ఎండకాలం తరచూ దాహం వేయడం, నీరు తాగడం సాధారణం. కాబట్టి, ఎప్పుడూ ఓ వాటర్ బాటిల్ వెంట పెట్టుకోవడం కద్దు. కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడటం ముప్పుతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా.. భారీ ప్లాస్టిక్ కంటైనర్లు అయినా.. వాటి నుంచి నీరు తాగడం ప్రమాదకరం అని, ముఖ్యంగా ఎండలో ఎక్కువ కాలం ఉంచిన ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి నీరు తాగడం మరింత ప్రమాదకరం అని వివరిస్తున్నారు. 

న్యూఢిల్లీ: ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో మండే ఎండలు తప్పవు. ఎండకాలంలో దాహార్తిని తీర్చుకోవడానికి ఎప్పుడు వెంట వాటర్ బాటిల్స్ ఉంచుకోవడం సర్వసాధారణం. దాహార్తిని తీర్చుకోవడంలో తప్పులేదు. నీరు తాగి బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి తప్పదు. కానీ, ఎంత మూల్యానికి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను వినియోగించాలి? ఈ ప్రశ్న ఎందుకంటే.. ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడకం సాధారణం అయింది. కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ద్వారా చాలా దుష్పరిణామాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాటికి ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు.

చిన్న వాటర్ బాటిల్స్ మొదలు.. పెద్ద పెద్ద వాటర్ కంటైనర్‌ల వరకు ప్లాస్టిక్‌తో చేసినవి ఏవైనా సరే.. అందులో నీటిని నిల్వ చేసి తాగడం అనేది ప్రమాదకరం అని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో చాలా కాలంపాటు ఉండిన ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీరు తాగడం మరింత ప్రమాదకరం అని చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ ఎండ వేడిమి ప్లాస్టిక్ బాటిల్ ఉష్ణోగ్రత పెరుగుతుందని, పెరిగిన నిర్దిష్ట ఉష్ణోగ్రతల దగ్గర ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి ప్రమాదకరమైన కణాలు నీటిలో కలిసిపోయే ముప్పు ఉన్నదని పేర్కొన్నారు. దీర్ఘకాలం ఎండలో ఉన్న ప్లాస్టిక్ ద్వారా దాని నుంచి విషపూరిత కణాలు అది నిల్వ చేసిన నీరు లేదా ఇతర తిను పదార్థాల్లో కలుస్తాయని వివరిస్తున్నారు.

డాక్టర్ సందీప్ గులాటీ మాట్లాడుతూ, ఈ మైక్రోప్లాస్టిక్స్ కలిసిన నీటిని తాగితే.. పొత్తి కడుపునకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రావొచ్చని వివరించారు. అంతేకాదు, ఇలాగే వాటర్స్ బాటిల్స్ నీటినే వినియోగించడాన్ని కొనసాగిస్తే.. హార్మోన్ల అసమతుల్యం, పీసీఓఎస్, ఒవరియన్ సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రావొచ్చని హెచ్చరించారు.

ప్లాస్టిక్ బాటిల్స్ నీరు తాగితే..

ఎండలో ఉండే ప్లాస్టిక్ బాటిల్ నుంచి డయాక్సిన్ వంటి టాక్సిన్‌ నీటిలోకి విడుదల అవుతాయి. ఈ డయాక్సిన్ గల నీటిని తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ రావొచ్చు. బైఫినైల్ ఏ అనే కెమిల్ ద్వారా డయాబెటిస్, ఒబెసిటీ, సంతాన సమస్యలు, ఆడపిల్లల్లో రుతుస్రావం త్వరగా రావడం వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగితే వ్యాధి నిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుంది. కాలేయ క్యాన్సర్ రావచ్చు. మగవారిలో శుక్ర కణాల సంఖ్యనూ ప్రభావితం చేయవచ్చు.

బాటిల్ వాటర్‌లో మైక్రోప్లాస్టిక్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయని ఫ్రిడోనియాలోని న్యూయార్రక్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. అయితే, ఈ మైక్రోప్లాస్టిక్ తీసుకోవడం ద్వారా మనిషి ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పడానికి ఆధారాల్లేవని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయినప్పటికీ ఈ ప్లాస్టిక్ బాటిల్ అంశం ఇప్పటికీ ఆందోళనకర విషయంగానే ఉన్నది.

కాబట్టి, ఎండలో దీర్ఘకాలం ఉంచిన పెద్ద వాటర్ కంటైనర్లను వినియోగించవద్దని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, నీరు నీడపట్టున ఉండేలా చూసుకోవాలి. 25 డిగ్రీల టెంపరేచర్ దాటకుండా మెయింటెయిన్ చేయాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ కు బదులు గ్లాస్ లేదా మెటల్ బాటిల్‌ ను వినియోగించాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను వినియోగించకపోవడం ఉత్తమం అని నిపుణులు సూచనలు ఇస్తున్నారు.