దీపావళి పండగను అసలు ఎందుకు జరుపుకోవాలో తెలుసా?
శరీరానికి నూనె, నలుగుపిండి పెట్టి స్నానం చేయడం వల్ల శరీరంలో రోమ రంధ్రాలు తెరుచుకుని వాటి నుండి కూడా వ్యర్థపదార్థాలు అనగా చెమట లాంటివి బయటకు వెళుతుందని ఇలా చేయమని పెద్దలు చెబుతుండేవారు.

చాలా సంవత్సరాలుగా మనం దీపావళి పండగను జరుపుకుంటూ వస్తున్నాం. అయితే, ఈ దీపావళి పండగను మనం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. కేవలం ఇంటి నిండా దీపాలు వెలిగించడం, ఆ తర్వాత సాయంత్రం టపాసులు కాల్చడం మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. కానీ, ఈ దీపావళి పండగను అసలు ఎందుకు జరుపుకోవాలి? ఎలా జరుపుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుజరాతీలు ఈ చతుర్దశిని కాలచౌథ్ అంటారు. సంస్కృతంలో కాళచతుర్దశి అనగా అంధకారపు చతుర్దశి అని అర్థం. అనగా అంధకారం నుంచి వెలుగులోకి రావడానికి కనీసం ఈ రోజునుంచైనా ప్రయత్నం చేయాలని ఈ పండుగ ఉద్దేశం. సాధారణంగా హిందూ సంప్రదాయంలో ప్రతీమాసంలో వచ్చే బహుళ చతుర్దశి మాస శివరాత్రి, బహుళ అమావాస్య రోజున అభ్యంగనస్నానం చేయకూడదనే నిషేధం ఉంది. కాని ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున మాత్రం ఇది వర్తించదట. పైగా ఈ రెండు రోజులు కూడా అభ్యంగన స్నానం తప్పనిసరి చేయాలని అనేక గ్రంథాలు చెపుతున్నాయి.
నరకము అంటే అంధకారము, కష్టము అని అర్థం. దుర్గతినుండి కష్టముల నుండి జనులను తరింపజేసే చతుర్దశిగా ఈ చతుర్దశిని చెపుతారు. ప్రాగ్జ్యోతిష పురాన్ని పరిపాలించేవాడు నరకాసురుడు. రాక్షసులకు రాజు. అతడు భూమి పుత్రుడు. ఇతను దేవతలను బాగా పీడించేవాడు. ఇంద్రుని సింహాసనాన్ని లాక్కున్నాడు. స్త్రీలను చెరపట్టడం లాటి అసభ్యకరమైన పనులు చేసేవాడు. ఆ బాధలనుంచి తమని కాపాడమని దేవతలు శ్రీకృష్ణుని వేడుకొనగా శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై యుద్ధానికి వెడతాడు. శ్రీకృష్ణడు ఆ యుద్ధంలో మూర్చనొందితే సత్యభామ యుద్ధం చేసి విజయం సాధించింది. నరకుని పీడ వదిలినందుకు దేవతలు, మానవులు అంతా సంతోషించి దీపాలు వెలిగించారు. ఆరోజునుంచి ఈ పండుగ అమలులోకి వచ్చింది. నరకాసురుడు తెల్లవారుజామున చంపబడడం చేత ఆ పీడ వదిలినందుకు ఆ సమయంలో తలంటుకోవడం, అభ్యంగన స్నానాదులు చేయడం అలవాటుగా మారింది.
అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనెతో మర్దన చేయటం, తరువాత నలుగు పిండిని ప్టించి తలార స్నానం చేస్తారు. ఇప్పినుంచి శీతకాలం ప్రారంభమవుతుంది. శీతకాలంలో ఒంటిలో నరాలు, కండరాలు అన్నీ బిగుసుకుపోయి ఉంటాయి. శరీరానికి నూనె, నలుగుపిండి పెట్టి స్నానం చేయడం వల్ల శరీరంలో రోమ రంధ్రాలు తెరుచుకుని వాటి నుండి కూడా వ్యర్థపదార్థాలు అనగా చెమట లాంటివి బయటకు వెళుతుందని ఇలా చేయమని పెద్దలు చెబుతుండేవారు.
ఈ మాసంలో చెమట ఎక్కువగా రాదు. శరీరాన్ని శ్రమ పెట్టడానికి ఎక్కువగా ఇష్టం ఉండదు. బద్ధకంగా పడుకుని, ఎప్పుడూ ముడుచుకొని ఉంటారు. దానివల్ల తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కాకుండా ఉండి మలబద్ధకంతో అనేక రోగాలకు కారణం అవుతాయి. ఈ విధంగా కనీసం పర్వదినాల్లోనైనా అభ్యంగన స్నానాలు చేయడం వల్ల శరీరంలో ఉండే అన్ని నాడులు ఉత్తేజితమై వ్యక్తి చురుకుగా తయారవుతారు. కాబట్టి పూర్వకాలంలో అభ్యంగనస్నానాలు తప్పనిసరి పెట్టారు. ప్రస్తుతకాలంలో చేస్తే శాంపూలు, సబ్బుల వల్ల వాటి ఉపయోగం ఏమాత్రం ఉండదు. కనీసం పండుగ రోజుల్లోనైనా మన సంప్రదాయాన్ని గుర్తుంచుకొని అభ్యంగన స్నానాలు చేస్తే ఎవరి ఆరోగ్యాన్ని వారే కాపాడుకునేవారవుతారు.
ఈ దీపావళి సమయంలో కాల్చే టపాసులు నరకాసురుడిమీద ఉపయోగించిన మారణాయుధాలుకు చిహ్నాలుగా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు.