చలి పెడుతుందని రోజూ స్నానం చేయకపోతే ఏమౌతుందో తెలుసా?
ఎండాకాలంలో లాగా చలికాలంలో రోజూ స్నానం చేయకుండా ఉండేవారు చాలా మంది ఉన్నారు. కానీ చలి పెడుతుందని ఒక్క రోజు స్నానం చేయకపోతే ఏం జరుగుతుందిలే అననుకుంటే పొరపాటే. అసలు చలికాలంలో స్నానం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
చలికాలంలో చలి విపరీతంగా పెరుగుతుంది. అందుకే ఈ సీజన్ లో చల్లగా ఉండే వాటి జోలికి ఎక్కువగా వెళ్లరు. చలికాలంలో వేడివేడి కాఫీ, ఫుడ్స్, బెడ్ బాగా అనిపిస్తాయి. చాలా మంది చలికాలం వచ్చిందంటే రోజూ స్నానం చేయడమే మర్చిపోతుంటారు. రోజు తప్ప రోజు లేదా రెండు మూడు రోజులకోసారి స్నానం చేస్తుంటారు. కానీ ఎండాకాలమైనా, చలికాలమైనా రోజూ స్నానం చేయాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు చలికాలంలో రోజూ స్నానం చేయకపోతే ఏం జరుగుతుంది? రోజూ స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చలికాలంలో రోజూ స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంటారు
మీరు పరిశుభ్రంగా ఉండాలంటే మాత్రం చలికాలంలో కూడా ప్రతిరోజూ స్నానం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో లాగా మీకు చెమట ఎక్కువగా పట్టకపోవచ్చు. కానీ మీ శరీరం మాత్రం ప్రతిరోజూ నూనెలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. అలాగే చనిపోయిన చర్మ కణాలు, బ్యాక్టీరియా శరీరంపై పేరుకుపోతాయి. మీరు రోజూ స్నానం చేయకపోతే గనుక ఇవి మీ ఒంటికి అంటుకూనే ఉండి మిమ్మల్ని ఎన్నో సమస్యల బారిన పడేస్తారు. మీరు రోజూ స్నానం చేస్తే ఈ మలినాలన్నీ తొలగిపోతాయి. మీ శరీరం శుభ్రంగా ఉంటుంది. చలికాలంలో రోజూ స్నానం చేయడం వల్ల శరీర దుర్వాసన, చర్మ ఇన్ఫెక్షన్లు, ఇతర పరిశుభ్రత సంబంధిత సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. మన శరీరం శుభ్రంగా ఉంటే డ్రై స్కిన్, చర్మ చికాకు తగ్గుతాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ స్నానం చేయకపోతే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. అలాగే లేనిపోని సీజనల్ రోగాలు, ఇతర వ్యాధుల బారిన పడతారు. అదే మీరు రోజూ స్నానం = చేస్తే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. గోరువెచ్చని నీళ్లు శరీరంలో రక్త ప్రసరణను పెంచుతాయి. దీనివల్ల రోగనిరోధక కణాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మెరుగైన రక్త ప్రసరణ జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ చలికాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గోరువెచ్చని నీళ్లతో స్నానం నాసికా మార్గాలను తెరవడానికి సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
అవును.. స్నానం మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. ఎండ సరిగ్గా తగలకపోవడం, సీజనల్ వ్యాధుల వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ కాలంలో గోరువెచ్చని నీళ్లతో చేస్తే ఈ చలికాల బ్లూస్ ను ఎదుర్కోవటానికి ఇదొక సహజ మార్గం. స్నానం చేయడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. రిలాక్స్డ్ గా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించి ఫీల్ గుడ్ హార్మోన్ ను రిలీజ్ చేస్తుంది. దీంతో మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
చల్లని వాతావరణం, ఇంట్లోని వేడి మీ చర్మంలోని తేమను తగ్గిస్తుంది. దీంతో మీ చర్మం పొడి బారుతుంది. పొరలు పొరలుగా మారుతుంది. చికాకు కూడా కలుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల మీ చర్మం హైడ్రేట్ గా అవుతుంది. అలాగే మీరు మాయిశ్చరైజింగ్ సబ్బులను వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. స్నానం మన చర్మాన్ని స్మూత్ గా చేయడానికి సహాయపడుతుంది.
మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది
అవును చలికాలంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల మన కండరాలు సడలుతాయి. అలాగే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత పెరిగిన తర్వాత క్రమంగా చల్లబడుతుంది. అలాగే మీ శరీరానికి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయమని మీ మెదడు మీకు సంకేతం ఇస్తుంది. దీంతో మీరు ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోతారు. ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.