నలభై ఏళ్లు దాటిన వారికి గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారిన జీవనశైలి, కాలం కారణంగా నలభై ఏళ్లు వస్తే చాలు.. గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. కొన్ని చిట్కాలు ద్వారా గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి. 

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలోనే గుండెపోటు లక్షణాలు కనిపించేవి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. 40 ఏళ్లకే గుండె కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వస్తోంది. నిజానికి 20 ఏళ్లలో కూడా గుండెపోటుతో మరణించిన వారు అధికంగానే ఉన్నారు. గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే కచ్చితంగా 10 చిట్కాలను పాటించాలి. వాటిని ప్రతిరోజు పాటించడం ద్వారా మీరు గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్.చు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించవచ్చు.

ప్రతిరోజూ వ్యాయామం

ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య తగ్గిపోయింది. వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఏరోబిక్ వ్యాయామం చేస్తే గుండె దృఢంగా మారుతుంది. ప్రతిరోజు కనీసం పావుగంట పాటు వాకింగ్ చేయడం వల్ల శరీరానికి తద్వారా గుండెకు మేలు జరుగుతుంది.

సమతులాహారం

పిజ్జాలు, బర్గర్లు తినే కాలం ఇది. అందుకే గుండె జబ్బులు కూడా అధికంగా వస్తున్నాయి. జంక్ ఫుడ్ ను పక్కన పెట్టి ప్రతిరోజు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని అధికంగా తినేందుకు ప్రయత్నించాలి. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి. పంచదార, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది.

బరువు అదుపులో

శరీరం బరువు పెరుగుతున్న కొద్దీ గుండెపై కూడా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మీ ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా మీరు చూసుకోవాలి. బరువు అధికంగా పెరిగితే తగ్గించుకోవాలి. బరువు నిర్వహణకి సరైన ప్రణాళిక వేసుకోవాల్సిన అవసరం ఉంది. పెరిగే బరువు మీకు అధిక రక్తపోటును, డయాబెటిస్ ను, గుండె జబ్బులను తెచ్చిపెడుతుంది.

ధూమపానం

ధూమపానం అలవాటు ఉన్నవారు వెంటనే దానిని మానేయడం ఉత్తమం. ధూమపానం అనేది రక్తనాళాలను దెబ్బతీసే అలవాటు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచేస్తుంది. ధూమపానం మానడం కొంచెం కష్టమే. కానీ వైద్యుల సలహాతో దాన్ని త్వరగా తగ్గించుకోవచ్చు.

మద్యం అలవాటు

చిన్న వయసులోనే మద్యానికి బానిస అవుతున్న వారు అధికంగానే ఉన్నారు. మద్యం త్వరగా ఎక్కువ సేవించే వారిలో రక్తపోటు త్వరగా పెరిగిపోతుంది. రక్తపోటు పెరగడం అనేది గుండెకు హాని కలిగిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం ఎంత తక్కువగా తాగితే అంత మంచిది. లేకుంటే పూర్తిగా మానేయడమే ఉత్తమం.

ఒత్తిడిని తగ్గించుకోండి

ధూమపానం, మద్యపానం, జంక్ ఫుడ్ ఎంత హాని చేస్తాయో ఒత్తిడి కూడా అంతే హాని చేస్తుంది. దీర్ఘకాలికంగా కలిగే ఒత్తిడి గుండె ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ధ్యానం, యోగా వంటివి చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలి. లోతైన శ్వాస వ్యాయమాలు చేస్తూ ఉండాలి.

తగినంత నిద్ర

రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం తగ్గకుండా నిద్రపోవాల్సిన అవసరం ఉంది. నాణ్యమైన నిద్ర అనేది గుండెను రక్షిస్తుంది. నిద్రలేమి వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది.

రెగ్యులర్ గా చెకప్ అవసరం

40 ఏళ్లు దాటిన వెంటనే రెగ్యులర్ గా గుండె జబ్బుల పరీక్షలు చేయించుకోవాలి. స్క్రీనింగ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే ఏ సమస్య అయినా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. దీనివల్ల చికిత్స కూడా సులువు అవుతుంది.

కుటుంబ చరిత్ర ఉంటే

కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బుల చరిత్ర ఉంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గుండె జబ్బులు అనేవి జన్యుపరంగా కూడా వస్తూ ఉంటాయి. నలభై ఏళ్లు దాటిన వాళ్ళు ఎప్పటికప్పుడు గుండె పరీక్షలు చేయించుకోవడం ద్వారా ముందస్తుగానే గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు.