గడప సౌభాగ్యం.. ఇంటికి శ్రీరామ రక్ష గడపే..
గడప లక్ష్మిదేవితో సమానమని అంటుంటారు మన పెద్దలు. గడపను కుంకుమ, పసుపు, బియ్యం పిండితో అలంకరించుకున్నప్పుడే మనం ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతామని పండితులు చెబుతున్నారు. గడపను అలంకరించడానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే..
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
గడపను ద్వారా లక్ష్మీ అని అంటారు. సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారుతో సమానం. అందుకని గడపను తొక్కవద్దు, గడపపై కూర్చో కూడదని పెద్దలు చెబుతుంటారు. రోజు పద్దతిగా గడపను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది సుఖ:, సంపదలతో వర్దిల్లుతుంది. శాస్త్రీయ ఆచార సాంప్రదాయాలు రోజు రోజుకు కనుమరుగవుతున్నాయి. చారెడు పసుపు గడపకి రాసే సంప్రదాయాలను మన పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. పట్టణాలలో అపార్ట్‌మెంటుల సంస్కృతి ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడ ఇతర గదులకి గడపలే సరిగ్గా కనబడవు. ఆఖరికు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు పైగా వాటికి గడపలు కూడా ఎందుకు దండగ అనే పరిస్థితి వచ్చేసింది. కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఉండాలని పెద్దలు అంటారు. గడపకు పసుపు. గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటి శోభే వేరు. ఆయురారోగ్యం సిద్ధించే గడప చేసే మేలును తెలుసుకుందాం.
ఏ గృహానికైనా గడపలు తప్పనిసరి. పల్లెటూళ్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వా రానికి గడపలే కాకుండా ఆ ఇంటిలోని ఏ గదికైనా గడపలు లేకుండా ఉండవు. గడపలేని గృహం కడుపు లేని దేహం లాంటిది. పెదాలు లేని నోరు లాగే అవుతుంది గడపలేని గృహాలు.
అలంకరణలో భాగంగా.. గడప చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ఇంట్లో ఆయా గదులకు గడపలు లేకున్నా సరేకానీ తప్పనిసరిగా గృహం సింహద్వారానికి గడప నిర్మించుకోవాలి. గడప ఉన్నప్పుడే ఆ గడపని శుద్ధిచేసుకుంటూ ఉంటాం. ఆ గడపను పసుపు, కుంకుమలతో బియ్యం పిండితో అలంకరించుకుంటూ ఉంటాం. మన సంస్కృతంలో ప్రధానమైన భాగం గడపకి అలంకరణం. పసుపులో యాంటీబయటిక్ గుణం ఉంది. అందుకని సాధారణంగా మనం ఆయా వీధుల గుండా అనేక పరిసరాలలో సంచరించి ఎన్నో లక్షల బ్యాక్టీరియాలను మన చెప్పు లకు, మన కాళ్లకు అంటించుకుని గృహంలోకి ప్రవేశిస్తుంటాము.
యాంటీ బ్యాక్టీరియా.. ఉదయాన్నే పసుపు నీళ్లతో శుద్ధిచేసినటువంటి ఆ గడపలోకి.. అంతకన్నా ముందు చక్కని ఆవుపేడతో కల్లాపి చల్లినటువంటి వాకిళ్లలోకి మనం అడుగుపెట్టినప్పటినుంచి మన కాళ్లను ఈ ఆవుపేడలో ఉండే యాంటి బయటిక్, గడపకు ఉండే పసుపు అలంకరణలు మనకు తెలియకుండానే మన కాళ్లను శుద్ధిచేస్తాయి. అనేక లక్షల సూక్ష్మజీవులను మన కాళ్లనుండి దూరం చేస్తాయి.
ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు.. ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం. రెండు ఇంటి ప్రధాన గుమ్మం "గడప"కు పూజ చేయడం. ఇంటి గడపను సింహ ద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకు పసుపు ,కుంకుమ,పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియక పోయినా పెద్దవారి నుండి సంప్రదాయంగా ఆచరిస్తున్నారు... గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని కోరుకోవడం.
ఇంటికి శ్రీరామరక్ష.. అందుకనే గడపకి పసుపు, కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. దీనిలోని ప్రాధాన్యత ఏమిటంటే.. రోగాలను దరిచేయనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావులేకుండా ఉంచుకోవడానికే ఇంటికి గడప ఉండాలంటారు మన పెద్దలు. అయితే తప్పనిసరిగా గృహం యొక్క అన్ని ద్వారాలకు గడపలు ఉండాల్సిన అవసరం ఉంది. ఐతే కొన్ని సాధ్యం కాని పరిస్థితిలో మిగతా గదులకు లేకున్నా.. సింహద్వారపు గుమ్మానికి తప్పనిసరిగా గడప ఉండ వలెను. అంతేగాదు ప్రతిరోజూ ఆ గడపను శుద్ధిచేసుకోవాలి. అప్పుడే ఆ ఇంటికి గడప శ్రీరామ రక్ష.
డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151