నిజానికి మనకు అమ్మ అందిస్తున్న ప్రేమ మొత్తంలో ఉండేది నాన్నే. అమ్మ ఆకలి గురించి ఆలోచిస్తే.. నాన్న.. మన భవిష్యత్తు గురించి కలలు కంటాడు. 

అమ్మ గురించి అందరూ గొప్పగా చెబుతుంటారు. ఎందుకంటే.. అమ్మ ప్రేమ అందరికీ కనపడుతుంది. మనకు ఆకలి వేసేలోపు.. మన ముందు మనకు నచ్చిన ఆహారాన్ని అమ్మ ఉంచుతుంది. మనం ఏడిస్తే.. మనకు ఆ బాధ తగ్గేవరకు తను తోడు ఉంటుంది. మనం చేసే అల్లరిని భరిస్తుంది. ఏం చెప్పినా వింటుంది. బుజ్జగిస్తుంది. లాలిస్తుంది. అందుకే అమ్మ అంటే అమితమైన ప్రేమ. కానీ.. నాన్న గురించి ఎవరూ ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే.. చిన్నప్పటి నుంచి నాన్న అంటే ఒక భయం. ఏదైనా తప్పు చేస్తే నాన్న కొడతాడు.. మార్కులు సరిగా రాకపోతే తిడతాడు.. ఇవే గుర్తుకు వస్తాయి.

అంతెందుకు.. మనం ఎక్కడకైనా బయటకు వెళ్లి వచ్చినా... ముందు అమ్మ గురించి ఆరా తీస్తాం కానీ.. నాన్న గురించి కాదు. అమ్మ ప్రేమ ముందు మనకు నాన్న కనపడడు. కానీ.. నిజానికి మనకు అమ్మ అందిస్తున్న ప్రేమ మొత్తంలో ఉండేది నాన్నే. అమ్మ ఆకలి గురించి ఆలోచిస్తే.. నాన్న.. మన భవిష్యత్తు గురించి కలలు కంటాడు. 

తాను పడిన కష్టం తన బిడ్డలు పడకూడదు అనుకుంటాడు. తన పిల్లలు తన కళ్ల ముందే ఎదుగుతుంటే.. మౌనంగా ఆనందిస్తాడు. అమ్మలాగా.. అన్నీ బయటకు చెప్పలేడు. గారాభం చేస్తే.. పిల్లలు పాడౌపోతారేమో అనే భయంతోనే.. ప్రేమను దాచి మన ముందు గంభీరం నటిస్తాడు. అందుకే.. మనకు తొందరగా నాన్న కనపడడు. మన ముందు ప్రేమ కనపరచకపోయినా.. ఇతరుల దగ్గర మాత్రం పిల్లల మీద ప్రేమను గర్వంగా చెప్పుకోగలడు. అందుకే అలాంటి నాన్నని మనం గుర్తించాలి. మన భవిష్యత్తు కోసం తమ జీవితం మొత్తం త్యాగే చేసే తంద్రులందరికీ ఓ రోజు ఉంది.

ఈ జూన్ 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు. మరి ఈ ఫాదర్స్ డే ని మీ ఫాదర్ కి మధురమైనదిగా ఉండేలా ప్రయత్నించండి. దగ్గర ఉంటే.. నాన్న కోసం ఏదైనా చేసేవాళ్లం.. కానీ ఆయన దగ్గరలేం.. ఉద్యోగరిత్యా దూరంగా ఉన్నాం.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు. అయితే.. మనసు ఉంటే మార్గం ఉన్నట్లు కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే.. దూరంగా ఉన్నా కూడా.. మీరు మీ నాన్నతో ఈ ఫాదర్స్ డేని జరుపుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఫాదర్స్ కి ఇంకా నాలుగైదు రోజులు ఉంది కాబట్టి.. వెంటనే.. ఆయన అభిరుచికి తగినట్లు ఒక మంచి బహుమతిని కొనుగోలు చేయండి. దానిని ఇప్పుడే.. ఆ రోజుకి అందుకునేలా బుక్ చేయండి.

లేదంటే.. ఎలాగూ ఆ రోజు ఆదివారం కాబట్టి... ఆ రోజుకి మీ నాన్న దగ్గరకు వెళ్లేలా ప్లాన్ చేసుకొండి. వారికి సర్ ప్రైజ్ ఇచ్చి.. ఆ రోజంతా వారితో సరదాగా గడిపేయండి.

రావడానికి కుదరకపోతే.. కనీసం వారితో ఒక గంటైనా వీడియో కాల్ మాట్లాడి.. వారి యోగ క్షేమాలు తెలుసుకోవాలి.

లేదంటే.. మీరు అందుబాటులో ఉంటే.. రాత్రి పడుకొని ఉదయం లేచే వరకు మీ నాన్న బెడ్రూమ్ ని అందంగా అలంకరించండి.

లేదంటే.. వారి కోసం స్పెషల్ గా వండి పెట్టండి.వారి త్యాగాలు, గౌరవార్థం మీ ప్రేమను వ్యక్తపర చండి , హృదయాన్ని విప్పి మాట్లాడండి.