మరో 18 సంవత్సరాల నాటికి ‘ఊపిరితిత్తుల’ క్యాన్సర్‌తో మహిళల మరణాల సంఖ్య 43 శాతం పెరుగుతుందని తాజా అధ్యయనం నిర్ధారించింది. తద్భిన్నంగా రొమ్ము క్యాన్సర్‌తో మరణించే మహిళల సంఖ్య తొమ్మిది శాతానికి తగ్గిపోతుందని ఆ అధ్యయనం పేర్కొంది. 52 దేశాల్లో మహిళల పరిస్థితిపై నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి. 

అంతర్జాతీయంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మహిళల మరణాలు 2015లో 11.2 శాతం ఉంటే, 2030 నాటికి 16 శాతానికి పెరుగుతాయి. అత్యధికంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధితో మరణించే వారు యూరప్, పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఉన్నారు. తద్భిన్నంగా అమెరికా, ఆసియా ఖండ దేశాల్లో ఊపిరితిత్తి క్యాన్సర్ మరణాలు 2015లో 17.8 శాతమైతే, 2030 నాటికి స్వల్పంగా తగ్గి 17.6 శాతానికి చేరాయని ఈ సర్వే నిర్ధారిస్తోంది. 

సర్వే ప్రచురణకర్త జోస్ ఎం మార్టినెజ్ - సాంచెజ్ మాట్లాడుతూ టుబాకో వల్ల వచ్చే వ్యాధుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందన్నారు. యూరప్, పసిఫిక్ మహా సముద్ర పరిధిలోని దేశాల మహిళలు స్మోకింగ్ చేయడం సామాజికంగా ఆమోదయోగ్యమే. అమెరికా, ఆసియా ఖండ దేశాల్లో స్మోకింగ్ అలవాటుగా మారింది. ఆయా దేశాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్ల జరిగే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి పొగాకు ఉత్పత్తులను మహిళలు వాడటమే ప్రధాన కారణం.

అంతర్జాతీయంగా రొమ్ము క్యాన్సర్ మరణాలు 2015లో 16.1 శాతం ఉంటే, 2030 కల్లా 14.7 శాతానికి తగ్గుముఖం పడుతుందని ఈ సర్వే తెలిపింది. యూరప్ సభ్య దేశాల్లోనే రొమ్ము క్యాన్సర్ తగ్గుముఖం పడుతున్నదని తెలుస్తున్నది. స్థూలంగా ఆసియా ఖండంలో రొమ్ము క్యాన్సర్ మరణాలు ఎక్కువగా ఉన్నాయని మార్టినెజ్ సాంచెజ్ వివరించారు. పాశ్చాత్య దేశాల్లో గతంలో మహిళలు పాటించిన పద్ధతుల వైపు భారతీయులు, ఆసియా ఖండ దేశాల మహిళలు పరుగులు తీయడంతోనే రొమ్ము క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్ గురించి మహిళల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉన్నదంటున్నారు. సంపన్న దేశాల్లో రొమ్ము క్యాన్సర్ మరణాల స్థానాన్ని ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలు ఆక్రమించుకున్నాయని వైద్య నిపుణులు తెలిపారు.