Asianet News TeluguAsianet News Telugu

మట్టి మనసులో వెలుగు నక్షత్రాలు వేణు కథలు

వేణు నక్షత్రం రాసిన మనస్సాక్షి సంపుటిలోని కథలను రాజేశ్వరి దివాకర్ల సమీక్షించారు. వేణు నక్షత్రం కథల్లోని వైశిష్ట్యాన్ని, వాటిలోని సామాజిక అంశాలను ఆమె విశ్లేషించారు.

Rajeswari Divakarla reviews Venu Nakshatram short stories
Author
Hyderabad, First Published Dec 5, 2019, 10:55 AM IST

వేణు గారు ఆత్మీయంగా ఇచ్చారు ,మౌన సాక్షిని. అందులో ని పదకొండు కథలు కేవలం ఇతి వృత్తాలు కావు .మట్టి మనసులో తళుక్కుమనే నక్షత్రాలు . ఆ వెలుగును అందుకోవాలని ఆరాటం మొదలవుతుంది . ఆలోచన కలుగుతుంది. మాన వీయ విలువల వెలుగును ఆకాశపు టంచులకు వేణు విస్తరించారనిపిస్తుంది .నక్షత్రాలను మనసు నేలపై విత్తులుగా నాటి చిగుళ్లను మొలిపించారనిపిస్తుంది.

మొదటి కథ "నాతి చరామి ".కథలో పావని భర్త తోడి దాంపత్య జీవితపు మధురమైన ఊహలతో అమెరికాలో అడుగు పెడుతుంది . కాపురం హాయిగా సాగుతోంది . అంతలో అవాంతరం వచ్చింది .ఆమె ఇక సంతానవతి కాలేదని తెలిసింది .కుటుంబంలోని పెద్దలు పరోక్షంగా నిరాదరించారు . భర్త కూడా నిర్లక్ష్యం వహించాడు . అతని తిరస్కారాన్ని ఆమె సహించలేక పోయింది . స్త్రీ పరమైన సంవేదన మొదలయింది . ఆమె స్వయం సిద్ధగా తీర్మానం కావించుకుంది.పావనికి కలిగిన ఆవేదన అభ్యుదయానికి దారి చూపుతుంది విదేశం లో నివాసానికి మొదట్లో బెరుకుగా బయలుదేరిన ఆమె సాహసంతో తన జీవితంలో ముందడుగు వేస్తుంది .,స్త్రీ చైతన్యానికి రచయిత దృక్పథం బలమైన విశ్వాసాన్ని అందిస్తుంది .

Also Read: సమాజానికి వెలుగు రేఖలు ఈ *సిరి రేఖలు*

రెండవ కథ రైల్వే సత్యం. -పది మందికి సహాయ పడే తత్వం సత్యానిది .ఉద్యోగ నిర్వహణలో అతడు నేర్పరి. అలాగే మొండితనం అతనిది . కన్నపిల్లల భవితవ్యం కోసం అహరహం పరితపించే పిచ్చి తండ్రి. తోటి ఉద్యోగికి న్యాయం చేకూర్చాలని వెనుకకు తగ్గక పోరాడుతాడు.  ఆ పోరాటంలో నెలసరిజీతానికి వేటు పడుతుంది. పిల్లల చదువులకు అంతరాయం కలుగుతుందని అలజడికి లోనవుతాడు .అటువంటి తీవ్రమైన ఆందోళనలో రైలు నడుపుతూ జరిగిన ప్రమాదంలో ,కన్నపిల్లల భవిష్యత్తు కోసం తనని తాను ఆహుతి చేసుకుంటాడు . తనతో పాటు ఉన్న స్నేహితుని తొలగతోసి రక్షిస్తాడు . సత్యం కథ పిల్లలపై తండ్రికి గల ప్రేమ తో బాటు ,రచయిత తండ్రి (బాపు)ఆయనకు వారసత్వంగా అందించి వెళ్లిన "పది మందికి సహాయ పడడంలోనే సంతృప్తిని పొందాలన్న "సందేశాన్ని వినిపిస్తుంది .

మూడవ కథ "పిలుపు ". -ఈనాడు యువత జీవితాన్ని ప్రతిబింబిస్తుంది .నిజమైన అనురాగాన్ని ,బాంధవ్యాలను వదిలి ,హోదా కోసం ప్రిస్టేజ్ కోసంతహ తహలాడే  అనవసరమైన ఆడంబరాలకు "దేర్ షుడ్ బి సం లిమిట్ " అని చెబుతుంది. ఒక తాత్వికమైన సందేశాన్ని ఆహ్లాదకరమైన కథగామలిచి చెప్పిన తీరు పలువురి ప్రశంసలను అందుకుంది . ఇది లఘు చిత్రం గా రూపొందిఅనేక అభినందనలను  పొందింది.

నాల్గవ కథ "మౌన సాక్షి ."-ఈ కథలో రచయిత తీవ్రమైన అంతర్మథనాన్ని పొందుతాడు. ఈవ్యవస్థలోని కాఠిన్యాన్ని చూస్తూ అపరాధిలా మౌన సాక్షి గా మిగిలిపోతాడు .చక్కగా కాన్వెంటులో చదువుకోవలసిన పసిమొగ్గల బాల్యం జీవిక కోసం బలి అవుతున్న దృశ్యాన్ని ఆలోచనా తరంగాలతో కదలించుతాడు.

Also Read: ఏడవ రుతువు-వైష్ణవిశ్రీ కవిత్వం

అయిదవ కథ "వేక్ అప్ " . -ఇది పెద్ద కథ . ,పిల్లల విషయంలో తలిదండ్రులు మేలుకోవలసిన అగత్యాన్ని మానసిక అంతరాలతో చిత్రించిన కథ. చదువు పేరుతో పిల్లలను పోటీ ప్రపంచం లో నలిపివేస్తున్న తలిదండ్రుల  కథ . పిల్లలు,ఎవరి పిల్లలైనా విశాల ప్రపంచపు విహంగ వీధులలో రెక్కలు విప్పుకుని చల్లగా సంచరించగలగాలని చెప్పే కథ .

ఆరవ కథ "మృగాల మధ్య "-కడుపుకు అన్నం పెట్టని కులమెందుకు ,మతమెందుకు? అన్న జీవన వేదాంతాన్ని బోధించిన అతి సామాన్యురాలు కాంతమ్మ . కష్టాన్ని నమ్ముకుని మంచితనమే మానవ ధర్మంగా జీవించే కాంతమ్మ కులమతాల విద్వేషాలకు  బలి కాబోతున్న తరుణం ,మారని మత ఛాందసాలను ,ప్రశ్నిస్తుంది. ఆమె మంచితనమే ఆమెకు రక్షగా మిగులుతుంది.

Also Read: కన్నీరొలికించిన అభ్యుదయ కవి కలం

ఏడవకథ "సూపర్ హీరో" ,-తనకున్న కళాభి రుచినీ ,కలలనూ పక్కకు నెట్టి జీవన భృతి పోరాటంలో అమెరికా వచ్చి,సాంకేతిక రంగంలో పాతుకుని పోయిన వ్యక్తి కథ . అతడెంతగా ప్రయత్నించినా ,నటనా రంగంలో ఉన్న అభిరుచి ,సంఘర్షణలకు లోనుకావిస్తుంది .అసంతృప్తి వెంటాడుతుంది . చిట్టచివరకు నేపథ్యంలోని కథనం వల్ల అగ్రశ్రేణి నటునితో సూపర్ హీరో అనిపించుకుంటాడు.  తనకున్న అభిలాషను సార్థకం కావించు కుంటాడు .

ఎనిమిదవ కథ "పర్యవసానం"- తన పక్కన కూర్చున్న మనిషి ,పరిస్థితిని గుర్తించకుండా ,అతని గురించి చెడుగా ఆలోచిస్తుంది అరుణ .విషయం తెలిసాక జరిగిన పర్యవసానం ,కాలం మించిపోయిన పరిణామాలకు దారి తీస్తుంది .

తొమ్మిదవ కథ "వెలితి" -కోరుకున్నట్లుగా జీవించడంలో ఉన్న తృప్తి ని వెల్లడిస్తుంది. మనసును మభ్య పరచుకున్న సుఖ జీవనసాధనలో గల వెలితిని చిత్రీకరిస్తుంది .

పదవ కథ "అశ్రుఒక్కటి" -విప్లవం కోసం సర్వస్వాన్నీ ఒదులుకున్న పోరాట వీరునికి ఆ ఉద్యమం పేరుతో, విలాసవంతమైన జీవితం గడుపుతున్న దళారీల ను చూసి కలిగిన మనో వ్యథను తెలుపుతుంది .

పదకొండవ కథ "కౌముది "-నిజమైనప్రేమను నిరూపిస్తుంది .మనసిచ్చిన వానికి ,ఓదార్పుతో ,ప్రేమతో చేరువైన యువతి కథ. పై కథల కంటే భిన్నం గా సంఘర్షణలకు అతీతమైన సందేశాన్ని చెబుతుంది

పై కథలలో నాతి చరామి ,పిలుపు, వేక్ అప్ ,సూపర్ హీరో ,వెలితి రచయిత అమెరికా జీవనం లోనిసామాజిక పార్శ్వాలను లోతుగా పరిశీలించారు.జీవితంలో సుఖ సాధనకన్న తాము కోల్పోయిన ఆదర్శాలను గురించి పరివేదన ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రచయిత అమెరికాలో ఉంటున్నారు కాబట్టి ప్రవాసంలోని దార్శనికత ,అనుభవాలను వారు గాఢంగా చిత్రించారు . కాల పరిణమంలోఇప్పుడు ప్రాక్పశ్చిమ జీవన విధానాలిలాగే సాగుతున్నాయని అనిపించక తప్పదు.

Also Read: కవి యాకూబ్ తీగల చింత: లుప్త విలువల చింతన

మృగాలమధ్య ,పర్యవసానం ,అశ్రువొక్కటి కథలు రచయితకు ఉద్యమాల పట్ల అవగాహన ,ఆయా సందర్భాలతో మమేకమైన హృదయ సంక్షోభాన్నీ తెలుపుతాయి ,సత్యం ,మౌన సాక్షి ,కౌముది కథలలో  సామాజిక మానవతా విలువలకు రచయిత తన వంతు బాధ్యతను కలం సాక్షిగా నిర్వహించారని చెప్పాలి

వేణు నక్షత్రం నిర్మించిన లఘు చిత్రాలు పిలుపు ,ఎంతెంత దూరం, అవతలి వైపు ,వారు సాధించదలచిన గమ్యానికి చేరువగా ఆనందాన్ని కలిగిస్తాయి

వేణు నక్షత్రం గారి మౌన సాక్షి ని చాదివాక మౌనం గా ఉండడం సాధ్యం కాదు. స్పందన తెలుపడం ప్రత్యక్ష సాక్షులుగా రచయిత ప్రతిభను ఋజువు చేయడమే .

పుస్తకాలు దొరుకు చోటు :  విశాలాంధ్ర బుక్ హౌస్, నవ చేతన  బుక్ హౌస్  హైదరాబాద్

Rajeswari Divakarla reviews Venu Nakshatram short stories
       
- రాజేశ్వరి దివాకర్ల

Follow Us:
Download App:
  • android
  • ios