చదువు అయిపోగానే... ఉద్యోగం సంపాదించి కాస్త స్థరిపడ్డాం అనుకుంటే చాలు. సొంతిల్లు కొనాలనే ఆత్రుత పడుతున్నారు నేటి యువత. చేతిలో ఒక ఉద్యోగం ఉన్నా... మరింత సంపాదన వచ్చే మరో ఉద్యోగం కోసం వెంపర్లాడుతున్నారు. ఈ రెండు విషయాలు తప్పేమి కావు. అయితే... వీటి కోసం ఎక్కువగా వెంపర్లాడితే... మీ గుండెకి మీరే ఎసరు పెట్టుకున్నట్లు అవుతుందంటున్నారు నిపుణులు.

సొంతిల్లు, ఉద్యోగం అంటూ విపరీతంగా టెన్షన్‌, తీవ్ర ఒత్తిళ్లకు లోనయ్యే యువతకు మున్ముందు గుండెపోటు, పక్షవాతం ముప్పు ఎదురయ్యే ప్రమాదం ఉందని తాజా అథ్యయనం హెచ్చరించింది.  యుక్తవయసులో నిరంతరం ఆందోళన, ఒత్తిడితో చిత్తయ్యే వారిలో తర్వాతి కాలంలో గుండెపోటుతో పాటు టైప్‌ టూ డయాబెటిస్‌ ముప్పు పొంచిఉందని పేర్కొంది. జీవితారంభంలో ఎదురయ్యే ఎగుడుదిగుళ్లతో రక్తపోటు పెరగడంతో పాటు ఒత్తిడి హార్మోన్‌ కార్టిసాల్‌ ఉత్పత్తి అవుతుందని ఈ భారమంతా ఆయా వ్యక్తులపై తదనంతర కాలంలో గుండెపోటు వంటి విపరిణామాలకు దారితీస్తుందని ఛారిటీ హెల్త్‌ ఫౌండేషన్‌ పరిశోధన వెల్లడించింది.

యువతలో నిలకడ లేమి, ఆర్థిక సమస్యలతో ఈ విషవలయంలో కూరుకుపోతారని ఛారిటీస్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ బిబీ హెచ్చరించారు. యువత ఈ విషయాలను కేవలం సామాజిక సమస్యలుగా పరిగణిస్తుందని అయితే వీటి పర్యవసానాలు ఆరోగ్య సమస్యలుగా పరిణమిస్తాయని స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం ఆవిష్కరించాలని భావిస్తే యువత వ్యక్తిగత, సామాజిక సంబంధాలతో పాటు వారి గృహసంబంధ, ఉపాధి అంశాలపై వారు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఒత్తిడి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని అథ్యయనం తేల్చిచెప్పింది.