ఏడవ రుతువు-వైష్ణవిశ్రీ కవిత్వం
వైష్ణవిశ్రీ కవిత్వంలో ఏముంది? అసలు కవిత్వముందా? తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే ఇంకా లోతుల్లోకి వెళ్లి విడమరిచి చెప్పుకోవాలి.
మనిషితనం నీతికి లొంగని
ప్రజాస్వామ్య రాజ్యంలో
మతమౌఢ్యమొక మూర్ఖత్వం
గరీబులకు కూడుపెట్టలేని
గోపూజలు వర్ధిల్లే లౌకికవాద రాజ్యంలో
పేదరికం వివాదమే ఎప్పుడూ
(అక్షర ఘోష ,పేజీ నం:151)
ఇక్కన్నుంచి మొదలుపెడుదం.. వైష్ణవిశ్రీ కవిత్వాన్ని ఆవాహన చేసుకుందం.గౌరీ లంకేష్ దారుణ హత్య నేపథ్యం నుంచి ఇంకా గోవింద్ పన్సారే,కల్బుర్గీ లాంటి మేధావులను కోల్పోయిన స్థితి నుంచి అక్షరానికి మరణం లేదని,ప్రశ్నించే కలాలపై జరుగుతున్న దాడుల్ని కండ్లార చూస్తూ ,విలపిస్తూ "అక్షర ఘోష" ను కండ్లముందుకు తెస్తుంది.కవి ఏ వైపు నిలబడాలో స్పష్టత కనిపిస్తుంది.ఈరోజున జి.ఎన్ సాయిబాబా,వరవరరావుమరియు ఇతర మేధావులంతా ప్రశ్నించినందుకే ఊచలు లెక్కపెడుతున్నరు.జి.ఎన్ సాయిబాబా లాంటి వాళ్లు జైలు గోడల మధ్య కవిత్వమై వినిపిస్తున్నరు. ఇంకా ఈ అక్షర ఘోషలో ఆడబిడ్డకు విలువివ్వని సమాజాన్ని , అవినీతిపరుల్ని,మతోన్మాదుల్ని ప్రశ్నిస్తుంది.అక్షరాన్ని ఎరుపెక్కించి అరుణారుణకిరణమై నలుదిక్కులా ప్రకాశించేట్లు చేస్తుంది.గోపూజలు వర్ధిల్లే లౌకికవాద రాజ్యపు ద్వంద్వ నీతిని ఎండగడుతుంది.
కవి స్వగతంలో చెప్పుకున్నట్లు చిన్నతనంలో చల్లని వెన్నెల్లో తాతయ్య చెప్పిన కథలు చెయ్యిపట్టి నడిపించిన దృశ్యాలు సాహిత్యమై ప్రతిబింబిస్తున్నాయి.దేశం అభివృద్ధిపథంలో నడుస్తుందంటూనే కులమతాల మాయారంగులతో నింపేస్తున్న స్వార్థపరుల్ని చూసి,మతం కోసం మనిషిని మనిషే నిత్యం చంపుకునే స్థితిని చూసి,అమానవీయ చర్యల్ని చూడలేక,మనసు కన్నీటితో తడిసి, న్యాయం పక్కన నిలబడాలన్న ఆరాటంతో అక్షరాల్ని ఆయుధాలుగా చేతబూని కవిత్వమై "ఏడవ రుతువు"గా మన ముందు నిలబడింది.
వైష్ణవిశ్రీ కవిత్వంలో ఏముంది? అసలు కవిత్వముందా? తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే ఇంకా లోతుల్లోకి వెళ్లి విడమరిచి చెప్పుకోవాలి.
Also Read: కన్నీరొలికించిన అభ్యుదయ కవి కలం
"నాకై నేను,ఎనిమిదో రంగు" కవితల్ని పరిశీలిస్తే ఒకే నిర్మాణశైలిని అవలంభించినట్లు తెలుస్తుంది.ఎనిమిదో రంగు కవితలో ఒంటిని పచ్చిపుండు చేసే జ్ఞాపకాల్ని,అసూయా ద్వేశాల్ని మోసుకుతిరిగే బంధాల్ని,గుండెను కుంపటి చేసే ప్రేమల్ని,కులమతాలతో మది కుళ్లబెట్టుకుంటున్న స్నేహాల్ని,ధనదాహమనే ఎనిమిదో రంగు పులుముకున్న ఇంద్రధనుస్సు లాంటి జీవితాన్ని ఆవిష్కరిస్తుంది.ఇలాంటి జీవితంలో ఎలా బతుకుతున్నమో తెలుపుతుంది.
"జ్ఞాపకం,బంధాలు,ప్రేమ,స్నేహం
కలిసిన జీవితాలిప్పుడు
గుండెలోతుల్లో వెతుక్కున్నా దొరకని
ఆకాశం అంచున వేళ్లాడే మాయామబ్బులు
వాటి మధ్య సన్నని చినుకు ధారై
మనం కురవాలంతే.."
(పేజీ నం:149)
" నాకై నేను" కవితలో దారి పొడుగూతా గాయాలే గేయాలవుతాయని,ప్రతిరోజూ చుట్టుముట్టే కొసదేలిన మాటలే గెలుపును ఖాయం చేస్తాయని,పంటికింద బిగవట్టే బాధలే ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుతాయని, కోపాన్ని దిగమింగడమే సహనాన్ని పెంచుతుందని,పారిపోయే ప్రయత్నం చేయకపోవడమే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని,కన్నీళ్లకు అలుసవ్వకుంటే నిత్యం జ్యాలలా రగులుతుంటామని అన్నిట్లోనూ ప్రతిధ్వనిస్తుంటుంది.
Also Read: కవి యాకూబ్ తీగల చింత: లుప్త విలువల చింతన
"అనంత సాగరాలను దాటుకుంటూ
సాగే ఈ పయనంలో
గేయాన్ని నేనే
గెలుపును నేనే
ధైర్యాన్ని నేనే
సహనాన్ని నేనే
ఆత్మవిశ్వాసాన్ని నేనే
జ్వాలను నేనే
నాలో నేను
నాకై నేను
(పేజీ నం :147)
అంబేడ్కర్ గురించి మాట్లాడుతూ ..అస్పృశ్యత శృంఖలాలను తెగనరికి,వీపుకు మైల పరకల్ని కట్టుకునే ఛీత్కారాన్ని ఛీ కొట్టిన సంఘసంస్కర్తగా,మానవత్వాన్ని ఫరిడవిల్లింపజేసిన నిమ్నవర్గాల ఆశాజ్యోతియని,తరతరాల బానిసత్వపు సంకెళ్లను ఛేదించాడని,ప్యూడలిస్టుల పెత్తనంపై ధిక్కార స్వరాన్ని వినిపించాడని కదులుతున్న ఉద్యమంగా కీర్తిస్తూ పరవశించిపోతుంది.
"నలుగురి గొంతులకు అతడో నినాదం
అణగారిన కులాలకు అతడో ఉద్యమం
దళిత వర్గాలకు అతడో ఊపిరి
మరో బుద్ధుడై
ప్రపంచ చరిత్రలో అజరామరమైనాడు"
(పేజీ నం:145)
అగ్రవర్ణాల గుండెల్లో దడపుట్టించి చరిత్ర పుటల్లో సజీవంగా నిలబడ్డ రాజ్యాంగ నిర్మాతను మరో బుద్ధుడిగా కీర్తించడం గమనించవచ్చు.
Also Read: తలెత్తిన బ్రతుకు మధురఫలం - సీతాఫలం
రైతు పాదయాత్రపై ఎర్ర సముద్రం,లాల్ సలామ్ అనే రెండు కవితలున్నాయి.
"ఆశయం ఎర్రబడినప్పుడు
వేసిన ప్రతి అడుగూ పులబాటవుతుంది
ముళ్లన్నీ పువ్వులై పలకరిస్తాయి"
(ఎర్ర సముద్రం, పేజీ నం:136)
"ఆశయాన్ని నాటిన వాడికి
నెత్తురు పోరాటాలొక లెక్కా..
సముద్రమంత పొలికేకను
సమాజంపై విసిరిన నీవు,విత్తునే కాదు-
విప్లవాన్నీ మొలకెత్తించగలవు"
(లాల్ సలామ్ ,పేజీ నం:140)
ఒకే ఇతివృత్తంతో రాసిన రెండు కవితల్లో రైతీ చేసిన సాహసయాత్రను,అందుకు తలొగ్గిన ముంబాయిని పరిచయం చేస్తూ రైతు తల్సుకుంటే ఏమేం చేయగలడో అతనికి నూరిపోస్తున్నట్టు ,విత్తునే కాదూ..విప్లవాన్నీ మొలకెత్తించగలవనే స్ఫూర్తిని నింపడం ఆకట్టుకుంటుంది.
"ఆకలి ఉట్టి, వెన్నెల బువ్వ" కవితల్ని పరిశీలిస్తే అమ్మ పడే కష్టం,పిల్లలపై చూపించే ప్రేమ దానితో పాటుగా పిల్లల నవ్వుల ముందు అమ్మపడే కష్టం మరిచే తీరు కనబడుతుంది.
"ఉగ్గు గిన్నెలో చందమామను చూస్తూ
అమ్మ పెట్టే వెన్నెల బువ్వను
నక్షత్రాలు చేసుకుంటాడు పసివాడు
ఆకాశమంత కళ్లను మోస్తూ"
(వెన్నెల బువ్వ,పేజీ నం:103)
"ఖాళీ అయిన అన్నం కుండ
మరునాటికి అమ్మ గుండెపై
ఆకలి ఉట్టై వేళ్లాడుతుంది"
(ఆకలి ఉట్టి,పేజీ నం :113)
పిల్లల ఆకలిని మోస్తూ పళ్లెంలోని మెతుకులు అమ్మ చేతివేళ్లతో ఆడుకుంటాయనడం , ముద్దముద్దకీ చేలల్లో కలుపు మొక్కలు చేసిన గాయాల్ని అమ్మ బిడ్డల నవ్వుల్లో దాచుకుంటుందనడం ఉదాత్తంగా,గుండెకు హత్తుకునేలా చిత్రించబడింది.
ఎవరికైనా సొంతూరి మీదుండే మమకారం అంతా ఇంతాకాదు.కదిలిస్తే..పలకరిస్తే..మాటల్లో చెప్పలేనంత ఉద్వేగానికి లోనవుతారు.చిన్నప్పుడు ఆడిన ఆటలు,పొలాల వెంట ,చేను చెలుకల వెంట తిరిగిన రోజులు,అవ్వలు చేసే పిండివంటలు ,సద్దిబీవ్వలు,సల్ల ముంతలు వరసైనోళ్లు పరాచికాలాడుకునే చెరువుగట్లు ఇంకా ఎన్నో జీవితాన్ని ఆస్వాదించిన క్షణాలు,పల్లెతో వున్న అనుబంధం గుర్తుచేసుకుంటూ,ఇప్పుడేమి కోల్పోయామో..తల్సుకుంటెనే గుండె తరుక్కపోతది.ఊరి జాడను వెతుక్కుంటూ ప్రశ్నించుకుంటూ వెళ్లిన బాటసారి ఏమనుకుంటుందో "మా ఊరు" కవితలో చూడొచ్చు.
"జ్ఞాపకాలు ఊడల్లా పాతీకుపోయిన
ఊరిచివరి మర్రిచెట్టు నేను తప్ప
ఇప్పుడు నా ఊరు బుర్రకత హరికతంటే అర్థమెరుగని మట్టిబుర్రయింది
పల్లె అనే పదానికే అర్థమెరుగని వెర్రిబాగుల అనాథ అయింది"
(పేజీ నం :98)
జీవితానికి కవయిత్రి ఇచ్చిన నిర్వచనం చూడండి..
"జీవితమంటే రంగు కాగితంతో
రగిలించుకుంటున్న అహాల బూడిద కాదు
మానవత్వపు కాగడాతో
మరో మనిషినైనా వెలిగించాల్సింది..!"
(మానవత్వపు కాగడా,పేజీ నం :87)
గోడల మీద నినాదాలుగా రాయాల్సిన వాక్యాలుగా అనిపిస్తాయి.
"నగరపు శివారున ఏపుగా పెరిగే చిమ్నీల
వికటాట్ట హాసాలలో
చేసుకున్న విశాఖ కళ్లు ఆకుమళ్లు
మబ్బుల్లేని ఆకాశాలలో
నగరం నడిబొడ్డున వెలిసే ఖార్ఖానాల పొగల్లో
విశాఖ ఎండమావుల్ని వెతుక్కొంటోంది"
(వాడిన విశాఖ,పేజీ నం :21)
సముద్రపు ఒడ్డున అలలతో చేతులు కలిపి కెరటాలతో సయ్యాటలాడే వయ్యారి విశాఖ ఎలా కాలుష్యపు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతుందో కన్నులకు కట్టినట్టు చెబుతుంది.
"వాడికి తెలియదు" కవితను ప్రస్తావించకుండా ఉండలేం.ఒక తరానికి తరమే ఎలా కష్టం విలువ తెలియకుండా,కన్నవారి ప్రేమల్ని అర్థం చేసుకోకుండా ఎలా ఎదుగుతుందో ఆవేదనతో చెప్పటం వినబడుతుంది.ఇప్పటితరానికి ఏమి చెప్తూ పెంచాలో,ఎలాంటి విలువల్ని నేర్పించాలో పరోక్షంగా తన కవిత్వ నైపుణ్యాన్ని,అత్యంత ప్రతిభావంతమైన శిల్ప విన్యాసిన్ని ప్రదర్శిస్తూ సున్నితంగా హెచ్చరించిన తీరు మెచ్చుకోదగింది.
"వాడికి తెలియదు
అమ్మ ప్రతిరోజూ తను తినే అన్నంలో
గుప్పెడు బియ్యం పక్కకు పెడితే
పండుగపుట పాయసమయ్యిందని"
(పేజీ నం :34)
ఈ కవి కవిత్వంలో అంతర్గతంగా ఒక ఊగిసలాట వుంది.ఎంత అలవోకగా కవిత్వం రాయగలదో అంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం గమనిస్తాం.సరికొత్త నిర్మాణ పద్ధతుల్లో ఎంతగా రాయడానికి ప్రయత్నిస్తూందో అంతగా వాక్యమై తేలిపోతుంది.గుర్తుంచుకుని మసలుకోవాల్సిన విషయమేంటంటే కొన్ని కవితల్ని వాక్యాలుగా పేర్చుకుంటూ పోతే అందమైన వచనంలా కనిపిస్తూ కవిత్వం పాళ్లు తక్కువైనట్టు అనిపిస్తుంది.తేలికైన పదాలతో అద్భుతమైన కవిత్వం చేయగల నేర్పరితనమూ కనిపిస్తుంది.
మొత్తానికి "ఏడవ రుతువు" ఉగాది పచ్చడిలా ఊరిస్తుంది.ఆస్వాదించాల్సిందే! వైష్ణవిశ్రీ గారికి శుభాకాంక్షలు.
- బండారి రాజ్ కుమార్