కవి యాకూబ్ తీగల చింత: లుప్త విలువల చింతన
కవి యాకూబ్ కవితా సంపుటి తీగల చింత చదివిన తర్వాత దాని ప్రేరణతో దాసరాజు రామారావు తన ఆలోచనా స్రవంతిని జాలువారించారు. ఆలోచన సుడులకు అక్షర రూపమే ఈ వ్యాసం.
“Raise your words, not voice. It is rain that
grows flowers, not thunder.” - Rumi
***
కవిత్వానికి అవధి, పరమావధి హృదయాకాశ ముట్టడి.సృశించిన తావుల నెత్తావుల గుబాళింపులు, కాంతిపుంజాల ఎరుకలు, నిశి మబ్బుల చీకట్ల రహస్యాల కుల్లం కుల్లలు, లోలోపలి శోధనల ఆశ్చర్యచకితాలు,అపార భావనా పారవశ్య సంపదలు,గమన దారుల వీరోచిత సాహస పదముద్దరలు, సాక్షీభూత చరిత్ర స్మరణాలు, మననాలు, అనుసరణాలు.ఇదంతా పుంభావనా బలం... నవ జీవనం... నవ్యానుభవం.. కవి స్వానుభవ సృజన ఇంతా చేస్తుందంటే శతథా నమ్మడమే.
అక్షరాలు ఒళ్లో పోసుకొని ఎవరూ కూర్చోరు. ఆ మాట కొస్తే అక్షరాలు ఊరికే రావు. ఊకనే పోవు. ఎర్రటి ఎండల కాగుతున్న పరుబ్బండ మీద పాదం మోపి చూడు. కర్రుమొన గుచ్చిన కరియావు కాలి గిట్టల సందుల స్రవించిన రక్తం పదను నంటి చూడు. బిగబట్టిన ఊపిరితో ఒక్కసారిగ పైకెగరేసుకుపోతున్న వలలోని పక్షుల గుండెల ఆరాట ధ్వనిని చెవియొగ్గి చూడు. కత్తుల వంతెన, నిప్పుల వాగు, దినదిన గండం బతుకులకు పర్యాయ పదాలైన సందర్భాల నొలిచి చూడు. అక్షరం అవసరమేంటో,అది చేయాల్సిన పనేంటో అవగతమయితది.
కలలు కనాలంటే జీవితం కావాలి.విజయం దక్కాలంటే యుద్దం చేయాలి.విలువలు కావాలంటే మనసులు విశాలమవ్వాలి. మనుషులు వికసనం చెందాలి. యివన్నీ కవిత్వం నీడలోనే. కవిత్వం నడయాడే జాడలోనే.
నిన్ను ఆపేది కవిత్వం. నిన్ను ఊపేది కవిత్వం. నిన్ను రేపటి ఉదయానికి కృతజ్ఞతా పూర్వక నమస్కారం పెట్టించేది కవిత్వం.
ఉట్టి గట్టిన ఆకాశం మీంచి ఊడిపడదు కవిత్వం. బంగారు గని నుంచి ఉబికి రాదు కవిత్వం. బతుకులోంచి తోడుకొనేది కవిత్వం. బతుకులో వొంపేది కవిత్వం. నిన్ను బతికించేది కవిత్వం. నీతో బతికేది కవిత్వం.
ఇన్ని మాటల అవసరం వెనుక........
అప్పుడెప్పుడో పదకూర్పుల ‘మట్టి మనిషి’ పై చేసిన తొలి సంతకం వన్నె దేలిన వైనం.బాట ఎరుకపడ్డది. గురి, లక్ష్యం తేట పడ్డది. అధ్యయనం,స్నేహం, కొట్టివేతల లోంచి తొంగి చూచే కొత్త వాక్యం రుచి పట్ల మనసు వడ్డది. నిలువ దుర్గంధ మని, చలనం, ప్రవాహం సుగంధ మని నిశ్చయం.యిక తనను తాను కనుక్కొనే, తనని తానుగా ప్రతిష్టించునే ఎడతెగని ప్రయాణానికి ఎరిగింపు అక్షరం తోడుగా.
అన్నం వున్న,అన్నం లేని చేతి రేఖల మధ్య .. అవకాశమున్న, అవకాశం లేని నుదుటి రేఖల మధ్య .. స్వపక్ష, విపక్ష - నైతికానైతికాల... ఆంక్షల, భ్రమల భూగోళంరేఖల మధ్య సరిహద్దురేఖ రద్దు పరిచే ఎజెండా సూత్రీకరణల నిర్మాణ కౌశలం.
పుట్టుకకూ మట్టికీ , ఉనికికీ జీవికకూ, అభేద్యం లేదనే- కార్యాకారణ సంబంధాల లింకప్ ని నదీమూలం లో కనిపెట్టిన దార్శనికత.
ఐడెంటిటీ సమస్యై కూచుంది. వ్యక్తి వాదం ఫోర్స్ ఫోకస్ అవుతున్నది. దారులన్నీ చీలికలు పేలికలుగా... జన ప్రపంచం అతలాకుతలంగా.... ఎంత వెతికినా ఎవరికి వారే దొరకని, ఎవరి కెవరూ అందని, దగ్గరలో దూరం. ఏదో వుండాలి ఇక్కడ.తప్పక వుండాల్సిన అదే పోయింది.గుర్తింపు పత్రాల గొడవ బయల్దేరింది. మొఖావిష్కరణ, నామావిష్కరణ పట్ల మోజు, పోటీ ‘ఢీ’ కొట్టే సందర్భం. నువ్వు పుట్టినట్లు, నేల (అమ్మ) కడుపు నుంచి గుప్పెడు మట్టి పట్టి చూపాలట. ఫలానా మతమైతే దేశద్రోహి ముద్ర. భార్యాభర్తలు ఒకటైనా రెండు నెంబర్లు గానే. నెంబరుంటేనే మనిషి గా లెక్క. సృహలో వుంటేనే కనిపెట్టే విద్య అది.
బతుక్కు అర్థం బతకడమే. సొంతంగా,సాంతంగా.పిడుగు పడినా, చెట్టు కూలినా స్పందిస్తూ (నాకేం కాలేదు కదా అని కాకుండా), కాలిక్యులేటెడ్ ఇరుకుల్లో ఒరుసుకుంటూ, మనసులో పేరుకుపోయిన చెత్తాచెదారాల్ని ఊడ్చి పారేసి, కొత్త వూపిరిలూదుకుంటూ, ఎవరో తరుముకొస్తున్నట్లు కాక, నీదైన జీవితం నీదిగా, ఓ వాక్యం లోంచి, ఓ పంక్తి లోంచి, అరుదుగా ప్రయోగించే ఓ పదం లోంచి బతికే అవసరం నేర్పుతున్న నేర్పరితనం.
చారిత్రక ఆనవాళ్ల సౌందర్య దర్శనంతో ముగ్ధత పొందడం ఒకటి.స్ఫూర్తి, మమేకత, రక్తానుబంధం ఆవహించడం విశేషాంశ. గోల్కొండ అణువణువూ రక్త కణాలై, జననాంతర కారణాల వెతుకులాట. బాలాహిస్సార్ దర్బార్ రాజకీయ కచేరీ, తారామతి, ప్రేమావతిల పరవశ నృత్య గానం, రహబాన్ఫిరంగి విజయ గాథల స్ఫురణ, రామదాసు కారాగార భక్తి ఘోషలు, కుతుబ్ షాహీల సమాధుల ప్రతిధ్వనించే జాషువా పద్య పాదాలు. బంజారీ దర్వాజ నుంచి మొదలైతే నయా ఖిలా దర్వాజ దాక మట్టిలోంచి సాగిన అడుగుల గుర్తుల ఆలింగనం. చెరగని సాక్ష్యమే,అనుభవమే చెదరని అక్షర లక్ష్యమయింది.లక్షణమయింది.
వెంటాడిన గతానుభవ కాశ్మీరం స్వర్గ తుల్యమా? భగభగ మంటల మంచుకొండ. పచ్చని పచ్చిక తివాచీ మీద అబద్దాల వలలు పరుచుకుంటయి. ప్రతిరోజు చావు పలకరింపు. వాయిదాల వైధవ్యం.మెడకు కట్టుకున్న నిప్పుల ముంతలో జీవితాల ఆవిరి. కొత్త పదబంధాల, అందాల భూతల స్వర్గ కాశ్మీరం ఎప్పటికో....
అనుమానాల, అవమానాల అనుభవాలు కొత్తగాదు. లోక రివాజుగా మారింది. ఇందులోంచి రోహిత్ ని తప్పించలేదు. బతకడం కన్న, బతుకు కోల్పోవడమే బాగుంటుందనే నిర్ధారణ. జిగట జిగటగా అవమానం చేతివేళ్ల కొసలకు అంటుతూ వున్నపుడు ఆగ్రహ ప్రకటనగా మరణాన్ని ప్రేమించడం.పెనునిద్దుర వదిలించే సంచలనాత్మక ఆత్మార్పణ. అందరి మధ్యన ఒంటరివనే సూక్ష్మ పరిశీలన.
విస్తరిస్తున్న కాలం విచ్చుకుంటున్న పుష్పమేం కాదు. రెక్కలు విరిగిన పక్షి. నిప్పుల కల. విపత్తుల మాల.మనిషికొక సోదా కానుక. గొంతు మీద కత్తి పెట్టినా నవ్వుతూ మాట్లాడాలట. విధ్వంసాల కోసం కట్టిన స్వాగత తోరణాలు. సుఖశాంతులన్నీ రక్తమంటుకున్న పక్షి ఈకలు.
అయినా లేని రెక్కలతో పైకెగరడానికి పక్షి చివరి ప్రయత్నం మొదలు పెట్టింది. విచిత్ర, వైషమ్య విస్తరణ కాలానికి చెక్ పెట్టే దిశగా, ఇక్కడి కలకే కలం బలంతో.
అచ్చే దిన్ అనుకుంట హాయిగా గడిపేస్తున్నామా? సబ్ ఠీక్ నహీ హై. ఎక్కడో ఒక గొంతు గరగరల్ పచరిస్తున్నది. కాలమే కటిక చీకటి రూపంగా. కట్టిన ఇసుకగూళ్ల లోలోపలికి జొరబడుతూ, వెలుపలకి వస్తూ అలసిపోవడం... కొండొకచో కొన్ని తాళ్లతో (విలువలు,నీతులు, సామాజికం) మనలని మనమే కట్టేసుకుని... ఊపిరాడని ముడులతో, చీకటి లోపలికి వెళ్లిన కొంచం వెలుతురు మళ్లీ కనిపించక వెతుకులాటలలోనే ప్రశ్నల,జవాబుల,సూత్రాల,మరికొన్ని ఆంక్షల, మరికొన్ని భ్రమల గడిపే జీవితానికే పేరు పెడదాం? అంతర్లోక బహిర్లోక వివేచనా మథనం.
కలలాంటి వాక్యం, చినుకులాంటి వాక్యం,పెనుగులాడుతూ ఎగసిపడే వాక్యం తప్పిపోయింది. ఫలితంగా పూవుల సామూహిక ఆత్మహత్య, పాదాలు మొలిచిన పొలం, నెత్తురోడిన వాడ, ఖైదు చేయబడ్డ వీల్ చైర్, విరిగిన చూపుడువేలు, మార్కుల హత్య, ఆవు,గుర్రాల సాక్ష్యం యవనిక వేదిక మీద వీరంగ మేస్తున్నయి. అశాంతి, అలజడుల సుడులు చుట్టుముట్టి, మనిషి బ్రతుకును ప్రశ్న చేస్తున్నయి. గోడల మీద బొమ్మలు గీసుకునే సాలీడు, పరుగులు పెట్టే బల్లి, గంటల చప్పుళ్ల గేటు, పత్రికా, పుస్తకం ఏదంటే ఏదీ సాయపడదు, కనుమరుగవుతున్న ప్రజాస్వామ్యం లాంటి ఆ వాక్యాన్ని వెతికి పెట్టడానికి. ఆ వాక్యముంటే, అందిపుచ్చుకుంటే పై వన్నీ మటుమాయాలే. కాగితం ముందేసుకుని మనసు రిక్కించి ఎదురుచూచే సంకల్ప శుద్ది.
తన ముఖాన్ని తాను చూసుకోవడం, తన మనసులోకి తాను తొంగి చూసుకోవడం, చూడలేని వీపు వెన్నుపూసల కుదుళ్ళను స్పృశించుకోవడం, నడిచొచ్చిన తొవ్వల అడుగులేరుకోవడం, ఒక సుదీర్గ మననం,రే పటికి రూపు దిద్దుకోవాల్సిన సరికొత్త జననం కోసం అవసరం. బాల్యం అమూల్యం. కొందరికి అవహేళనం. కొందరికి అందలం. ఐస్క్రీమ్ అమ్మడానికి యిన్నన్ని కష్టాలుంటాయా? చెప్పితే ఐస్ క్రీమే కరిగిపోతది దయనీయంగా. గోదావరిఖని, రామగుండం, గాంధీ చౌక్ మెకానిక్ షెడ్ అరుగు, థరమల్ పవర్ మలుపు, రైల్వే , బొగ్గుబావి కాలనీలు, ఎర్రటెండల తారురోడ్లు తన గుర్తులను మోస్తున్నయి.తిరిగి తిరిగి, అమ్మీ అమ్మక వాలిన పొద్దు మీద బండెద్దులా వాలిపోయినా, రేపటి కనీస చిల్లర పైసలంతటి భవిష్యత్తు కోసం కరగని కలలకు ట్యూన్ లు కట్టుకుంటూ, పాడుకుంటూ...
గత చరిత్రంతా వగపేనా దాష్టీకమేనా? అందరికంటే ముందు చదువుకున్నందుకు, గ్రంథాలు, సూత్రాలు లిఖించినందుకు నడిచిందే ధర్మంగా, నడిపిందే శాస్త్రంగా ఆధిపత్య వ్యూహంగా సామాన్యుడొక ఆత్మగౌరవం లేని కట్టెపుల్లగా - ఒక పుట.
రాజ్యాలు, సంస్థానాలు, అధికార దాహాలు, దండయాత్రలు, సరిహద్దులు చెరిగిన సంధర్భంగ కొత్త సంస్కృతి చేరిక. ఒంటిమీదికి వస్త్రం, చేతికి పలకా బలపం చేరి, అక్షరం అట్టడుగువాడి ఆత్మను తట్టి,గుడిసెల గొంతులు దీపాలైన వేళ-ఒక పుట- అంటరానితనం, వెలివేతలతనం, మనిషినని తెలుసుకున్నా, మనిషిగా పరిగణించనితనం- ఒక పుట- మనిషిగా స్థిరపడే తెగింపులో మతమార్పిడితో కొద్ది ఊరట. అయినా ఆధిపత్య ముళ్లతాకిడి- ఒక పుట-
రాజ్యాంగం ఆత్మగౌరవ పత్రం, హామీ పత్రం, నజరానాలు, భరోసాలు ప్రసాదించినా అసహనాల, అహంకారాల ఆధిపత్య కొరకొర-
ఈ కొరకొర పోరుల్లో బౌద్దం పొలిమేర దాటింది. జైనం కనుమరుగైంది. శైవం చతికిలబడింది. అప్పుడు వైదికం వచ్చి చేరింది. భయపెట్టే, భీతిగొలిపే, బీభత్సభరిత, బుజ్జగించే నిర్మాణ ఎత్తుగడల సూత్రాల అనేక రూపాల అవతారాలుగా- ఒక పుట- ఊరి దేవతల ముందు డప్పు చప్పుళ్లతో జీవితాన్ని పండుగగా సెలబ్రేట్ చేసుకుంటున్న ఊరి మనిషిని మటుమాయం చేసే కుటిల వ్యూహం ఒక పక్క,
అఖండ దేశ నినాదం తో,ఒకే దేశం ఒకే భాష ప్రవచనంతో వస్తువుగా మార్చి మనిషిని ఆత్మ లేని మొండెంలా నాలుక లేని జీవిగా ఏమార్చే వ్యూహం మరో పక్క-ఆఖరి పుట. ఇన్ని పుటల చరిత్రలో కనిపించించొచ్చు పరిణామం, అభివృద్ది, వికాసం. లీలగా వినిపించే విధ్వంసం మాటేమిటి? అదే తవ్విన చెమటపట్టిన తనం.
అక్షరాల ప్రపంచం అలవి కానిది. అంతు దొరకనిది. ఆకర్షణే తప్ప వికర్షణ వుండదు. నడకా, నడవడే ప్రధానం. గమ్యం, విజయం అనే మాటలుండవు. ప్రజా చేతన. ప్రజా రంజన ఉజ్జాయింపుగా అనుకోవచ్చేమో.
పొరలు పొరలుగా ఒక మార్మిక భావనను విప్పుతూ-
తెరలు తెరలుగా పద వరుసలను అల్లుతూ-
వాచ్యార్థక శిల్పంలో సన్నని కాంతి మిణుకు మిణుకు మంటూ శోభాయమానంగా విరాజిల్లడం-
పరస్పర వైరుధ్యాల విషయాల సమాహారంగా -
పేదరాశి పెద్దమ్మ నోట్లోంచి అదాటున ఊడిపడే పలుమాటల కథాత్మక నిర్మాణంగా-
వ్యక్తీకరణలో నవ్యత, నిపుణతగా
పదాల,పంక్తుల, పేరాల భాషా,ఊహా దారిద్రం లేని సంపన్నతంగా-
వస్తు విస్తృతి, కల్పనాశక్తి, సహజవాక్య ప్రతిష్టంగా-
వస్త్వాశ్రయ,ఆత్మాశ్రయ, తాత్విక చింతనా సమిశ్రితనంగా-
గంగా జమునా తేహజీబ్ పరిమళం పరిచినట్లుగా-
నెమ్మదితనం, కమ్మనితనం, ఒక అమ్మతనం గా-
శివారెడ్డి, అఫ్సర్, నారాయణ స్వామి లు కళ్ల ముందు నిలుస్తరు. జలీల్ అలీ, జాన్ ఎలియా,మఖ్ధూం, అహ్మద్ ఫరాజ్ లు హృదయంలో ద్రవిస్తరు. ఒక సూఫీ, ఒక రూమీ, ఒక సంత్ కబీర్ బతుకు తత్వమై పోతరు. ఒక సమూహాన్ని విడిచి వుండలేని మనసు. ఒక సమూహాన్ని నిర్మించే ఆరాటపు మనిషి. ఒక తడి నిల్వల కోసం బెంగటీలే కవి,
ఒక అక్షరం ఆకుల మధ్య నుంచి మొగ్గలా మొదలవుతుంది. మొగ్గ ఎవరూ? యాకూబ్. కాదు వికసన పువ్వు. ఉహూ కాదు పూలచెట్టు. అవును పచ్చని కవిత్వం పూలచెట్టు కవి యాకూబ్.
ఊరి (కవిత్వం) పొలిమేరల్లో నిలబడి ఎదురు చూస్తున్న అమ్మ లాంటి యాకూబే, ఆ నవయుగ మదెంతదూరమైనా వేచి వుంటడు. అది రాక తప్పదు.
అక్షరాలు అలాంటివి మరి.
#యాకూబ్ తాజా పుస్తకం “ తీగలచింత “ చదివాక.
- దాసరాజు రామారావు.