన్న హోటల్ ను ప్రారంభించడంతో సీనన్న పూర్వ రంగం అంగరంగ వైభవంగా ఉండేది.

సీనన్న పెద్దగా చదువుపై దృష్టి పెట్టకపోవడం,అదే హోటల్ బాధ్యతలు తను నిర్వహించడం  -అలా గడిచిపోయింది.హోటల్లో నలుగురికి  వండిపెడుతూనే   కవిత్వాన్ని వంటబట్టిచ్చుకున్నడు.తండ్రి పని వారసత్వాన్ని కొనసాగిత్తాండు.ఎవలన్న బాగ సదువుకున్నోల్లు తారసపడితే సంబురపడుతడు.అక్షరం బువ్వపెట్టకపోయినా కవిత్వమై నలుగుట్ల నానాలనుకుంటాండు.అందుకే "అచ్చంగా నేనే" అని మురిసిపోతాండు.

రసాలూరే తీయటి పండ్లగంప అసోంటి తెలుగుకు పునర్ వైభవం వస్తుందనే ఆశాభావంతో కవి "తప్పక వస్తరు కొడుకులు"అని మాట్లాడుతాండిక్కడ.

"కొన ఊపిరితో ఉందంటే నేనొప్పుకోను
కొత్త మోజులో కొట్టుకపోతార్రు కొడుకులు
అమ్మ ఆకలి గుర్తుకు వస్తె తప్పక వస్తరు
కొడుకులు తప్పక వస్తరు
 (పేజీ నం:21)

సర్కారు బడుల  మూసివేతపై స్పందించి రాసిన "ఓ స్సారు... "కవితలో ప్రశ్నించడం ద్వారా కవితకు ముగింపునిచ్చి ఆలోచనలో పడేత్తడు కవి.

"పిట్టలు వాలట్లేదని
చెట్లను పెకిలించినట్లు
పోరగాండ్లు రావట్లేరని
బడులను మూత్తాండ్రు

ఏదో  ఒక పన్లెకు పోతానికి
మా పోరడు తయారే కానీ
సర్కారు బడి సచ్చిపోతానికి కారణం
మా బిడ్డలు బడికి రాకపోవడమేనా...?"
(పేజీ నం :22)

సర్కారు బడుల మూసివేతకు కర్ణుడి సావుకున్నన్ని కారణాలున్నయని  కవికి తెలిసే వ్యంగ్యాస్త్రాలు సంధించిండు.వ్యంగ్యం పండించిన మరో కవిత"గాంధీ వేషం".నిరుద్యోగ సమస్యను,ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ కీలెరిగి వాతపెట్టినట్లు రాసిన కవిత.

"ఖరీదైన క్యాస్టూమ్స్ అక్కరలేదు
క్యాస్ట్ ఫీలింగ్ అసలే రాదు
అప్లికేషన్ల ఆరాటము లేదు
క్వాలిఫికేషన్ల జంజాటము లేదు
కర్ర పుచ్చుకుని కదలకుండా నిలబడితే
కాసులేరుకోవడమే ఇక తరువాయి

ఊకదంపుడు ఉపాధి హామీలు
ఉద్యోగాలు చూపెట్టవు భాయి
ఉలుకు పలుకు లేకుండా
ఉన్నచోటనే విగ్రహంలా నిలబడితే మాత్రం
ఉపాధి హామీ కంపల్సరీ..."
(పేజీ నం:76)

"మనిషిని కలకనలేదు"కవితలో ఐకమత్యంతో మెలిగే మనుషుల మధ్య దూరం పెంచి ఉగ్రవాదం వైపు నడిపిస్తున్న మతంపై చక్కని భాష్యం చెప్తాడు కవి.

"మనిషికి మనిషికి గోడలు కట్టిన
మతమైనా
దేవుడైనా
మనిషిని కలకనలేదు"
(పేజీ నం :25)

మతం సృష్టించే మారణ కాండను,రైల్లో మంటల్లో చిక్కుకుని కాలిపోతున్న జీవితాల్ని తల్సుకుని పొగిలి పొగిలి ఏడ్తడు.వేదాంతమేదో  వల్లిత్తడు

"విరిగిన మనసుతో రైలు 
ఓ విలువైన ప్రశ్న వేసింది
మనుష్యులను ఏకంచేసే శక్తి
మృత్యువేనా ? అని "
(పేజీ నం :65;మత మారణకాండ)

రామప్ప పట్ల ఆంద్రా పాలనలో పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ దేవాదుల పేరుతో గుడి గోపురం కింద గోతులు తవ్వుతున్న వైనాన్ని చూసి చలించిపోతాడు కవి.

"మేక మెడ చన్నుల మేరుమానమే 
ఇంతవరకు తీసుకొచ్చింది

అలలు అలిసిపోతే 
కడలే ఖాళీ అయిందనుకున్న
మీ అజ్ఞానం అగుపిస్తుంది మాకు"
(పేజీ నం :29)

ఉద్యోగ భద్రతలేని సదువులను విమర్శిస్తూ రాసిన "కొత్త చదువులు" మన మనో నేత్రాల్ని తెరిపిస్తుంది.

"నా దేశపు ఉక్కుపిడికిళ్లను
పట్టుసడలేలా చేస్తున్నాయి
ఇనుపకండరాలను
దూదిపింజల్లా తేలకొడుతున్నాయి

బతుకును తాకట్టెట్టి చదువు"కొంటే"
అప్పు కాయితాలను తిరగరాయడానికే సరిపోతుంది"
(పేజీ నం:41)

చేనేత వృత్తి కార్మికుల జీవితాలు ఎలా తలకిందులయ్యాయో, వాళ్ల నమ్మకం పట్టు ఎలా సడలిపోయిందో ఆవేదనతో పడుగు పేకల్ని ఆడిత్తడు."ధర పెరిగింది.., దేనికి ?" అని ఆవేదనతో కుమిలిపోతడు.

"విదేశీ వస్త్రాలను విసిరేసి
జాతీయ పతాకాన్ని చేనేతతో అలంకరించి
నేతలంతా ఖద్దరు తొడుక్కుంటే 
భద్రంగానే వుంటుంది భవిష్యత్ అనుకున్నా..

చేతిలోని బట్టను
చేటలోని బియ్యంగా మార్చలేని చేదు నిజాన్ని
వర్తమానంలో చూడాల్సి వస్తుందనుకుంటే
చేనేతను వీడి చెమటచుక్కను నమ్మె (అమ్మే) 
పనేదన్న ఎంకులాడుకుందును


మనసు చావక
పడుగు పేకలతో చీరను నేస్తే
చీరకు కాక 
చీరతో వేసుకున్నఋఉరికి రేటు పలుకుతుంది"

రాపాక శ్రీనివాస్ ఆవేదనకు ముగింపును,పరిష్కారాన్ని మనం అశోక్ అవారి "సహజ వాక్యం"లో వెతుక్కోవాల్సిందే.

Also Read: ముగింపులేని వాక్యం"గా కొనసాగుతున్న కాసుల రవికుమార్ కవిత్వం

అలసిన మనసుకు సేవచేస్తే అమరత్వం అందుతుందని అమ్మను చూసి అర్ధంచేసుకోవాలని నమ్మే కవి అమ్మను,నాన్నను,గురువును,వీరున్ని,రైతును స్మరించుకుంటూ జీవిత సత్యాలను ఒక్కొక్కటిగా ఏరుకొచ్చి మన ముందు కుప్పజేత్తడు.

"మనం తీయటి ఫలాలను తినగలుగుతున్నామంటే
అమ్మ ఎన్ని చేదుకాయల రుచి చూసి వుంటుందో

మన పాదాలకు పూవుల స్పర్శ కూడా తెలుస్తుంటే
నాన్న అరికాలులో ఎన్ని ముల్లులు
నాటుకొని ఉంటాయో

మన మాటల్లో అమృతం జాలువారుతుంటే
గురువు గొంతుకలోని పుండు
ఎంత సలిపి వుంటుందో

మనం ఆంక్షలు లేని స్వేచ్ఛాగీతికను ఆలపిస్తున్నామంటే
వీరుడి ఉసురు తీసిన ఉరికొయ్య
కన్నీరెంత కార్చి వుంటుందో

మనం పంచభక్ష పరమాన్నమును 
మస్తుగ తింటున్నామంటే
రైతు పలుచటి గంజి కూడా కరువై
పస్తులతో పడుకున్న రోజులెన్నో
(పేజీనం:42;అమ్మకు అమరత్వం)

జ్ఞాపకాల అరల్లో  పుస్తకాల మధ్య దాచిన బాల్యం నెమలీకను నెమరువేసుకునే కవి ఇప్పుడు "వానికి నిదురపట్టదు" అని కలవరిత్తాండు.ఆయనతో పాటు మనం కలవరిస్తూ ఉలిక్కిపడాల్సిందే.

"బహుబతికిన ఆయనేంది
ఖరీదైన దుకాణాల ముందు
కర్రపట్టుకున్న కాపలాదారయిండు

వొడిసెల పట్టుకొని
కంకుల మీద వాలె పిట్టలను
విసిరి విసిరి కొట్టలేనోడు
మనుష్యుల కంటే నోరుంటది
మరి పిట్టలకెట్టాని రంది పడేటోడు

కల్లంల ఊడిసేటోల్లకు కూడా
కడుపు నిండా గింజలు దొరకాలంటడు
అంతటోన్ని అన్నిచోట్ల
అడుక్కునేటోని లెక్క జేసి
ఒక్క బ్రాంది షాప్ కాడ మాత్రం
కొనుగోలుదారున్ని చేసిందీ
రైతు పక్షపాత ప్రభుత్వం"
(పేజీ నం:52)

పిల్లలు పుట్టక సంతాన సాఫల్య కేంద్రాలకు తిరిగే జంటల్ని,సంతానం కలగలేదని విడిపోయే దంపతులను చూస్తున్న నేటి రోజులు మనకు సుపరిచితాలే."సరోగసీ" పేరుతో అమ్మతనాన్ని అమ్మకానికి పెట్టి కడుపుకోతను మిగిల్చే సందర్భాలు దాపురిస్తున్న తరుణమిది.సరోగసీ సర్పాన్ని తరిమి కొట్టండని కవి మొత్తుకుంటాండు.

"కంటనీరు పంటి బిగువున పట్టి
సహకరించని ఒంటిని గోడకాసరపట్టి
పాలకు పాకులాడే పాపడు లేని ఒడిని కండ్లమీందెట్టుకుని
తండ్లాడే నీ మనసును ఎట్ల ఊరడిస్తవు..?

గింజలిచ్చి..పైసలిచ్చి..
పంటను కోసుకుపోతే  పరువాలేదనిపించింది
పాణాన్ని పణమొడ్డి
ప్రసవించిన బిడ్డను పట్టుకపోతే
పాణం తీసుకోవాలనిపిత్తది"
(పేజీ నం:56;సరోగసి)

రాపాక శ్రీనివాస్ ఉరఫ్ సీనన్న కలం నుంచి మరిన్ని గొప్ప కవితలు జాలువారాలని ఆశిస్తూ "అచ్చంగా నేనే" కవిత్వంతో సాహిత్యరంగస్థలంపై అరంగేట్రం చేస్తున్నందుకు శుభాకాంక్షలతో..,,

- బండారి రాజ్ కుమార్