ఇంట్లో రస్కులు తినే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. రస్కులు ఒక్కోసారి గాలి బారి మెత్తగా అయిపోతాయి. అలాంటప్పుడు వాటిని పడేయకుండా హల్వా చేసేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
బ్రెడ్ హల్వా గురించి అందరికీ తెలిసిందే. అలాగే రస్క్ హల్వాను కూడా చేయవచ్చు. టీతోపాటు రస్కులు తినే వారి సంఖ్య ఎక్కువే. ఒక్కోసారి అవి మిగిలిపోవడం లేదా గాలి వల్ల మెత్తగా అయిపోవడం జరుగుతాయి. వాటిని పడేసే కన్నా బ్రెడ్ హల్వాలాగే రస్క్ హల్వాను ట్రై చేయండి. నిజానికి ఇది చాలా సులువు. త్వరగా వండేయచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు రస్క్ హల్వా చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ని కూడా దీనికి జోడి చేశారంటే చాలాసేపు ఆకలి కూడా వేయదు. ఇక ఈ రస్క్ హల్వా ఎలా చేయాలో తెలుసుకోండి.

రస్క్ హల్వా చేసేందుకు కావాల్సిన పదార్థాలు
మిగిలిపోయిన రస్కులు - పది
కుంకుమపువ్వు రేకులు - నాలుగు
ఏలకుల పొడి - చిటికెడు
కిస్మిస్లు - గుప్పెడు
జీడిపప్పులు - ఆరు
నెయ్యి - మూడు స్పూన్లు
నీరు - తగినంత
పంచదార - అరకప్పు
బాదం పప్పులు - గుప్పెడు

రస్క్ హల్వా రెసిపీ ఇదిగో
1. రస్కులను ఒక గిన్నెలో వేసి దంచండి, లేదా మిక్సీలో వేసి పొడి లాగా చేసుకోండి.
2. ఇప్పుడు స్టవ్ మీద హల్వా చేసేందుకు కళాయి పెట్టండి.
3. అందులో నెయ్యి వేసి జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. జీడిపప్పులు బాదం పప్పులను పూర్తిగా వేసే కన్నా నాలుగు ముక్కలుగా చేసి వేసుకుంటే మంచిది.
4. ఇక మిగిలిన నెయ్యిలో ముందుగా చేసి పెట్టుకున్న రస్కుల పొడిని వేసి వేయించండి. అది వేగాక తీసి పక్కన పెట్టుకోండి.
5. ఇప్పుడు అదే కళాయిలో నీరు, పంచదార కూడా వేసి బాగా మరిగించండి.
6. అది పంచదార బాగా కరిగి దగ్గరగా అయినప్పుడు యాలకుల పొడిని, కుంకుమ పువ్వును వేయండి.
7. ఆ తర్వాత రస్కుల పొడిని వేసి బాగా కలపండి.
8. వేయించుకున్న కిస్మిస్లు, జీడిపప్పులు, బాదం పప్పులను కూడా వేసి బాగా కలపండి.
9. ఇది హల్వా లాగా దగ్గరగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.
10. పైన ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఘుమఘుమలాడుతూ రస్క్ హల్వా రెడీ అయిపోతుంది.

రస్క్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిని చూస్తే మీరు దీని రుచి మర్చిపోలేరు. కేవలం పావుగంటలో రెడీ అయిపోతుంది. కాబట్టి ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టవచ్చు.
రస్క్ హల్వాను నైవేద్యాలుగా కూడా సమర్పించవచ్చు. తీపి నైవేద్యాలు పెడితే దేవతలు త్వరగా కరుణిస్తారని చెబుతారు. కాబట్టి పండుగల సమయంలో రస్కుల ప్యాకెట్ ను తెచ్చి హల్వా చేసి పెట్టండి. ఇది సింపుల్ గా అయిపోతుంది. పైగా టేస్టీగా ఉండే స్వీట్. ఇంట్లో వారికి కూడా ఇది బాగా నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఓసారి రస్క్ హల్వా ట్రై చేయండి.
