ఆధునిక సాహిత్య ప్రక్రియలలో "వచన కవిత్వం" ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది.ఆంగ్ల భాషా సంస్కృతుల ప్రభావం తెలుగు కవిత్వంపై అధికంగా పొడచూపడం మూలంగా,ముఖ్యంగా ఆంగ్లకవులైన పి.బి షెల్లీ,వడ్స్ వర్త్ ,కీట్స్ రచనల ప్రభావం వల్ల నవ్య, భావ కవిత్వోద్యమాలు ఊపందుకున్నాయి.తెలుగు పద్యం ధీర్ఘసమాసాలతో,శబ్ధఆడంబరాలతో,భావగాంభీర్యతలతో,అలంకార ధ్వని విశేషాలతో కూడుకుని కేవలం పండితుల పాండిత్య ప్రకర్షకు పరాకాష్టగా ఉండేది. పద్యం  రాజ్యమేలుతున్న కాలం నుండి వచనంవైపుకు కవిత్వం  ఒక యూటర్న్ తీసుకుందనేది అందరూ అంగీకరించే,ఆమోదించే సత్యం.వజ్జల రంగాచార్య గారు అందుకు మినహాయింపేమి కాదు. 

"కవిమందారం" డా॥వజ్జల రంగాచార్య గారు పద్యకవులుగా సుపరిచితులు. పద్యంతో పాటు వచనంతో సుత సహజీవనం చేస్తూ దూసుకుపోతున్నారు.గతంలో రంగాచార్యగారు "సులోచనాలు"అనేపేరుతో తన మొదటి వచన కవితాసంపుటిని వెలువరించారు.

Also Read: సమీక్ష: "అచ్చంగా నేనే "- రాపాక శ్రీనివాస్ కవిత్వం

2017  జూలైనెల రెండవ శనివారం రోజున కాళోజీ స్థాపించిన మిత్రమండలి సమావేశానికి రంగాచార్యగారు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అక్కడే నాకు వారి పరిచయభాగ్యం కలిగింది.కార్యక్రమంలో కోవెల సుప్రసన్నాచార్యులు,అంపశయ్య నవీన్ ,వి.ఆర్ .విద్యార్థి మొ॥న ప్రముఖులు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.వీడ్కోలు సమావేశం అనంతరం రంగాచార్యులు గారు తను రచించిన రెండవ వచన కవితా సంపుటి "సీతాఫలం" నా చేతికందించారు.

 పద్యకవుల వచన కవితాసంపుటి కదా అనుకున్న.మనకేం అర్థమవుతుందిలే అన్న మీమాంసలో వుండిపోయిన. ఇంకోపాలి పుస్తకం ఇచ్చిన్రు కదా..దీని సంగతేందో సూద్దామని సదువుడు షురుజేసిన. వయ్యిని చేతుల్లోకి తీసుకున్న."సీతాఫలం"ను సంషుష్టిగ ఆస్వాదించాననే చెప్పాలి.గింజలులేని  సింతపల్కపండు తన గూగాన్ని దేవిదేవి నా నోటికందించింది.ఆహా...ఎంత మధురం !అమృతఫలమని అందుకే అన్నారేమో !

Also Read: పుస్తక సమీక్ష: ఇంద్రధనుస్సు రంగులు అద్దితే

 ప్రాచీన అలంకారికులు రచనాశైలిని బట్టి ద్రాక్షాపాకము,కదళీపాకము,నారికేళపాకములుగా వర్గీకరించడం జరిగింది."సీతాఫలం" అనే వచన కవిత్వపు శైలి దాదాపుగా ద్రాక్షాపాకమనే చెప్పాలి.మొత్తం కవితాసంపుటిలో నాలుగు డజన్ల కవితలున్నాయి.హృదయస్పందనను శబ్దాలుగా కూర్చి కవిత్వంగా చిత్రించడం తెలిసినవారు. విశాలమైన ప్రకృతి,సువిశాల ప్రపంచం,నవరసాలను ప్రదర్శించే సోదర మానవగణం,సత్సంబంధాలు,సాధకబాధకాలు అన్నీ  శబ్దరూపాన్ని తొడుక్కుని "సీతాఫలంగా మన నోరూరిస్తది.కావ్య వస్తువుకు కొదువలేదు.

అమెరికాలోని న్యూయార్క్ ,న్యూజెర్సీ మహానగరాలను కవి సందర్శించినపుడు అక్కడి ప్రగతి,ప్రకృతి సౌందర్యం కొన్ని కవితలకకు వస్తువులైనాయి.అందులో అందరి అభిమానాన్ని పొందిన "నయాగారా" కవిత్వంలోకి ఒక్కసారి దునుకుదాం.

"నీటికదలికల కింత లావణ్యమా
జలతరంగాలకింత సంగీతమా
పానీయమా ! లాస్యశృంగారయానమా"...

"హరిణాలవలె పరుగు-హంసరెక్కల నురుగు
వెండి కరిగిన అలుగు-వెన్నె ముద్దల జిలుగు "

నయాగారా ప్రవాహాంలో కొట్టుకుపోతూ,తన్మయత్వంలో మునిగిపోవాల్సిందే ఎవరైనా...ఒక్క నయాగారానేనా ? కాదు కాదు మహారాష్ట్ర లోని నాగపూర్ దగ్గర కొండలపై వున్న"చిక్కల్ ధారా"జలపాతానికి సుత మంత్రముగ్ధుడై పరవశించిపోతాడు కవి.

"ఇక్కడి  గుట్టలు,లోయలు,మైదానాలన్నీ
ఆకుపచ్చ చీరలే కట్టుకుంటాయి.
మధుర జలాలనే దానం చేస్తుంటాయి"....

"అర్జునవృక్ష మూలాలు స్పృశించే 
ఔషధానంద ప్రవాహాలు
శిఖర సందోహవృక్షవాటికల మధ్య
చిక్కల్ ధారా ప్రవాహాలు".

Also Read:పుస్తక సమీక్ష: వెలుగు కలల పాట

కవి అందాల్ని ఆస్వాదించే తీరే వేరు.కవి సౌందర్యారాధకులు.ప్రకృతి సోయగాలకు ఎంత తన్మయుడవుతాడో,ప్రకృతి విధ్వంసమవుతున్నపుడు అంతగా తల్లడిల్లిపోతాడు.ఎండిన చెరువుల్ని చూసి చలించిన కవి "చెరువులకు కోటలు కడదాం" అంటాడు.

"చెరువులను చూస్తే
కడుపు చెరువవుతున్నది
కూలి మనుషుల జీవితాల్లా
సగటు మనుషుల ఆశయాల్లా
బక్కచిక్కి ఎండిపోయిన 
పర్రెల్లా,ఒర్రెల్లా,కాటికి
కాళ్లు చాచిన బర్రెల్లా
ఉసూరోమని ఉండిపోయినాయి"

 కాటికి కాళ్లు చాచిన బర్రెలా చెరువుందనడం ఇక్కడ మనం గమనించాలి.ఎవరికీ పట్టని తనం గురించి ఆలోచించాలి.కవి సమయాలతో మనం తదాత్మ్యం చెందాలి.ప్రకృతిని ఎంతగ ప్రేమిస్తాడో,ఎంతగ పూజిస్తాడో కవి."పూజించడమే మా ప్రకృతి"అంటాడు.

"పత్తిని బట్టగనేసి
కొయ్యను కొమ్మగచెక్కి
పత్రిచుట్టి-పూలుపెట్టి
పూజిస్తాం అమ్మగ
కలిసి బతుకుతాం కమ్మగ "

ఇక్కడి మనుషులు తమ సంస్కృతిలో భాగంగా ఇంతకాలం ప్రకృతిని కాపాడుకుంటూనే ఉన్నరు.ఇప్పటి పరిస్థితి మనకు తెలిసిందే.ఎక్కడ చూసినా విధ్వంసం.రేపటిని ఊహించకపోవడమే మంచిది.ప్రకృతి విధ్వంసాన్ని సుత కైగట్టడం కవి బాధ్యతే.విస్మరించకూడదు.

 ప్రకృతిలో   చెట్లే మన బతుకుదెరువు.కవి దృష్టికోణంలో  చెట్లు బారులుతీరిన సైనికులయితరు."వాషింగ్ టన్- డి.సి"కవితను ఆస్వాదిస్తాం.

"పర్యావరణాన్ని పరిరక్షించడానికి
సైనికుల్లా బారులుతీరి నిల్చున్నచెట్లు
ఒయ్యారి భామల్లా ఒళ్లు విరుచుకుని
నవ్వుతున్న పూలతీగలు "
       
అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో సాయంత్రం తొమ్మిదైనా చీకటిపడదని "టైమ్ స్క్యేర్ "కవితనల్లుతాడు.మూడవ ప్రపంచయుద్ధం రాకుండా వుంటే మరో గ్రహంపై మనుగడ సాగిస్తాడని ఆశావాహదృక్పథాన్ని వెలిబుచ్చుతాడు.

 "సి.నా.రే మీకు నమస్సు"అని వారు చనిపోకముందు రాసిన కవిత,ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 80సం॥లునిండిన సందర్భంగా రాసిన "జ్ఞాన సరస్వత్త్వైనమ:"కవిత,శ్రీమతి రామానుజమ్మ స్మృతిలో రాసిన "మానస సరస్సు" కవిత కవిలోని మరో పార్శ్వాన్నిచూపిస్తుంది."జ్ఞానసరస్వత్త్వైనమ:" లాంటి కవితల్లో పద్యచ్ఛాయలు అధికంగా వుండి,నారికేళపాకంలా సంస్కృతభూయిష్టమైన పదజాలంతో నడకసాగుతుంది.కవి చెప్పుకున్నట్లు - వచనకవిత్వం రాస్తుంటే  తెలియకుండానే మాత్రాఛంధస్సులోని లయ,తూగు,అనుప్రాస అనుకోకుండానే వచ్చి కూర్చుంటాయి.అలా జమిలిగా నడిచే రూపలక్షణం ప్రకటితమవుతూ వుంటుంది.అయితే ఇలాంటి కవిత పద్యంలోనే మరింతగా శోభిస్తుంది.

Also Read: ఆప్యాయతల పాశబువ్వ ఈ "బంతిబువ్వ"..

కాగితంపూలు,నాల్గురోజుల మనిషి,ఒంటరి,నదిలాంటి మనిషి లాంటి కవితలు దేనికవే ప్రత్యేకమైనవి.లక్ష్యం లేకుండా బతికే మనుషులని కాగితం పూలతో పోలుస్తాడు.ఏ సువాసనాలేని కాగితంపూలలాగే జీవం లేని నవ్వులు,పొందిక లేని మాటలు,ఆర్థ్రతలేని పాటలు ఉంటాయని కవి మనతో సంభాషిస్తాడు."నాల్గురోజుల మనిషి" కవితలో ఆరోగ్యంగా వున్నపుడు,చేతిలో పైసలున్నపుడు,నిషాలో మునిగి తేలుతున్నపుడు మనిషి తత్త్వాన్ని కలవరిస్తాడు కవి. "ఒంటరి"కవితలో ఒంటరితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో,ఎంతగా దిగజారుస్తుందో ఊహించని పరిస్థితిని వర్ణిస్తాడు.కవికి సాయితగాడు దొరకడం పుణ్యం చేస్తే లభించే వరంగా"నదిలాంటి మనిషి" కవితలో స్నేహం గురించి చెబుతాడు.
             వైవిధ్యభరితంగా సాగే కవితాసంపుటిలో"కొత్త పరికిణీలు"పేరుతో "నానీలు"అసోంటి కవితలు రాసిండు.
"ఆడి తప్పనివాడు 
హరిశ్చంద్రుడే
తప్పినవాడే రాజకీయుడు"
      "ఓ వీరుడా"లాంటి గేయం అలతి పదాలతో అలరిస్తుంది.
        "వీరజవానులకు శాల్యూట్ "కవితలో 

"రక్షకదళములు మేమని
అండకోశమగు భూమికి
కేసరములు మీరని  చెప్పెడి
వీరజవానులకు శాల్యూట్ " అని నినదిస్తాడు.ఇక్కడ సెంట్రల్ లైటింగ్ సిస్టంలా "కేసరములు మీరు" అనే పోలికను అనుకోవచ్చేమో !

తీగెలా తెగించు,సీతాఫలమా,తలెత్తిన బ్రతుకు లాంటి కవితలు మనల్ని అలరిస్తాయి."తీగెలా తెగించు" కవితలో అవకాశాలు అందిపుచ్చుకునే చాకచక్యము వుంటే చందమామను సుత అందుకోవచ్చని చెబుతాడు."సీతాఫలమా" కవిత పూర్తిగా వర్ణనతో కూడివుండి మధురానుభవాన్ని కలిగిస్తుంది.

"చిట్టి సీతాఫలవృక్షమా
చిగురించిన మధురహృదయమా!"..,

"తోటలేని దానివిగదె
బాటలకిరుప్రక్కమొలచి
పాడుబడిన కోటలలో 
బీడుబడిన పొలములలో
చినుకురాల పులకరించి".....ఇలా సాగుతూ వుంటుంది.           

"తలెత్తిన బ్రతుకు"కవిత కవి వృత్తి జీవితాన్ని ప్రతిబింబింపజేస్తుంది.పదవీ విరమణ సమయంలో అంతకుముందులేని అభిమానం,పొగడ్తలు అనివార్యమైన పరిస్థితి,పెన్షన్ పాస్ కావడానికి ముట్టజెప్పుకున్న పర్సంటేజ్ ;దండలతో,దండకాలతో తడిసిముద్దై,గొంతులో ముద్ద దిగకపోవడం;ఆత్మను నమ్ముకుని,ఆత్మను అమ్ముకోని బడిపంతులుని కదా !అని సర్థిజెప్పుకుని ప్రశాంతంగా నిద్రించడం -ఇవన్నీ నెమరువేసుకునే విధానం  కనిపిస్తుంది.

"ఇవాళ ఎంతో ప్రశాంతంగా ఉంది
గుర్రంలా పరిగెత్తేది లేదు
గాడిదలా బరువు మోసేది లేదు
ఆవులా అనుభవాలు నెమరువేసుకుంటూ
వాలుకుర్చీలో తలవాల్చి
సూర్యోదయాన్ని చూస్తున్నా "

విశ్రాంతజీవితం గడుపుతున్న కవి మరింత సహజంగా అలతి అలతి పదాలతో కైగట్టిన కవితలతో మరింతగా మనందరి హృదయాలకు చేరువకాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు నచ్చిన -"సీతాఫలం " నెమరువేసుకున్న అక్షరాలను హృదయంతో అర్పిస్తున్నాను-శనార్తులు.

- బండారి రాజ్ కుమార్