హోలీ అంటేనే రంగుల పండుగ. ఆ రోజు అందరూ సంతోషంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అయితే బయట కొనే రంగుల్లో కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఈజీగా రంగులను తయారుచేసుకునే చిట్కాలను ఇక్కడ చూద్దాం.
అతిపెద్ద పండుగల్లో హోలీ ఒకటి. హోలీ పండుగ రోజున రంగులతో ఆడుకోవడం ప్రత్యేకమైన ఆనందాన్ని ఇస్తుంది. హోలీలో అపరిచితులు కూడా స్నేహితులుగా మారతారని చెబుతుంటారు. ఆ రోజున రంగులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే మార్కెట్ నుంచి కొన్న రంగులు చాలావరకు రసాయనాలతో నిండి ఉంటాయి. వాటిని చల్లుకోవడం వల్ల చర్మానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే ఈజీగా రంగులు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
మైదా లేదా మొక్కజొన్న పిండిని ఉపయోగించి ఇంట్లో హోలీ రంగులు తయారు చేసుకోవచ్చు. ఈ రంగులు తయారు చేయడం చాలా సులభం. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి సరదాగా ఈ రంగులను తయారు చేసుకోవచ్చు.
పసుపు రంగు ఎలా తయారు చేయాలి?
హోలీలో పసుపు రంగు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ రంగును తయారు చేయడానికి, పసుపు, శనగపిండిని కలపండి. శనగపిండి లేదా మైదాలో పసుపు కలిపి కూడా పసుపు రంగును తయారు చేయవచ్చు. ఈ రంగు చర్మానికి మంచిది. స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. చర్మంపై దురద లాంటివి రాకుండా ఉంటాయి.
ఎరుపు రంగు ఎలా తయారు చేయాలి?
ఎరుపు రంగు లేకుండా హోలీ పండుగ అసంపూర్ణంగా అనిపిస్తుంది. ముదురు ఎరుపు రంగు చేయడానికి మీకు మొక్కజొన్న పిండి, ఎర్ర చందనం పొడి అవసరం. ఈ రెండింటిని కలిపి ఎరుపు రంగు తయారు చేయవచ్చు. ఎర్ర మందార పువ్వులను మెత్తగా రుబ్బి కూడా ఎరుపు రంగు గులాల్ తయారు చేసుకోవచ్చు.
గులాబీ రంగు ఎలా తయారు చేయాలి?
గులాబీ రంగును తయారు చేయడానికి, బీట్‌రూట్‌ను ఉపయోగించవచ్చు.ఈ సహజ రంగును తయారు చేయడానికి బీట్ రూట్ ఆరబెట్టి ఆ తర్వాత దాన్ని పొడిగా చేసి మైదా లేదా కార్న్ పౌడర్ లో కలపాలి.
ఆకుపచ్చ రంగును ఎలా తయారు చేయాలి?
పాలకూరను మెత్తగా రుబ్బి మొక్కజొన్న పిండితో కలపండి. ఈ మిశ్రమాన్ని ఆరబెడితే రంగు తయారు అవుతుంది. హోలీ ఆడుకోవడానికి దీన్ని ఉపయోగించండి. ఈ రంగుల వల్ల చర్మానికి హాని కలుగుతుందనే భయం ఉండదు. సేఫ్ గా, సంతోషంగా హోలీ ఆడుకోవచ్చు.
