రేపే 'కవివారం ' కవితా సంకలనం పుస్తకావిష్కరణ
రేపు అనగా 13న సాయంత్రం 5 గంటలకు రవీంద్ర భారతి సమావేశ మందిరంలో తెలంగాణ రచయితల సంఘం - జంట నగరాల శాఖ నుంచి వెలువడుతున్న 'కవివారం ' కవితా సంకలనం ఆవిష్కరణ సందర్భంగా ఈ పుస్తకానికి డా. నందిని సిధారెడ్డి రాసిన ముందు మాట ఇక్కడ ఇస్తున్నాం. చదవండి.
సృజనోత్సాహం
అన్నింటికన్నా మానవుని సృజనోత్సాహం గొప్పది. కొత్తదనాన్ని ఆవిష్కరించటానికి సమాయత్తమయ్యే మానవుని హుషారే వేరు. ఆ మానసిక స్థితిని అక్షరాల్లో వర్ణించలేం. సృజనోత్సాహం లేకపోతే మానవుడు సృష్టిలో విశిష్ట జీవిగా నిలదొక్కుకునే అవకాశమే లేదు. ఇంతకుముందు లేనిదేదో తాను రూపొందించాలనే తపన, ఇంతకుముందు ఎవరూ చెప్పనిదేదో లోకానికి చెప్పాలనే చింతన మానవుని శిఖరాలకు చేర్పించింది. మాటను సృష్టించటం, మాటను అలంకరించటం, మాటను గొప్ప సమ్మోహన శక్తిగా తీర్చిదిద్దటం అంతా సృజనోత్సాహ ఫలితాలే. అవసరాలను, అనుభవాలను, ఆత్మీయతలను వ్యక్తీకరించటం కోసం అశేష పద సంపద రూపొందించటం అసాధారణమైన విషయం. భాష వల్ల బంధాలు, బంధాల వల్ల భాష పరస్పరం ప్రభావితమై సంతరించుకున్న సంస్కారం అపురూపం. కాలాన్ని, తత్వాల్ని, కల్పనలనూ, సౌందర్యాన్ని ఒడిసి పట్టిన కళలన్నీ సృజనోత్సాహ ప్రతిబింబాలే. అన్నిటిలో కవిత్వం నవనవోన్మేషం.
మనిషి ఒంటరి జీవి. సంఘజీవి. ఒంటరితనంలో ఆలోచిస్తాడు. సంఘంతో ఆచరిస్తాడు. ఒక్కడుగా చేయలేని పనులు బృందంగా పూర్తి చేస్తాడు. బృందంతో కొత్త అందాలు సరి కొత్త చర్చలు కొంగ్రొత్త స్వప్నాలు సాకారం చేసుకోగలుగుతాడు. కవిత్వం ఒక్కడు రాసుకునేదే. ఒక్కడు సృజించేదే. కానీ - మరొక కవితోనో, సహృదయుడితోనో పంచుకొన్నప్పుడే పూర్ణ రూపం వస్తుంది. పంచుకోలేకపోతే చతికిల పడుతుంది. ప్రేమయినా, ఆనందమయినా, దుఃఖమయినా ఒక్కడే అనుభవించలేడు. అనుభవించబోయినా ఊరటపడలేడు. మరో మనిషి తోడు తప్పనిసరి. కవిత్వానికి ఉత్సాహం సమూహమే. సమూహం నుంచి అంచెలంచెలుగా పొందే భావోద్వేగాలే కవిత్వానికి మూలాలు. కవిత్వం కార్యాచరణ తోనే వికసిస్తుంది. విస్తృతమవుతుంది. పరివ్యాప్తమవుతుంది. సమాజ జీవితం సోకకుండా రసం లేదు. రసప్లావితం లేదు. 'లోకంబును వీడి రసము లేదు’ అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ అందువల్ల - కవిత్వ వికాసానికి లోకం అవసరం. బృందం ఆవశ్యం. బృందం సమూహమై, సమూహం నిర్మాణ రూపమైతే అది సంఘం.
తెలంగాణ రచయితల సంఘం జంట నగరాల శాఖకు కవిత్వం తలమానికం. కవినీ కవినీ కలిపి కవిత్వాన్ని వికసింప చేయటానికి తలపెట్టిన కార్యక్రమం కవివారం. ప్రతి సోమవారం సాయంత్రం సాంకేతిక మాధ్యమంలో కవులు కలుసుకోవటం, కవితలు వినిపించుకోవటం, విశ్లేషించుకోవటం సృజనోత్సాహ వేడుక. రచన చెయ్యాలనే వాంఛ రగిలించటమే మంచిపని. రచనల్ని సరిదిద్దే వేదిక నిర్వహించటం మరింత మంచి పని. కవిత్వ తలంపుతో కవిత్వ పులకింతతో వారం వారం కవిత్వ వాతావరణమై అల్లుకోవటమే కవివారం. అది కవి తీరం, కవిత్వ సమీరం.
కవి వారం ఆన్లైన్లో రెండేళ్లుగా సాగుతున్నది. కవిత్వాన్ని సాన పడుతున్నది. వారం వారం కవులు పరస్పరం వినిపించుకొని సవరించుకున్న కవితలు కొన్నింటి సంకలనమే ‘ కవి వారం.’ శీర్షిక సరిగ్గా అమరింది. 32 మంది కవుల ముప్పిరిగొన్న భావోద్వేగాలివి. ఏ కవికి ఆ కవి విడివిడిగా కవిత్వం సంపుటులు ప్రచురించటం వేరు. కవులు కొందరు సమూహంగా ఐక్యతగొని అనుభవాలొత్తుకొని కవిత్వ సంకలనం ప్రకటించటం వేరు. ఐక్యస్ఫూర్తి, బృందస్ఫూర్తి సంకలనం నిండా ప్రతిధ్వనిస్తున్నది. సహృదయులెవరైనా ‘కవి వారం’ స్పూర్తిని, సంకలన స్ఫూర్తిని అభినందించకుండా ఉండలేరు.
ప్రపంచమెంత విశాలమైందో కవిత్వమంత విశాలమైంది. జీవితమెంత వైవిధ్యమైందో కవిత్వమంత వైవిద్యమైంది. ప్రజల దృష్టి సోకకపోతే ప్రకృతి శోభలకర్థం లేదు. ప్రకృతి ఒడి చాపకపోతే ప్రజాబాహుళ్యానికి బతుకు లేదు. ప్రకృతి, ప్రజా జీవితం, ప్రపంచ గమనం చుట్టూ ఆవరించుకొని ఉన్నంతకాలం కవిత్వానికి తిరుగులేదు. కవి ఊహకు తిరుగులేదు. తను మెరుగు పెట్టుకుంటూ లోకానికి మెరుగు పెడుతూ ముందుకు నడవటమే. సాకులకు తావు లేదు. సాగిపోవటమే.
‘రాయగలిగినవాడు రాయాలి గాని
చదవగలిగినవాడు చదవగలడు’
(కందుకూరి శ్రీరాములు - కళాత్మక కళ )
లోకాన్నర్థం చేసుకుంటూ సాగిపోయే వాడే మనిషి. మనిషితనాన్ని ప్రేరేపిస్తూ అల్లుకునే వాడే కవి. ’అక్షరం ఎవరి సొంత గూటికి పక్షి కాదు’ అని ప్రకటిస్తూ రాళ్లు రప్పలకు వెరువకుండా పురోగమించటమే కవి ధర్మం.
ఆవాహన చేసుకోవాలే గాని కవి చుట్టూ కావలసినంత ప్రకృతి సంపద, అందుకోలేనంత అనుభవ సంపద, పరవశించేటంత పద సంపద విరబూసి ఉన్నది. చేదుకోవాలి. ఊహకు గయికట్టి కొసఫలాన్ని దొరకపుచ్చుకోవాలి.
‘ప్రకృతి కౌగిలింత ప్రియురాలు కన్నా గొప్పది’
(దాసరి మోహన్ - ఆనందాల పొట్లం )
అంటాడు. చిన్నచిన్న ఆనందాన్ని పొట్లం కట్టుకుని పులకించే మనిషికి ఎన్ని వదులుకుంటే, ప్రకృతి కౌగిలింత? ఆ అనుభూతి కవి ఒక్కడికే సాధ్యం. ఆ స్థాయికి చేరుకున్న కవి భావనలే వేరు.
‘తేనే శ్రమ ఫలం
తుమ్మెదలదా ! కలువలదా ?
(అహోబిలం ప్రభాకర్ - తరుగుతో మెరుగు)
కవి చూపు చిత్రమైన ప్రశ్నలకు నెలవు. తేనె రుచి అద్భుతమే. ఆస్వాదించేది మనిషి. తేనె శ్రమ ఎవరిది ?తుమ్మెదలదా .....కలువలదా .....ఒకచోట ప్రశ్నే కవిత. మామూలు ప్రశ్న కాదు కదా –
మనిషి నిర్మించుకున్నది ఊరు. ఆ ఊరే మనిషిని వదిలించుకుంటున్నది. సందడిగా ఉండాల్సిన ఊరు శాంత చింతలోకి వెళ్ళింది.
”ఋషిలా జీవిస్తుంది నా ఊరు "
( గజవెల్లి - ఊరు )
ఉన్నస్థితిని చిత్రించి ఊరటపడవచ్చు కవి. "కాలాన్ని పొడిచి పొడిచి గాయం చేసే కనుగుడ్ల సోన లావాగా కారింది చీకటి "
(ముదిగొండ సంతోష్ - దీర్ఘ రాత్రి )
రాత్రి కురిసే చీకటికి వ్యాకుల పడటం కవికి పరిపాటి.
మనిషికైనా, కవికైనా తృప్తి దొరకదు. ఎవరికైనా జీవితం అనుకున్నట్లు ఉండదు. కవి ఊహించినట్లు కాలం సాగదు .
'సరిపడే గుడ్డ ముక్క ఎప్పటికీ కుదరదు '
(దేవనపల్లి వీణా వాణి - గుడ్డ ముక్క )
అట్లాంటప్పుడు రాజీపడి రాజీపడి జీవించడం కష్టమే. రైతు జీవితమే కష్టం.
'ఋతువు కొకసారి రైతు మరణిస్తుంటాడు '(టర్మినేటెడ్ సీడ్స్) వ్యాపార ఉచ్చులు బిగుసుకున్నప్పుడు వ్యవసాయానికి ఊపిరాడదు. ఉక్కిరి బిక్కిరైనప్పుడు ఉరుకోచ్చేది దుఃఖమే.
‘ఏడుపు ఇప్పుడు నీ ఉనికిని చాటే గుండె చప్పుడు అయ్యింది’
(నరేష్ చారి - ఆ రోజొ ఒకటి...)
విస్తరించి ఉన్న దుఃఖం నుంచి కవి విడివడ లేడు.
'ఎవరు వాక్య మవ్వగలరు అతని కన్నీటి కావ్యానికి’
(నల్లగొండ రమేష్ - సముద్రమంత దుఃఖం )
దుఃఖాన్ని వర్ణించడానికి బలమైన వ్యక్తీకరణలు వెతుకుతాడు కవి. ఎవరి దుఃఖానికైనా తల్లడిల్లే వాడు కవి ఒక్కడే.
'పార్థివ దేహం మీద ఎవరెన్ని పూలు జల్లినా
నీ కన్నీటి చుక్కలే పరిమళించాయి '
(రూప్ కుమార్ డబ్బీకార్ - తెర తొలిగిన దృశ్యాలు )
దుఃఖస్థితిని చిత్రించి హృదయాలు పిండుతాడు కవి. వేళను బట్టి పూలు. దుఃఖ వేళ పూలు పరిమళించలేవు. కన్నీటి చుక్కలు పరిమళించడంలోని విషాదమే వదిలిపెట్టదు.
'చెప్పకుండానే నాయన బాధను పంచుకునేది
ఒక మిత్రునిలా అర్థం చేసుకునే మౌనసాక్షి చిలక్కొయ్యే కదా’
(దుగ్గి గాయత్రి - చిలక్కొయ్య)
దుఃఖం దాచేది అంగి. అంగిని భరించేది కొయ్య. కొయ్యకుండే జాలి కూడా సహమానవులు కోల్పోవడం విషదాలకంటే విషాదం.
'ఓట్లు కొనగలిగే సత్తా ఉన్న దేశంలో
వడ్లు కొనలేకపోవడం విచారకరమే’
(సోమశిల తిరుపాల్ - ఆగమైపాయె)
విచారాలకు, విషాదాలకు చూపులేని పరిపాలనే. మనిషిని ఆసాంతం చప్పరిస్తున్న ధనభావనే. ధన భావనకు దన్ను ఆధిపత్య భావన. ఒకరిని తొక్కటం,ఒకరిని మొక్కటం,మరొకరిని ఎత్తటం. ఆదిపత్యాన్ని అన్ని కాలాలు భరించలేవు. అన్ని హృదయాలు సహించలేవు. నిలదీస్తాయి. ప్రశ్నలు వెలుస్తాయి.
'ఎందుకు కాలి కింది చెప్పును అవాలి
స్వేచ్ఛగా ఎగిరే విహంగాన్ని ఎందుకు అవకూడదు ! ‘
(సరోజ వింజామర - ప్రశ్నించే గొంతు )
ప్రశ్నించటం కవి సహజలక్షణం. స్వేచ్ఛనూ, సమానత్వాన్ని నలు దిక్కులా పంచుతాడు.
గత కాలపు తీపి స్మృతులు నెమరు వేసుకోకుండా మనిషి ఎట్లా జీవించలేడో కవీ జీవించలేడు. వర్తమానంలోని అనుభవాలతో తూచుకోకుండా మరువలేడు.
'నీ తెగిన చెప్పులకు నా చొక్కా పిన్నీసు
పెట్టుకొని నడిచిన ఆ అడుగుజాడలు
తోకల రాపిడిలో తుడిచిపెట్టుక పోయాయి '
(వేణు నక్షత్రం - పేరు వెనుక తోక )
పాత స్మృతుల పరవశానికి కొత్తగా మొలచిన తోకలొక అడ్డంకి. తోకలు చూసుకొని కొందరు పరవశిస్తుంటే తోకల అసహజత్వాన్ని కృత్రిమత్వాన్ని చూపుతాడు కవి. కవికి తోకలు గిట్టవు ఊహలు తప్ప. కవికి సరుకులు గిట్టవు పురాస్మృతులు తప్ప.
'అమ్మ లేదు గాని – చెక్క పెట్టల తొమ్మిది గజాల చీర అమ్మనే యాది జేస్తది.'
(కందాళై రాఘవాచార్య - పురాస్మృతులు )
తెలంగాణ రాష్ట్రం సాకారమైనా బతుకు చిత్రం మారనప్పుడు భరోసా ఇచ్చేతత్వం కవిదే.
'ఈ తెలంగాణ ఇంకా తెలివితోనే ఉన్నది '
(ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ - తల్లి సిగలో తంగేడు )
విసృష్టంగా ప్రకటించే స్వభావం కవి స్వంతం.
బతుకెప్పుడూ స్మృతులు తలుచుకుంటూనే ఉండదు. అనునిత్యం విషాదంలోనే కూరుకుపోదు. బతుకంటే కష్ట సుఖాల కలయిక. కాలం అంటే చీకటి వెలుగుల కలబోత. కవిత్వం ఎప్పుడూ ఒక నిర్వచనంలో ఒదిగి ఉండదు. కాలానికి కట్టుబడదు. బతుక్కు సరికొత్త స్వప్నాలు అద్దుతుంది. ఒడవని దుఃఖానికి ఒక ఊరట కల. కళ్ళలో సుడి తిరిగే కన్నీళ్లు తుడిచి కలను బహుకరించేది కవిత్వమే. కవి స్వాప్నికుడు. కలలు చిలకరిస్తాడు. మనిషికి ప్రాణం పోస్తాడు.
'అతను సాగరమన్నాడు
నేనొక పడవను నిర్మించాను
అలల మీద ఒలలాడుతున్నది '
(బెల్లంకొండ సంపత్ కుమార్ - నేను )
'కవి వారం 'వివిధ కవితల సమాహారం. తలపోతలున్నాయి. వలపోతలున్నాయి. భావనలెన్నో వర్ణనలు అన్ని. తంగేడు, బతుకమ్మ, చిప్ప, స్మార్ట్ ఫోన్, టెర్మినేటెడ్ సీడ్స్ ఉన్నాయి. అన్నదాత, ఆడపిల్ల రైతు, స్త్రీల దుఃఖముంది. అమ్మ, నాన్న, ఉపాధ్యాయుల పట్ల అభిమానం వుంది. ఎన్నికలు, వివక్షతలు, అఘాయిత్యాలు ఉన్నాయి. వాటిని మరిపించే జ్ఞాపకాలున్నాయి. కరోనా, యుద్ధాల విషాదాలు, శ్రీలంక స్వేచ్ఛా సమరం దాకా విస్తరించి ఉన్నాయి.
'కవి వారం 'లో సీనియర్ కవులున్నారు. వారి వెంట వర్తమాన తరం ఉంది. వారిని అనుసరించే సరికొత్త తరమూ తోడుంది. ఒకచోట ఉండటం ఒక సంతృప్తి. కవులు కలగలసి ఉండటం కవితలు పరిమళిస్తుండటం సంకలనానికి జీవశక్తి. వారం తప్పకుండా కవి వారం నిర్వహిస్తున్నందుకు తెరసం జంట నగరాల కవులకు అభినందనలు.
కవి వారాన్ని కవితాహారంగా కూర్చిన సంపాదకులు కందుకూరి శ్రీరాములు, బెల్లంకొండ సంపత్ కుమార్ లకు అక్షరాభినందనలు. ప్రతి వారం కవివారాన్ని మెరిపిస్తూ సంకలనానికి తలపులద్దిన కవి మిత్రులకు శుభాభినందనలు. కవి వారం వెలుగొందాలి. కవులు వెలగాలి. కవిత్వం వెలగాలి.
డా. నందిని సిధారెడ్డి