Cross legs: నలుగురిలో స్టైల్ మెయిన్ టెయిన్ చేయడానికి కొంతమంది గంటలకు గంటలు కాలు మీద కాలేసుకుని కూర్చొని ఉంటారు. కానీ ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అవేంటంటే..
Cross legs: కాలుమీద కాలేసుకుని కూర్చుంటే వచ్చే ఆనందమే వేరబ్బా. అందులో అదోరకమైన స్టైల్ కూడా. అందుకే కాదా పెళ్లిళ్లు, ఫంక్షన్లు, లేదా నలుగురిలో ఉన్నప్పుడు చాలా మంది ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే ఈ కూర్చుంటే వచ్చే స్టైల్ సంగతి పక్కన పెడితే.. కాలు మీద కాలేసుకుని గంటలకు గంటలు కూర్చోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకే పొజీషన్ లో గంటల తరబడి కూర్చోవడం వల్ల పాదాలు, కాళ్లు మొద్దుబారుతూ ఉంటాయి. ఇది చాలా సహజం. ఇలా ఎందుకు జరుగుతుందంటే.. మోకాలి వెనక భాగంలో ఉన్న పెరోనియల్ అనే నరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతో కాలు తిమ్మరిపట్టడం, స్పర్శ తెలియకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతిరోజూ ఇలా గంటల తరబడి ఒకే పొజీషన్ లో కూర్చోవడం వల్ల ‘ఫుట్ డ్రాప్’ అనే రోగం వచ్చే అవకాశం చాలా ఉంది. ఈ వ్యాధి బారిన పడితే కాలు ముందు భాగాన్ని, కాలి వేళ్లను అస్సలు కదిలించలేరని వైద్యులు చెబుతున్నారు.
ఈ సంగతి పక్కన పెడితే.. ఇలా కాలు మీద కాలేసుకుని కూర్చోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి. క్రాస్ లెగ్ పైన పలు పరిశోధనలు చేశారు. కాగా ఇస్తాంబుల్ ల్లో దీనిపై పెద్ద ఎత్తున పరిశోధన జరిగింది. ఈ పరిశోధన కోసం కొంతమందిని సెలక్ట్ చేసుకుని వారిని ఒక గంట పాటు కాలు మీద కాలేసుకుని కూర్చోమని చెప్పారు. కాగా గంట గడిచే సరికి వారిలో Blood pressure విపరీతంగా పెరిగిందట. అయితే దీని తర్వాత వారిని నార్మల్ గా కూర్చోమని చెప్పారట. ఒక మూడు నిమిషాలు గడిచిన తర్వాత వారి Blood pressure సాధారణ స్థితికి చేరుకుందట. అయితే క్రాస్ లెగ్ వల్ల బ్లడ్ ప్రెజర్ పెరిగినా.. అది తాత్కాలికమే అని పరిశోధకులు చెబుతున్నారు.
ఎందుకిలా జరుగుతుంది?
క్రాస్ లెగ్ వల్ల రక్తపోటు పెరగడానికి రెండు కారణాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. క్రాస్ లెగ్ వల్ల మోకాలిపై ఇంకో మోకాలిని వేసినప్పుడు రక్తం కాళ్ల నుంచి ఛాతి భాగానికి చాలా ఫాస్ట్ గా వెళుతుంది. దాంతో రక్తం గుండె భాగానికి వేగంగా ఎక్కువగా వెళుతుంది. దాంతో Blood pressure పెరుగుతుంది. అంతేకాదు గంటలకు గంటలకు ఒకే పొజీషన్ లో కూర్చోవడం మూలంగా సిరలలో (Veins) Blood circulation speed తగ్గుతుందట. దాంతో కూడా Blood pressure పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజు గంటల తరబడి ఒకే రకమైన స్థితిలో కూర్చోవడం మన ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు. ఎందుకంటే ఇలా గంటలకు గంటలు క్రాస్ లెగ్స్ తో కూర్చోవడం మూలంగా భుజాలు ముందుకు వంగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ముందుకు వంగిపోయి నడవడం అలవాటు అవుతుందట. కాబట్టి రోజూ ఒకే పొజీషన్ లో కూర్చోకుండా అప్పుడప్పుడు నడవడం అలవాటు చేసుకోవాలి.
