ఎండాకాలం వచ్చిందంటే... ముందుగా వేధించే సమస్య ట్యాన్. కాసేపు ఎండలో బయటకు వెళ్లి వస్తే చాలు ముఖం నల్లగా మారిపోతుంది. అలా అని అసలు బయటకు వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. మార్కెట్లో దొరికు సన్ స్క్రీన్ లోషన్స్ రాసినా కూడా ఒక గంట కన్నా ఎక్కువ ప్రభావం చూపించవు. దీంతో.. ట్యాన్ రావడం మాత్రం తప్పనిసరి అవుతోంది.

మరి దీనికి పరిష్కారమే లేదా అంటే.. కేవలం మన వంటింట్లో లభించే సింపుల్ చిట్కాలతో ట్యాన్ ని తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి చిట్కాలు ఏంటో మీరూ ఓ లుక్కేయండి

నిమ్మకాయను అడ్డంగా కోసం.. ముఖం, చేతులు ట్యాన్ కి నల్లబడిన ప్రాంతంలో రుద్దాలి. మరికాసేపటి తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా రెండు, మూడు రోజులకు ఒకసారి చేస్తే.. ట్యాన్ తొలగిపోతుంది.

నిమ్మరసం, దోస రసం, రోజ్ వాటర్ సమపాళ్లలో కలిపి ట్యాన్ కారణంగా నల్లబడిన ప్రాంతంలో అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి ఫలితం త్వరగా కనపడుతుంది.

రెండు స్పూన్ల సెనగపిండిలో కొద్దిగా పాలు, ఒక టీ స్పూన్ రోజ్ వాటర్, చిటికెడు పసుపు కలిపి ఈ పేస్టును ఎండను నల్లబడిన ప్రదేశంలో రాయాలి. పూర్తిగా ఎండిపోయేదాకా ఉంచి తర్వాత కడిగేయాలి. ట్యాన్ త్వరగా తొలగిపోతుంది.

పండిన బొప్పాయి గుజ్జులో తేనె కలిపి రాసుకున్నా కూడా ఫలితం బాగుంటుంది. పెసరపప్పు గుజ్జులో కలబంద గుజ్జు, టమాటా గుజ్జు కలిపి ముఖానికి రాసి.. అది ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ట్యాన్ ఎగిరిపోయి.. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.