చిన్న వయసులోనే అపారమైన తెలివితేటలు చూపించే పిల్లలకు ఐక్యూ ఎక్కువగా ఉంది అంటూ తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. ఇంకొందరైతే ఏకంగా ఐక్యూ టెస్ట్ లు కూడా చేపిస్తుంటారు. అయితే.. ఒక రకం పిల్లల్లో ఐక్యూ పవర్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏంటా రకం అనుకుంటున్నారా.. ఇంట్లో మాతృభాష మాట్లాడే పిల్లల్లో ఐక్యూ ఎక్కువగా ఉంటుందట.

చాలా భాషలు వచ్చిన పిల్లల్లో జనరల్ గా కాస్త ఐక్యూ పవర్ ఎక్కువగా ఉంటుంది. అయితే.. చాలా భాషలు వచ్చి కూడా.. ఇంట్లో మాతృభాష మాట్లాడే పిల్లల్లో ఇతరులతో పోలిస్తే.. మరింత ఎక్కువ ఐక్యూ ఉంటుందట. ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ విషయంలో ఆసక్తికర అంశాలు వెలుగు చూసినట్లు వర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు. 

స్కూలులో ఒక భాష నేర్చుకొంటూ.. ఇంటికొచ్చి కుటుంబసభ్యులతో మాతృభాషలో మాట్లా డే పిల్లలు ఇతరుల కంటే ఎక్కువ తెలివి తేటలను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్‌లో ఉంటున్న 7-11 ఏళ్ల వయస్సు కలిగిన 100 మంది టర్కిష్‌ పిల్లలను ఎంపిక చేశారు. స్కూలులో ఆంగ్లం, ఇంట్లో టర్కిష్‌ మాట్లాడుతున్న వారు.. రెండు చోట్లా ఆంగ్లంలోనే మాట్లాడుతున్న వారిగా విభజించి.. వారి మధ్య ఐక్యూ స్థాయి ఎలా ఉన్నాయో పరిశీలించారు.

 మాతృభాషలో కొత్త విషయాలు నేర్చుకొన్నవారు.. ఇతర భాషల్లో వాటిని ఎలా పిలుస్తారో తెలుసుకొనేందుకు ఆసక్తి కనబరిచినట్లు పరిశోధకులు తెలిపారు. అదే కొత్త విషయాన్ని వేరే భాషలో తెలుసుకొన్న పిల్లలు దానిని అర్థం చేసుకోవడానికే చాలా కష్టపడుతున్నట్లు కనుగొన్నారు. అందుకే పిల్లలకు ఇంట్లో తప్పకుండా మాతృభాషలోనే కొత్త విషయాలు తెలియజేసి.. తర్వాత ఇతర భాషల్లో దానిని ఏమంటారో వివరించాలని సూచిస్తున్నారు. ఇలాంటి సౌలభ్యం స్కూళ్లలో ఉండదనే విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోకూడదని చెబుతున్నారు.