కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతమందిలో దీర్ఘకాలం పాటు కొన్ని కోవిడ్ లక్షణాలు అలాగే ఉంటాయి. వీటి వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ లాంగ్ కోవిడ్ పెద్దలనే కాదు పిల్లల్ని కూడా పట్టిపీడిస్తోందని నిపుణులు చెబుతున్నారు.  

కాస్త తగ్గుముఖం పట్టిందనుకున్న సమయంలోనే మళ్లీ కోవిడ్ వ్యాప్తి దారుణంగా కొనసాగుతోంది. అందుకే ప్రభుత్వాలు సైతం ప్రజలను హెచ్చరిస్తున్నారు. కోవిడ్ జాగ్రత్తలను పాటించాలని సూచిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే చాలా మంది కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా వారాలు, నెలలు లేదా సంవత్సరాల కాలం పాటు దాని సంబంధిత సమస్యలను ఎదుర్కోంటున్నారు. దీనినే ‘లాంగ్ కోవిడ్’అంటారు. 

దీర్ఘకాలిక కోవిడ్ వల్ల రోజు వారి జీవితం ఎంతో ప్రభావితమవుతుంది. దీనివల్ల శారీరక ఆరోగ్యం దెబ్బతినడమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని పలు పరిశోధనలు వెల్లడించాయి కూడా. 

అయితే ఈ లాంగ్ కోవిడ్ కేవలం పెద్దల్లో మాత్రమే కనిపిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పెద్దల మాదిరిగానే పిల్లల్లో కూడా తక్కువ లేదా ఎక్కువ తీవ్రత కలిగిన లక్షణాలు కనిపిస్తున్నాయట. సంవత్సరం నిండని పిల్లల నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లల్లో లాంగ్ కోవిడ్ సమస్యలు కనిపించాయట. దీనిపై యూకేకు చెందిన పరిశోధకుల బృందం అధ్యయనం చేసింది.

ఈ అధ్యయనం ప్రకారం.. పిల్లలలో కనిపించే దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు ఇలా ఉన్నాయి..

మూడేళ్ల వయసు వరకు ఉన్న పిల్లల్లో 'లాంగ్ కోవిడ్' లక్షణాలు: 

ఆకలి లేకపోవడం, మూడ్ స్వింగ్స్, దగ్గు, పొత్తికడుపు నొప్పి, చర్మంపై మచ్చలు వంటి లక్షణాలు పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల వయస్సుగల వారిలో కనిపిస్తాయి. ఒక సంవత్సరం కూడా లేని పిల్లలలో.. ఆకస్మిక ఏడుపు, పొత్తికడుపు నొప్పి, ఆహారం తినకపోవడం, మొండితనం, పొత్తికడుపు నొప్పి కారణంగా ఏడుపు వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి.

నాలుగు నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో...

నాలుగు నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల్లో.. చర్మంపై మచ్చలు ఎక్కువ అవడం, మూడ్ స్వింగ్స్, విషయాలపై ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. అలాగే కోపం పెరగడం, మొండిగా ప్రవర్తించడం వంటి లక్షణాలు కూడా పిల్లల్లో కనిపిస్తాయి. చిరాకు కూడా ప్రభావం చూపుతుంది. ఇలాంటి పిల్లలు ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. వీరికి కౌన్సిలింగ్ ఇప్పించడం లేదా అవసరమైన చికిత్సలు ఇప్పించవచ్చు. ఇలాంటి పిల్లలు తల్లిదండ్రులు సపోర్ట్ ఇవ్వాలి. వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎప్పటికప్పుడు వారి ఆలోచనలను పంచుకోవాలి. అండగా ఉన్నానన్న భరోసాను కల్పించాలి. 

12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో...

విషయాలపై దృష్టి పెట్టలేకపోవడం , అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, మూడ్ స్వింగ్స్ వంటి లాంగ్ కోవిడ్ లక్షణాలు ఈ పిల్లల్లో కనిపిస్తాయి. అంతేకాదు ఈ పిల్లలు చదువులో వెనకబడతారు. క్రీడలలో ఉత్సాహం చూపరు. చిరాకు, ఆత్మవిశ్వాసం లేకపోవడం, కోపం, మొండితనం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్యలు ఎక్కువైతే ఖచ్చితంగా పిల్లలను వైద్యులకు చూపించాలని నిపుణులు చెబుతున్నారు.