కామెర్లు అంటే జ‌న‌సామాన్యంలో ప‌చ్చ‌కామెర్లు అంటారు. మూత్రం ఎల్లోగా మార‌డం, క‌ళ్లు ప‌చ్చ‌బ‌డ‌డం, ఆ త‌ర్వాత చ‌ర్మం కూడా ప‌చ్చ‌గా మార‌డం... ఇవ‌న్నీ కామెర్ల ల‌క్ష‌ణాలు. నిజానికి కామెర్లు అనేది వ్యాధి కాదు, వ్యాధి ల‌క్ష‌ణం. జ్వ‌రం, వాంతులు వ‌చ్చిన‌ట్లే ఇది కూడా దేహంలో ఎదురైన అప‌స‌వ్య‌త‌ల కార‌ణంగా బ‌య‌ట‌ప‌డే ఒక ల‌క్ష‌ణం. దీనికి చికిత్స ఇద‌మిద్దంగా ఉండ‌దు. కార‌ణాన్ని క‌నుక్కుని దానికి చికిత్స చేయాలి.

ముందుగా కామెర్ల‌కు సంబంధించిన శ‌రీర‌ధ‌ర్మాన్ని తెలుసుకుందాం. కామెర్ల‌కు కార‌ణం బైలురుబిన్ అనే వ్య‌ర్థ ప‌దార్థం. ఇది ఎర్ర‌ర‌క్త‌క‌ణాల నుంచి విడుద‌ల‌వుతుంది. హెల్దీబాడీలో ర‌క్తంలో కొద్ధి స్థాయి వ‌ర‌కు ఈ బైలురుబిన్ ఉంటుంది. దీని స్థాయులు పెరిగిన కొద్దీ లివ‌ర్ దీనిని శ‌రీరం నుండి వ‌దిలేస్తుంది. ఇందుకోసం కాలేయం బిలిరుబిన్ ర‌సాయ‌న స్థితిని పిత్తాశ‌యంలో నిల్వ ఉంచుతుంది. చిన్న పేగుల‌లోకి విస‌ర్జించేట‌ట్లు ఏర్పాటు చేస్తుంది. కామెర్ల‌కు కార‌ణ‌భూత‌మైన బిలిరుబిన్ స్థాయి పెర‌గ‌డానికి ప్ర‌ధానంగా మూడు కార‌ణాలుంటాయి. 

- ఎర్ర ర‌క్త‌క‌ణాలు  బైలురుబిన్‌ను అధికంగా ఉత్ప‌త్తి చేయ‌డం
- కాలేయం బైలురుబిన్‌ని త్వ‌ర‌గా శ‌రీరం నుంచి బ‌య‌ట‌కు విస‌ర్జించ‌లేక‌పోవ‌డం
- విస‌ర్జిస్తున్న బైలురుబిన్ చిన్న పేగుల్లోకి విడుద‌ల‌య్యే ప్ర‌క్రియ‌లో ఆటంకాలు క‌ల‌గ‌డం

ఈ మూడింటిలో ఏ కార‌ణం చేత‌నైనా కామెర్లు రావ‌చ్చు. 

స‌ర్వ‌సాధార‌ణంగా కాలేయ రోగాలున్న‌ప్పుడు కాలేయం విడుద‌ల కొర‌కు ఏర్ప‌డిన వాహిక‌ల యందు ఆటంకం పిత్తాశ‌యం పైత్య ర‌స ద్వారాలు పాంక్రియాస్‌, డియోడిన‌మ్ (చిన్న పేగు ప్రారంభంలో ఉంటుంది)ల‌లో ఏ చిన్న ఆటంకం అయినా క‌లిగిన్పుడు బైలురుబిన్ శ‌రీర ర‌క్త‌నాళాల్లో పేరుకుపోతుంది.  బైలురుబిన స్థాయులు ర‌క్తంలో ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ‌గా పెరిగిపోయి కామెర్లుగా క‌నిపిస్తాయి.

లివ‌ర్ వ్యాధుల్లోనూ, లివ‌ర్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లే బైలురుబిన్ వాటిక‌ల్లో పిత్తాశ‌యంలో ఏ స‌మ‌స్య వ‌చ్చినా కామెర్లు క‌నిపిస్తాయి. ఇక సాధార‌ణంగా కామెర్లు రావ‌డానికి కార‌ణ‌మైన వ్యాధుల‌ను తెలుసుకుందాం.

1) 
- కాలేయ వ్యాధులు...
- హెప‌టైటిట్‌... ఈ ప‌రిస్థితి కాలేయం వ్యాధి గ్ర‌స్త‌మైంద‌ని అర్థం. ఇందులో ఎ,బి,సి,ఈ అని నాలుగు ర‌కాలుంటాయి. ఎ,ఈ హెప‌టైటిస్‌లు క‌లుషిత ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌స్తాయి. బి,సి హెప‌టైటిస్‌లు ర‌క్త‌మార్పిడి స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌, ఇంజ‌క్ష‌న్‌ల నీడిల్స్ ద్వారా సంభోగం వ‌ల్ల సంక్ర‌మించే వ్యాధులు. ఎ,బి హెప‌టైటిస్‌ల‌ను నివారించ‌డానికి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. కాబ‌ట్టి వీటి గురించి పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. నివార‌ణ చ‌ర్య‌లు చాలు.

-ఇత‌ర కాలేయ వ్యాదుల్లో ముఖ్యంగా చెప్పుకోవ‌ల‌సింది లివ‌ర్ సిర్రోసిస్‌, ఫ్యాటీ లివ‌ర్‌. దీర్ఘ‌కాలంగా మ‌ద్యం (ఆల్క‌హాలు)  సేవించ‌డం వ‌ల్ల  కాలేయం దెబ్బ‌తిన‌డ‌మే లివ‌ర్ సిరోసిస్‌. ఊబ‌కాయుల్లో ఫ్యాటీ లివ‌ర్ (కాలేయంలో కొవ్వు పేరుకుపోవ‌డం) ఈ వ్యాధులు ప‌చ్చకామెర్లు రావ‌డానికి కార‌ణం అవుతాయి. లివ‌ర్ క్యాన్స‌ర్ అంత్య‌ద‌శ‌లో కూడా కామెర్లు క‌నిపిస్తాయి.

2)
పిత్తాశ‌యంలో రాళ్లు చేర‌డం, పిత్తాశ‌య క్యాన్స‌ర్‌, పాంక్రియాస్‌, డియోడిన‌మ్‌ల‌లో కొన్ని ర‌కాల వ్యాధులు రావ‌డం వ‌ల్ల పైత్య ర‌స‌ప్ర‌వాహానికి (బైల్‌)  అడ్డు ఏర్ప‌డి కామెర్లు క‌నిపిస్తాయి. బైలురుబిన్ స్థాయులో పెర‌గ‌డానికి ... కాలేయం ప‌ని మంద‌గించే వ్యాధులు బైలురుబిన్ చిన్న పేగుల్లోకి విస‌ర్జ‌న‌కు ఆటంకం క‌ల‌గ‌డం వ‌ల్ల క‌లిగించే వ్యాధులుకార‌ణ‌మ‌ని తెలుసుకున్నాం.

3)
ఎర్ర ర‌క్త‌క‌ణాలు... బైలురుబిన్ ఉత్ప‌త్తికి కార‌ణ‌మైన ఎర్ర ర‌క్త‌క‌ణాలు విచ‌క్ష‌ణ‌ర‌హితంగా అధికంగా బైలురుబిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌డం కూడా మ‌రో కార‌ణం. ర‌క్త‌హీన‌త‌, మ‌లేరియా వ్యాధితో బాధ‌పడుతున్న వారిలో ఎర్ర ర‌క్త‌క‌ణాల సంఖ్య త‌గ్గుతుంది. దాంతో బైలురుబిన్ ఉత్ప‌త్తి ఎక్కువై కామెర్లు క‌నిపిస్తాయి. 

4)
ఇత‌ర‌ కార‌ణాలు... పైన చెప్పుకున్న కార‌ణాలే కాకుండా విచ‌క్ష‌ణ లేకుండా కొన్ని విష‌ప‌దార్థాలు లేదా కొన్ని మందుల‌ను వాడ‌డం వ‌ల‌న కాలేయం దెబ్బ‌తింటుంది. కాలేయం ప‌నితీరు మంద‌గిస్తుంది. ఫ‌లితంగా కామెర్లు వ‌స్తాయి. కామెర్ల‌కు కార‌ణ‌మైన ఆయా మందుల‌ను విష‌ప‌దార్థాల‌ను మానేయ‌డం వ‌ల‌న ఈ ర‌క‌మైన కామెర్లు త‌గ్గుతాయి.

కామెర్లు అనేది... వ్యాధి ల‌క్ష‌ణం అని తెలిసింది క‌దా! అంటే దీనికి చికిత్స‌కూడా ఏ వ్యాధి కార‌ణంగా  దేహంలో కామెర్లు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌నేది వైద్య ప‌రీక్ష‌ల ద్వారా నిర్ధారించుకుని ఆ త‌ర్వాత మందుల‌ను సూచించాలి.

అపోహ‌: కామెర్ల‌కు కొన్ని ర‌కాల ప‌స‌రు మందులు ప‌ని చేస్తాయ‌నే విశ్వాసం చాలామందిలో ఉంటుంది. హెప‌టైటిస్ ఎ, ఈ వ్యాధులు ... కొద్ది రోజులు ఇబ్బంది పెట్టి ఆ త‌ర్వాత వాటంత‌ల అవే త‌గ్గిపోతుంటాయి. ఇది వాటి స‌హ‌జ గుణం. వీటికి చికిత్స త‌ప్ప‌నిస‌రి కాదు. ఇలాంటి వ్యాధుల విష‌యంలో ప‌స‌రు మందులు ప‌ని చేశాయ‌నే అభిప్రాయం క‌లుగుతుంది. ఏర‌క‌మైన కామెర్ల వ్యాధి అయినా స‌రే ప‌స‌రు మందుతో స‌మూలంగా త‌గ్గిపోతుంద‌నుకుంటే పొర‌పాటే.

నివార‌ణ‌:
హెప‌టైటిస్ ఎ,బిల‌కు టీకా మందులున్నాయి. ఆహారం ద్వారా వ్యాప్తి చెందే హెప‌టైటిస్ ఎ,ఈ వ్యాధుల‌ను ఆరోగ్య సూత్రాల‌ను పాటించ‌డం ద్వారా నివారించ‌వ‌చ్చు. 
పిత్తాశ‌యంలో రాళ్లు, పిత్తాశ‌య ఇత‌ర‌ వ్యాధుల వ‌ల్ల వ‌చ్చే కామెర్ల‌ను... పిత్తాశ‌యం తొల‌గించ‌డం ద్వారా న‌యం చేయాలి.
కామెర్ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే... ర‌క్త‌పు వాంతుల‌తోపాటు, రోగి అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లే ప్ర‌మాదం కూడా ఉంటుంది. కాబ‌ట్టి వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి తేలిక‌పాటి ఆహారం తీసుకుంటూ, వైద్యులు సూచించిన మందులు వాడాలి.